సాక్షి, హైదరాబాద్: సుదీర్ఘ లాక్‌డౌన్ కొనసాగింపు కారణంగా.. నెలరోజులకు పైగా ఇళ్లకే పరిమితం కావడం, గతంలో మాదిరిగా రోజువారీ ఉద్యోగం, వ్యాపారం, చదువు, ఇతర పనుల నిమిత్తం బయటకు వెళ్లాల్సిన అవసరం లేకపోవడంతో వివిధ వర్గాల ప్రజల ఆహారం, నిద్ర, ఇతర అలవాట్ల విషయంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఏది పడితే అది ఎక్కువగా తినేయడం, వ్యాయామం లేకపోవడం, ఉదయమే లేచి ఆఫీసుకు వెళ్లాలన్న అవసరం లేకపోవడం, సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు, కంప్యూటర్లు, టీవీలతోనే ఎక్కువ సమయం గడపడం వంటి వాటితో రాత్రిపూట నిద్రపై ప్రభావం చూపుతోంది. పై వ్యాపకాల్లో మునిగి తేలడం, ఎక్కువగా సోషల్ మీడియా మాధ్యమాల్లోనే గడపటం, వెబ్ సిరీస్‌లు, సినిమాలు, ఫోన్లలో చాటింగ్‌లతో గంటల కొద్దీ గడుపుతుండటంతో యువతతో పాటు మధ్య వయస్కులు కూడా అర్ధరాత్రి దాటాక ఏ ఒంటి గంటకో, రెండింటికో నిద్రపోవడం మధ్యాహ్నం ఏ 11, 12 గంటలకో నిద్ర లేవడం వంటివి చేస్తున్నారు.
ఆలస్యంగా నిద్రపోవడం, ఆలస్యంగా లేవడం వల్ల ‘జీవ గడియారం’లో మార్పులు చోటుచేసుకుంటున్నాయని డాక్టర్లు, సైకాలజిస్ట్‌లు చెబుతున్నారు. ఈ విధంగా అపసవ్య వేళ్లలో వల్ల బద్ధకం ఆవరించి రోజంతా అన్యమనస్కంగా ఉండేలా చేస్తోందన్నారు. దీనిని అధిగమించేందుకు కాఫీలు, టీలు ఎక్కువగా తాగితే డీహైడ్రేషన్‌కు దారితీస్తుందం టున్నారు. నిద్రకు 2 గంటల ముందు వరకు మొబైళ్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు ఉపయోగించొద్దని, సోషల్ మీడియాలో గడపటం తగ్గించాలని, మనస్సుకు ఆహ్లాదాన్ని కలిగించే సంగీతం వినాలని సూచిస్తున్నారు. ‘సాక్షి’ ఇంటర్వూ్యల్లో వివిధ అంశాలపై వారు వెలిబుచ్చిన అభిప్రాయాలు వారి మాటల్లోనే...
బరువు పెరుగుదలతోనూ సమస్యలే..
‘నిద్రలేమి, స్లీపింగ్ డిజార్డర్ల వంటివి ఎక్కువగా అధిక బరువు, ఊబకాయమున్న వారిలో కనిపిస్తుంటాయి. లాక్‌డౌన్ సందర్భంగా తినే ఆహారం అధికం కావడం, వ్యాయామం లేకపోవడం వంటి కారణాలతో తాత్కాలికంగా బరువు పెరుగుదల సంభవిస్తోంది. ఇది కూడా నిద్ర సరిగా రాకపోవడానికి దారితీస్తుంది. సరిగ్గా నిద్రపోనందున చురుగ్గా లేకపోవడం, దేనిపైనా దృష్టి కేంద్రీకరించక పోవడం, నిరాసక్తంగా ఉండడం వంటివి అనుభవంలోకి వస్తాయి. ఈ పరిస్థితిని అధిగమించేందుకు మితాహారంతో పాటు ప్రాణాయామం, యోగా, తేలికపాటి వ్యాయామం వంటివి క్రమం తప్పకుండా చేయాలి. ఇళ్లకే పరిమితం కావడం వల్ల ఆదివారాలు ఎలా ఐతే రిలాక్స్‌డ్‌గా ఉంటామో, ప్రతీరోజూ అలానే అనిపిస్తుంటుంది.
ఉదయం పూట ఎక్కువగా నిద్ర రావడం, రాత్రి పడుకున్నా నిద్ర రాకపోవడం వంటి సమస్యలొస్తాయి. 30 నుంచి 60 ఏళ్లలోపు ఉన్నవాళ్లు కచ్చితంగా ఏడెనిమిది గంటలు నిద్రపోవాలి. ఆక్సిజన్ శాతాలు తగ్గినా, శ్వాస సరిగ్గా అందకపోయినా ఇబ్బందులు వస్తాయి. మెదడుకు సరిగ్గా రక్తప్రసారం కాక ఎప్పటికప్పుడు డిస్టర్బ్‌డ్‌గా ఉంటుంది. ఈ కారణంగా ఏర్పడే మైక్రో అరౌజల్స్ వల్ల గాఢ నిద్రలోకి వెళ్లినా డిస్టర్బ్ అవుతారు. రాత్రి సరిగ్గా నిద్రపోకపోవడం లేదా వేళా పాళా లేకుండా ఏ అర్ధరాత్రి దాటాకో నిద్రపోతే ఉదయం పూట ఎప్పుడూ నిద్ర వస్తున్నట్టే ఉంటుంది. పగటి పూట నిద్రను ఆపుకునేందుకు సిగరెట్లు, కాఫీ, టీలు తాగడం వంటివి ఎక్కువగా చేస్తుంటారు. ఇది అస్సలు మంచిది కాదు.’ – స్లీపింగ్ డిజార్డర్స్ స్పెషలిస్ట్ విశ్వనాథ్ గెల్లా
వారం పాటు అలా ఉంటే డాక్టర్లను సంప్రదించాలి..
‘స్లీపింగ్ ప్యాట్రన్లలో మార్పులు ఆదుర్దా, ఆందోళనలు, కుంగుబాటుకు దారితీస్తాయి. నిద్రకు అంతరాయం ఏర్పడితే లేదా అతి నిద్ర వల్ల జీవన విధానం కొంత డిస్టర్బ్ అవుతుంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో చుట్టుపక్కల ఉన్న వాతావరణం, భయం గొలిపేలా ఆలోచనలు, పాల ప్యాకెట్లు, కూరగాయలు, పండ్లు అమ్మేవాళ్ల నుంచి కరోనా వస్తుందా? బయటకు వెళితే ఎవరి నుంచైనా ఈ వైరస్ సోకుతుందా అనే భయాలు తీవ్రమై ఏదైనా ఎక్కువగా తినేయడం లేదా ఎప్పుడూ ఏదో ఒకటి తినాలని అనిపించడం ఇది పెద్ద ఎత్తున ఒత్తిడికి కారణమవుతుంది.
ఉద్యోగాలుం టాయా లేదా, ఆర్థిక పరిస్థితి కుదుటపడుతుందా లేదా భవిష్యత్ ఎలా ఉంటుందోనన్న భయాలు తీసుకునే ఆహారం, నిద్రపై ప్రభావం చూపుతాయి. ఇష్టం వచ్చినట్టు తినడం, నిద్రలేకపోవడం వంటి వాటితో స్లీపింగ్ ప్యాట్రన్లు మారుతున్నాయి. వారం రోజుల పాటు ఎవరైనా ఎక్కువగా ఆదుర్దా పడటం, ఆందోళన చెందడం, భవిష్యత్‌పై భయాందో ళనలు వ్యక్తం చేస్తున్నట్టు కనిపిస్తే వెంటనే తప్పనిసరిగా ఆన్‌లైన్‌లోనైనా సైకాలజిస్ట్‌ను సంప్రదించి తగిన సలహాలు, సూచనలు తీసుకోవాలి. చిన్న చిన్న వ్యాయామాలు, నడక, యోగా వంటివి చేయడం, గార్డెనింగ్, ఇంటిపనులు చేయడం, మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం ద్వారా ఒత్తిళ్లను అధిగమించొచ్చు..’ – సైకాలజిస్ట్, సి.వీరేందర్
Comments
Please login to add a commentAdd a comment