♦ వీటి పెంపకం హోదాకు చిహ్నం..
♦ చూస్తే చాలనే స్థాయి వీటి సొంతం..
♦ ఈ చరణాయుధాల కథే వేరు..
కోడి.. ఈ మాట వింటే (శాకాహారులను మినహాయిస్తే) నోరూరనిదెవ్వరికి? పండగల్లోనో, మరే పవిత్రమైన రోజుల్లోనో తప్పితే అమాంతం చప్పరించేయాలన్న ఆరాటం కలగనిదెవ్వరికి? కానీ మన మధ్యనే ఉన్న కొందరు మాత్రం ఈ ప్రత్యేకమైన కోళ్లు చూడడం అబ్బురంగా భావిస్తారు! ఈ ప్రాంతంలో పెద్దగా లభించని పొట్టి ముక్కు, పొడుగు తోక రకం కోళ్లను పెంచడమే ఓ స్టేటస్ సింబల్‌గా భావిస్తారు! వీటి ఖరీదులు వేలలో ఉన్నా మురిపెంగా కొనుక్కుంటారు. కొందరు వీటిని విదేశాలకు ఎగుమతి చేస్తారు. ఇంతా చేసి వీటిని పోటీలకు పంపరు.. కూరగా చేయరు! జస్ట్.. స్టేటస్ సింబల్‌గా ఇంటి ముందు పెరిగే ఈ కోళ్ల కథా కమామిషు ఇదీ..
మామూలుగా కోడి అంటే ఆహారంగానో, పండగ వేళ వినోదంగానో భావించే మనకు కొందరు కోళ్లకు హోదాకు చిహ్నంగా పెంచుతారంటే ఆశ్చర్యంగా ఉంటుంది కానీ ఇది నిజం. బెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటు కొన్నిదేశాలలో ఇంటి ముందు ఇటువంటి కోళ్లు పెరగడాన్ని స్టేటస్ సింబస్‌గా భావిస్తారు. చరణాలే( కాళ్లు) ఆయుధంగా పోరాటం చేస్తుంది కాబట్టి చరణాయుధంగా కూడా వ్యవహరిస్తారు.. వంపు తిరిగిన ముక్కుతో పాటు పొడుగాటి తోక ఉండే ఈ కోళ్లను ఎంతో ప్రత్యేకంగా చూస్తారు. ఇంటి ముందు కట్టిఉంచిన కుక్కుటాన్ని ఆగిచూసి వెళ్లడం వీటిని గౌరవించడంగా భావిస్తారు. వీటిని పందేలకు పంపరు. ఆహారానికి చంపరు. మనసు కలతలకు దూరం కావడానికి సాధనంగా పరిగణిస్తారు.
ఇక్కడివి కావు..
పొట్టి ముక్కు, పొడుగాటి తోక అందాలను బట్టి వీటి ధరలు కూడా అదురుతుంటాయి. తమిళనాడుకు చెందిన సేలం, దిండిగల్ పట్టణాలలో ఎంపికచేసిన వీటిని ప్రత్యేక శ్రద్ధతో పెంచుతారు. దేశంలో వివిధ ప్రాంతాలకు రవాణా అవుతాయి. అక్కడ నుంచి విదేశాలకు కూడా వీటిని పంపిస్తారు. భీమిలి డివిజన్‌లోని ఈ మండలానికి చెందిన అమనాం పంచాయతీ, పద్మనాభం మండలంలోని రేవిడి పంచాయతీలో ఔత్సాహికులు వీటిని కొనుగోలుచేసి పునరుత్పత్తి అనంతరం విక్రయిస్తుంటారు.
వీటిలో పుంజు రకాలలో పొడుగాటి తెల్లతోక కలిగిన రసంగి రకం రెండేళ్ల పక్షి రూ. 40 వేలకు, మూడేళ్లు వయసు కలిగిన నల్ల సవల రూ. 30 వేలకు, తొమ్మిది మాసాల వయసు గల డేగ రకానికి చెందిన పక్షి రూ.40 వేలకు అమ్ముడుపోతుంటాయి. వీటి తోకలు రెండుమీటర్ల వరకు ఉంటాయి. ఇలాంటి పక్షుల ధరలు తోక పొడవు బట్టి అత్యధికంగా రూ.80వేల నుంచి లక్ష వరకు పలుకుతుంటాయి. వంపు తిరిగిన ముక్కుల్లాంటి పెట్టలు కూడా ఒక్కొక్కటి రూ.8 వేల వరకు అమ్ముడుపోతున్నాయి. వీటిలో నల్ల కక్కెర, డేగపెట్ట, నల్ల సవల పెట్ట, రసంగి పెట్ట, కగర పెట్ట, తెల్ల సవల, ఎర్ర కక్కెర వంటి రకాలకు మంచి గిరాకీ ఉంటుంది.
జూదానికి దూరం
మామూలుగా సంక్రాంతి, దసరా వంటి పండగల కోసమే కోళ్లకు ట్రైనింగ్ ఇచ్చి పెంచేవారున్న గ్రామాలలో కూడా వీటిని ప్రత్యేకశ్రద్ధతో పెంచుతున్నారు. కానీ వీటిని పొరపాటున కూడా పందాలకు దించరు. అంతేకాకుండా కొన్ని పుంజులను పునరుత్పత్తికి కూడా వినియోగించరు. దీనివలన తోక ఈకలు ఊడిపోయి వీటి అందం తగ్గుతుందని అంటారు. పెట్టలను మాత్రం గుడ్లుపెట్టిన తరువాత పొదిగించి విక్రయిస్తుంటారు. ఇంత ఖరీదైన కోళ్లను ఆహారంగా తీసుకోవడానికి పెంపకందారులకు మనసొప్పదు. కొన్నిప్రాంతాలలో పండగ సమయాలలో వీటికి అందాల పోటీలు నిర్వహించడం విశేషం.