రెండు లక్షల పుస్తకాలు చదివానన్న స్వయం ప్రకటిత మేధావి ఆయన.. విలువల గురించి, అనుబంధాల గురించి ఊగిపోతూ ప్రసంగించడం ఆయనకు అలవాటు.. అందరూ తనలాగే ఆలోచించాలని, తన మార్గంలోనే నడవాలని ప్రవచన పలుకులు పలకడం కూడా ఆయనకే సొంతం. ‘చంద్రబాబు చేత.. చంద్రబాబు కొరకు.. చంద్రబాబు యొక్క..’ అంటూ అందరూ ఆ బాబు బాగు కోసమే పరితపించాలని పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేసిన నేత. ఎన్నెన్నో నీతులు చెప్పే ఈ నేత నిబంధనలకు విరుద్ధంగా పార్టీ కార్యాలయం చిరునామాతో ఓటు పొందడం ఇప్పుడు చర్చనీయాంశం. దెయ్యాలు వేదాలు వల్లించడం అంటే ఇదేమరి.
సాక్షి, అమరావతి : ఓటు దొంగలే.. దొంగా దొంగా అని అరుస్తున్నారు. మంగళవారం రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్‌కుమార్‌కు ‘రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో దొంగ ఓట్లు నమోదవుతున్నాయి’ అని స్వయంగా ఫిర్యాదు చేసిన జనసేన అధినేత పవన్‌కళ్యాణ్.. రాష్ట్రంలో నమోదు చేసుకున్న ఓటుపై ‘అదీ దొంగ ఓటే’ అన్న చర్చ ఉంది.
జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయాన్నే తన నివాసంగా పేర్కొంటూ ఆయన ఓటు పొందారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఆయన ఓటు ఏజీజడ్ 3083045 గుర్తింపు కార్డు నంబరుతో గుంటూరు జిల్లా మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని 197వ నంబరు పోలింగ్ బూత్ పరిధిలో ఉంది. ఓటర్ లిస్టులో ఆ ఓటు ఇంటి నంబరు 11–1903గా పేర్కొన్నారు.
అయితే మంగళగిరి పట్టణ పరిధిలో ఆ ఇంటి అడ్రసు గురించి ఆరా తీస్తే అది జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయం అడ్రసేనని స్పష్టమైంది. కొత్తగా ఒక ఇంటి చిరునామాతో ఓటు నమోదు చేసుకోవడానికి కొన్ని నియమ నిబంధనలు స్పష్టంగా ఉన్నాయని, ఈ లెక్కన ఒక పార్టీ కార్యాలయం అడ్రసుతో ఓటు నమోదు దొంగ ఓటు కిందకే వస్తుందని అధికారులు చెబుతున్నారు.
ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారుల అవగాహన కోసం కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేకంగా రూపొందించి, జారీ చేసిన వివిధ రకాల నిబంధనావళిలో ఒకటైన.. ‘మ్యానువల్ ఆన్ ఎలక్ట్రోల్ రోల్స్’ ప్రకారం కొత్తగా వేరొక అడ్రసుతో ఓటరు నమోదుకు ఇంటి అడ్రసును ‘ఆర్డనరీ రెసిడెన్స్’ పేరుతో ప్రత్యేకంగా విశదీకరించారు.
ఈ అంశంపై గౌహతి హైకోర్టు వెలువరించిన ఒక తీర్పు ప్రకారం ఇంట్రి అడ్రసు అంటే.. శాశ్వతంగా నివాసం ఉండేది అని కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల పుస్తకంలో స్పష్టంగా పేర్కొంది. టెంపరరీ లేదా క్యాజువల్ నివాసంగా అది ఉండకూడదని ఆ నిబంధనలో స్పష్టంగా ఉంది. ‘రెగ్యులర్‌గా రాత్రివేళ నిద్రించే ప్రాంతాన్నే’ ఆ వ్యక్తి ఆర్డనరీ రెసిడెన్స్‌గా గుర్తించాలని స్పష్టం చేసింది. కానీ జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ అప్పడప్పుడు హైదరాబాద్ నుంచి రాష్ట్రానికి వచ్చినప్పుడు ప్రైవేట్ హోటల్‌లో బస చేస్తుంటారు.
పార్టీ విధుల్లో భాగంగా హైదరాబాద్ నుంచి మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయానికి వచ్చి వెళ్తుంటారు. అలాంటప్పుడు పార్టీ కార్యాలయం ఆయన శాశ్వత నివాసం ఎలా అవుతుందన్న విమర్శలున్నాయి. ఈ లెక్కన మంగళగిరి పార్టీ కార్యాలయం అడ్రసుతో ఆయన ఆరు నెలల ముందు నమోదు చేసుకున్న ఓటు.. దొంగ ఓటు కిందకే వస్తుందని అధికారుల స్థాయిలో చర్చ సాగుతోంది.
ఆ చిరునామాలో పవన్ ఓటు మాత్రమే..
2019 ఎన్నికల్లో రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసిన పవన్ కళ్యాణ్.. తన ఎన్నికల అíఫిడవిట్‌లో తన కుటుంబ సభ్యుల వివరాలలో భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయం అడ్రసు 11–1903తో ఇప్పుడు పవన్ తన ఒక్కరి ఓటు మాత్రమే నమోదు చేసుకోవడం విశేషం.
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2019 ఎన్నికల సమయంలో విజయవాడ తూర్పు నియోజకవర్గ పరిధిలోని 91వ పోలింగ్ బూత్‌లో పవన్ తన ఓటు నమోదు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆరు నెలల కిత్రం మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయ అడ్రసుకు ఓటును మార్చుకున్నారని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
తమ్ముడి బాటలోనే అన్న నాగబాబు
రాష్ట్రంలో పవన్‌కళ్యాణ్ నమోదు చేసుకున్న ఓటు దొంగ ఓటు.. అని చర్చ సాగుతున్న తరుణంలో.. అతని సోదరుడు నాగబాబు కూడా దొడ్డి దారిన రాష్టంలో దొంగ ఓట్ల నమోదుకు పూనుకున్నారు. హైదరాబాద్‌లో నివాసం ఉండే నాగబాబు మొన్నటి తెలంగాణ ఎన్నికల పోలింగ్ ముగిసిన మరుసటి రోజు అంటే 2023 డిసెంబరు 4 తేదీన మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని తాడేపల్లి పట్టణ పరిధిలో వడ్డేశ్వరం – రాధా రంగ నగర్‌లోని 5–263 ఇంటి అడ్రసు పేరుతో అన్‌లైన్‌లో ఓటుకు దరఖాస్తు చేశారు.
నాగబాబు, ఆయన భార్య, కూతురు నిహారిక, కుమారుడు వరుణ్‌తేజ్ (సినీ నటుడు), కోడలు లావణ్య త్రిపాఠి (సినీ నటి) కలిపి మొత్తం ఆరుగురు ఆ ఇంటి అడ్రసులో నివాసం ఉంటున్నట్లు పేర్కొంటూ ఓట్లు నమోదు ఫారాన్ని అన్‌లైన్‌లో నమోదు చేశారు. అయితే ప్రాథమిక స్థాయిలో బూత్ లెవల్ అధికారి (బీఎల్‌వో) పరిశీలనలో నాగబాబు గానీ, వారి కుటుంబం గానీ ఆ అడ్రసులో నివాసం ఉండడం లేదని తేలింది. ఈ ఇల్లు జనసేన పార్టీ అభిమానిదని స్థానికులు పేర్కొన్నారు.
ఆ తర్వాత కూడ మంగళగిరి నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఓటు నమోదు ప్రక్రియలో భాగంగా నాగబాబు, ఆయన కుటుంబ సభ్యులు తాడేపల్లి తహాసీల్దార్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలంటూ ఆ ఇంటి తలుపులకు నోటీసులు అంటించి వెళ్లారు. అయితే నాగబాబు, ఆయన కుటుంబ సభ్యులందరి తరుఫున సంబంధిత అడ్రసులో పేర్కొన్న ఇంటి యజమానే అధికారుల ముందు హాజరైనట్టు అధికార వర్గాలు తెలిపాయి.
ఇక్కడ నివాసం.. అక్కడ వ్యాపారమట!
అధికారుల విచారణ సమయంలో నాగబాబు తాను తాడేపల్లిలో నివాసం ఉంటున్నానని, అయితే ప్రస్తుతం వ్యాపార నిమిత్తం హైదరాబాద్‌లో ఉన్నందున స్వయంగా విచారణకు రాలేకపోయినట్టు తాను సంతకం చేసిన ఒక పేపరు ఆ ఇంటి యజమాని ద్వారా పంపారు. మరో ఇద్దరు ఇలాగే పేపర్‌పై రాసి.. దానిని ఫొటో తీసి ఆ ఇంటి యజమాని ద్వారా పంపారు. మిగిలిన మరో ముగ్గురి నుంచి ఎలాంటి అఫిడవిట్ లేదని తెలిసింది.
మొత్తంగా ఆ అడ్రసులో పేర్కొన్న ఇంటి యజమానే నాగబాబు కుటుంబ సభ్యులు ఆరుగురి తరుఫున విచారణకు హాజరయ్యారు. ఆ ఇంటి అడ్రసులో నాగబాబు కుటుంబం నివాసం ఉంటడం లేదని అధికారులు నిర్ధారించుకుని, ఆ ఆరుగురి ఓట్లను తిరస్కరించారు. సినీ నటుడిగా, పార్టీ అధ్యక్షుడి హోదా లేదా కీలక బాధ్యతల్లో ఉన్న పవన్‌కళ్యాణ్, నాగబాబు లాంటి వారే తమ సొంత ఓట్ల నమోదు ప్రక్రియలో ఇలా అడ్డదారులు తొక్కడం అధికార వర్గాల్లో చర్చనీయాంశమైంది.
Comments
Please login to add a commentAdd a comment