nagendra babu
-
బ్రో.. ఇది దొంగ ఓటు!
రెండు లక్షల పుస్తకాలు చదివానన్న స్వయం ప్రకటిత మేధావి ఆయన.. విలువల గురించి, అనుబంధాల గురించి ఊగిపోతూ ప్రసంగించడం ఆయనకు అలవాటు.. అందరూ తనలాగే ఆలోచించాలని, తన మార్గంలోనే నడవాలని ప్రవచన పలుకులు పలకడం కూడా ఆయనకే సొంతం. ‘చంద్రబాబు చేత.. చంద్రబాబు కొరకు.. చంద్రబాబు యొక్క..’ అంటూ అందరూ ఆ బాబు బాగు కోసమే పరితపించాలని పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేసిన నేత. ఎన్నెన్నో నీతులు చెప్పే ఈ నేత నిబంధనలకు విరుద్ధంగా పార్టీ కార్యాలయం చిరునామాతో ఓటు పొందడం ఇప్పుడు చర్చనీయాంశం. దెయ్యాలు వేదాలు వల్లించడం అంటే ఇదేమరి. సాక్షి, అమరావతి : ఓటు దొంగలే.. దొంగా దొంగా అని అరుస్తున్నారు. మంగళవారం రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్‌కుమార్‌కు ‘రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో దొంగ ఓట్లు నమోదవుతున్నాయి’ అని స్వయంగా ఫిర్యాదు చేసిన జనసేన అధినేత పవన్‌కళ్యాణ్.. రాష్ట్రంలో నమోదు చేసుకున్న ఓటుపై ‘అదీ దొంగ ఓటే’ అన్న చర్చ ఉంది. జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయాన్నే తన నివాసంగా పేర్కొంటూ ఆయన ఓటు పొందారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఆయన ఓటు ఏజీజడ్ 3083045 గుర్తింపు కార్డు నంబరుతో గుంటూరు జిల్లా మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని 197వ నంబరు పోలింగ్ బూత్ పరిధిలో ఉంది. ఓటర్ లిస్టులో ఆ ఓటు ఇంటి నంబరు 11–1903గా పేర్కొన్నారు. అయితే మంగళగిరి పట్టణ పరిధిలో ఆ ఇంటి అడ్రసు గురించి ఆరా తీస్తే అది జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయం అడ్రసేనని స్పష్టమైంది. కొత్తగా ఒక ఇంటి చిరునామాతో ఓటు నమోదు చేసుకోవడానికి కొన్ని నియమ నిబంధనలు స్పష్టంగా ఉన్నాయని, ఈ లెక్కన ఒక పార్టీ కార్యాలయం అడ్రసుతో ఓటు నమోదు దొంగ ఓటు కిందకే వస్తుందని అధికారులు చెబుతున్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారుల అవగాహన కోసం కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేకంగా రూపొందించి, జారీ చేసిన వివిధ రకాల నిబంధనావళిలో ఒకటైన.. ‘మ్యానువల్ ఆన్ ఎలక్ట్రోల్ రోల్స్’ ప్రకారం కొత్తగా వేరొక అడ్రసుతో ఓటరు నమోదుకు ఇంటి అడ్రసును ‘ఆర్డనరీ రెసిడెన్స్’ పేరుతో ప్రత్యేకంగా విశదీకరించారు. ఈ అంశంపై గౌహతి హైకోర్టు వెలువరించిన ఒక తీర్పు ప్రకారం ఇంట్రి అడ్రసు అంటే.. శాశ్వతంగా నివాసం ఉండేది అని కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల పుస్తకంలో స్పష్టంగా పేర్కొంది. టెంపరరీ లేదా క్యాజువల్ నివాసంగా అది ఉండకూడదని ఆ నిబంధనలో స్పష్టంగా ఉంది. ‘రెగ్యులర్‌గా రాత్రివేళ నిద్రించే ప్రాంతాన్నే’ ఆ వ్యక్తి ఆర్డనరీ రెసిడెన్స్‌గా గుర్తించాలని స్పష్టం చేసింది. కానీ జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ అప్పడప్పుడు హైదరాబాద్ నుంచి రాష్ట్రానికి వచ్చినప్పుడు ప్రైవేట్ హోటల్లో బస చేస్తుంటారు. పార్టీ విధుల్లో భాగంగా హైదరాబాద్ నుంచి మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయానికి వచ్చి వెళ్తుంటారు. అలాంటప్పుడు పార్టీ కార్యాలయం ఆయన శాశ్వత నివాసం ఎలా అవుతుందన్న విమర్శలున్నాయి. ఈ లెక్కన మంగళగిరి పార్టీ కార్యాలయం అడ్రసుతో ఆయన ఆరు నెలల ముందు నమోదు చేసుకున్న ఓటు.. దొంగ ఓటు కిందకే వస్తుందని అధికారుల స్థాయిలో చర్చ సాగుతోంది. ఆ చిరునామాలో పవన్ ఓటు మాత్రమే.. 2019 ఎన్నికల్లో రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసిన పవన్ కళ్యాణ్.. తన ఎన్నికల అíఫిడవిట్లో తన కుటుంబ సభ్యుల వివరాలలో భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయం అడ్రసు 11–1903తో ఇప్పుడు పవన్ తన ఒక్కరి ఓటు మాత్రమే నమోదు చేసుకోవడం విశేషం. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2019 ఎన్నికల సమయంలో విజయవాడ తూర్పు నియోజకవర్గ పరిధిలోని 91వ పోలింగ్ బూత్‌లో పవన్ తన ఓటు నమోదు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆరు నెలల కిత్రం మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయ అడ్రసుకు ఓటును మార్చుకున్నారని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. తమ్ముడి బాటలోనే అన్న నాగబాబు రాష్ట్రంలో పవన్‌కళ్యాణ్ నమోదు చేసుకున్న ఓటు దొంగ ఓటు.. అని చర్చ సాగుతున్న తరుణంలో.. అతని సోదరుడు నాగబాబు కూడా దొడ్డి దారిన రాష్టంలో దొంగ ఓట్ల నమోదుకు పూనుకున్నారు. హైదరాబాద్‌లో నివాసం ఉండే నాగబాబు మొన్నటి తెలంగాణ ఎన్నికల పోలింగ్ ముగిసిన మరుసటి రోజు అంటే 2023 డిసెంబరు 4 తేదీన మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని తాడేపల్లి పట్టణ పరిధిలో వడ్డేశ్వరం – రాధా రంగ నగర్‌లోని 5–263 ఇంటి అడ్రసు పేరుతో అన్లైన్లో ఓటుకు దరఖాస్తు చేశారు. నాగబాబు, ఆయన భార్య, కూతురు నిహారిక, కుమారుడు వరుణ్‌తేజ్ (సినీ నటుడు), కోడలు లావణ్య త్రిపాఠి (సినీ నటి) కలిపి మొత్తం ఆరుగురు ఆ ఇంటి అడ్రసులో నివాసం ఉంటున్నట్లు పేర్కొంటూ ఓట్లు నమోదు ఫారాన్ని అన్లైన్లో నమోదు చేశారు. అయితే ప్రాథమిక స్థాయిలో బూత్ లెవల్ అధికారి (బీఎల్వో) పరిశీలనలో నాగబాబు గానీ, వారి కుటుంబం గానీ ఆ అడ్రసులో నివాసం ఉండడం లేదని తేలింది. ఈ ఇల్లు జనసేన పార్టీ అభిమానిదని స్థానికులు పేర్కొన్నారు. ఆ తర్వాత కూడ మంగళగిరి నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఓటు నమోదు ప్రక్రియలో భాగంగా నాగబాబు, ఆయన కుటుంబ సభ్యులు తాడేపల్లి తహాసీల్దార్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలంటూ ఆ ఇంటి తలుపులకు నోటీసులు అంటించి వెళ్లారు. అయితే నాగబాబు, ఆయన కుటుంబ సభ్యులందరి తరుఫున సంబంధిత అడ్రసులో పేర్కొన్న ఇంటి యజమానే అధికారుల ముందు హాజరైనట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఇక్కడ నివాసం.. అక్కడ వ్యాపారమట! అధికారుల విచారణ సమయంలో నాగబాబు తాను తాడేపల్లిలో నివాసం ఉంటున్నానని, అయితే ప్రస్తుతం వ్యాపార నిమిత్తం హైదరాబాద్‌లో ఉన్నందున స్వయంగా విచారణకు రాలేకపోయినట్టు తాను సంతకం చేసిన ఒక పేపరు ఆ ఇంటి యజమాని ద్వారా పంపారు. మరో ఇద్దరు ఇలాగే పేపర్‌పై రాసి.. దానిని ఫొటో తీసి ఆ ఇంటి యజమాని ద్వారా పంపారు. మిగిలిన మరో ముగ్గురి నుంచి ఎలాంటి అఫిడవిట్ లేదని తెలిసింది. మొత్తంగా ఆ అడ్రసులో పేర్కొన్న ఇంటి యజమానే నాగబాబు కుటుంబ సభ్యులు ఆరుగురి తరుఫున విచారణకు హాజరయ్యారు. ఆ ఇంటి అడ్రసులో నాగబాబు కుటుంబం నివాసం ఉంటడం లేదని అధికారులు నిర్ధారించుకుని, ఆ ఆరుగురి ఓట్లను తిరస్కరించారు. సినీ నటుడిగా, పార్టీ అధ్యక్షుడి హోదా లేదా కీలక బాధ్యతల్లో ఉన్న పవన్‌కళ్యాణ్, నాగబాబు లాంటి వారే తమ సొంత ఓట్ల నమోదు ప్రక్రియలో ఇలా అడ్డదారులు తొక్కడం అధికార వర్గాల్లో చర్చనీయాంశమైంది. -
ఉత్తమ పోలీస్ స్టేషన్‌గా రాజేంద్రనగర్ పీఎస్‌కు అవార్డు
సాక్షి, హైదరాబాద్/రాజేంద్రనగర్: దేశంలోనే ఉత్తమ పోలీస్ స్టేషన్‌గా 2023కుగాను ఎంపికైన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ (సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్)కు కేంద్ర ప్రభుత్వం అవార్డు అందించింది. శుక్రవారం జైపూర్‌లో జరిగిన అఖిలభారత డీజీపీ, ఐజీపీల సదస్సులో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేతుల మీదుగా రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ ఎస్హెచ్ఓ (స్టేషన్ హౌస్ ఆఫీసర్) బి. నాగేంద్రబాబు ఈ అవార్డు అందుకున్నారు. దేశవ్యాప్తంగా 17 వేల పోలీస్స్టేషన్ల నుంచి ప్రతిపాదనలు వెళ్లగా ఇందులో 74 పోలీస్ స్టేషన్లను కేంద్ర హోంశాఖ ఉత్తమ పోలీస్ స్టేషన్లుగా ఎంపిక చేసింది. గతేడాది డిసెంబర్ చివరి వారంలో కేంద్ర హోంశాఖ వెల్లడించిన అత్యుత్తమ పోలీస్ స్టేషన్ల జాబితాలో రాజేంద్రనగర్ పీఎస్ తొలి స్థానంలో నిలవడం తెలిసిందే. స్టేషన్లో పోలీసులు చేపడుతున్న విధులు, కేసుల నమోదు, వాటి పరిష్కారంలో చూపుతున్న శ్రద్ధ, భార్యభర్తల గొడవల్లో కౌన్సెలింగ్, మహిళా భద్రత కోసం తీసుకుంటున్న చర్యలు, మిస్సింగ్ కేసులు, గుర్తుతెలియని మృతదేహాల విషయంలో తీసుకుంటున్న చర్యలు.. స్టేషన్‌కు వచ్చిన వారిపట్ల సిబ్బంది వ్యవహరిస్తున్న తీరు.. పీఎస్ పరిధిలో నమోదైన క్రైం రేట్.. దొంగతనాలు, దొంతనాల్లో రికవరీ శాతం వంటి అంశాల్లో ఈ స్టేషన్‌కు అవార్డు లభించింది. కాగా, దేశంలోనే ఉత్తమ పోలీస్ స్టేషన్ అవార్డు అందుకున్న రాజేంద్రనగర్ పీఎస్ ఎస్హెచ్ఓ బి. నాగేంద్రబాబుకు సీఎం రేవంత్‌రెడ్డి, డీజీపీ రవి గుప్తా సామాజిక మాధ్యమం ‘ఎక్స్’వేదికగా అభినందనలు తెలియజేశారు. -
నగ్నంగా పూజలు చేస్తే డబ్బులంటూ మోసం.. 12 మంది అరెస్ట్
గుంటూరు రూరల్: డబ్బు ఆశ చూపి యువతుల్ని మోసగించేందుకు ప్రయత్నించిన ఘరానా మోసగాడి ఆగడాలకు దిశ యాప్ సాయంతో అడ్డుకట్ట పడింది. బాధిత యువతులు తమ మొబైల్ ఫోన్లోని దిశ యాప్ ఎస్‌వోఎస్ బటన్ నొక్కడంతో నిమిషాల వ్యవధిలోనే పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని యువతులను రక్షించారు. వారిచ్చి న సమాచారం ఆధారంగా అఘాయిత్యాలకు పాల్పడిన 12 మందిని నల్లపాడు పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. డీఎస్పీ మహబూబ్‌బాషా కథనం ప్రకారం.. తాడికొండ మండలం పొన్నెకల్లుకు చెందిన పూజారి నాగేశ్వరరావు అనే వ్యక్తి బోర్లు వేసే సమయంలో కొబ్బరి కాయలతో నీరు పడుతుందో లేదో చెప్పే పనులు చేస్తుంటాడు. ఈ క్రమంలోనే గుప్త నిధులను వెతికేందుకు అలవాటు పడ్డాడు. ఈ క్రమంలో తనకు పరిచయమైన వి.నాగేంద్రబాబుకు నగ్నంగా పూజలు చేస్తే ఆర్థికంగా కలిసి వస్తుందని ఆశ చూపాడు. దీంతో నాగేంద్రబాబు తన క్లాస్మేట్ అయిన కర్నూలు జిల్లా ఆత్మకూరు, నంద్యాల ప్రాంతాలకు చెందిన సురేష్, ఖాశిం, పెద్దరెడ్డిలకు ఒకసారి నగ్నంగా పూజలో కూర్చునే మహిళలు ఉంటే వారికి లక్ష రూపాయలు ఇస్తారని చెప్పాడు. దీంతో సురేష్, ఖాశిం, పెద్దరెడ్డి ఇద్దరు యువతులతో గత మంగళవారం గుంటూరు వచ్చి నాగేంద్రబాబును కలిశారు. ఈ విషయాన్ని నాగేంద్రబాబు పూజారి నాగేశ్వరరావుకు ఫోన్లో చెప్పాడు. దీంతో నాగేశ్వరరావు అనుచరులు, అతడి కారు డ్రైవర్ సునిల్, చిలకలూరిపేటకు చెందిన ఉమెన్ ట్రాఫికింగ్‌కు పాల్పడే అరవిందచౌదరి, సుబ్బు, శివ, రాధ గుంటూరు బస్టాండ్‌కు వెళ్లి నంద్యాల నుంచి వచ్చిన సురేష్, ఖాశిం, పెద్దరెడ్డిలను కలిసి.. డబ్బుల విషయమై మాట్లాడుకుని ఒప్పందానికి వచ్చారు. కదిలితే ప్రాణాలు పోతాయని బెదిరించి.. మంగళవారం రాత్రి పూజలు ప్రారంభించాలని నాగేశ్వరరావు చెప్పగా.. వారంతా తాడికొండ మండలం పొన్నెకల్లులోని నాగేశ్వరరావు ఇంటికి చేరుకున్నారు. ఆ తరువాత నాగేశ్వరరావు యువతులను ఓ గదిలో నగ్నంగా కూర్చోబెట్టి పూజలు ప్రారంభించాడు. మధ్యలో యువతుల పట్ల అసభ్యంగా ప్రవర్తించగా.. వారు అడ్డుకునే ప్రయత్నం చేశారు. పూజ చేస్తున్న సమయంలో కదిలితే ప్రాణాలు పోతాయని బెదిరించడంతో యువతులు ఏమీ చేయలేకపోయారు. పూజలు ముగిసిన అనంతరం నాగేశ్వరరావు, అతని అనుచరులు యువతులపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. బుధవారం నాడు పొన్నెకల్లులో పూజలు కుదరటం లేదని చిలకలూరిపేటలోని పండరీపురంలో అరవిందచౌదరి ఇంట్లో పూజలు చేయాలని నిర్ణయించాడు నాగేశ్వరరావు. బుధవారం రాత్రి అందరూ కలిసి చిలకలూరిపేట వెళ్లారు. శుక్రవారం వరకూ పూజలు చేసే క్రమంలో యువతులపై లైంగిక దాడికి పాల్పడ్డారు. నాలుగు రోజులుగా పూజలు చేస్తున్నా ఫలితం లేకపోవటంతో నాగేశ్వరరావు అక్కడినుంచి జారుకున్నాడు. దిశ యాప్‌ను ఆశ్రయించడంతో.. ఈ క్రమంలో సదరు యువతులు ఒప్పందం ప్రకారం తమకు డబ్బు ఇస్తే ఇంటికిపోతామని నాగేశ్వరరావు అనుచరులను అడిగారు. దీంతో నాగేశ్వరరావు అనుచరులకు, యువతులకు వివాదం తలెత్తింది. ఈ విషయాన్ని అరవిందచౌదరి నాగేశ్వరరావుకు ఫోన్ చేసి చెప్పగా.. తన ఇంటికి వస్తే సెటిల్మెంట్ చేసుకుందామని నాగేశ్వరరావు సూచించాడు. అందరూ కారులో పొన్నెకల్లు బయలుదేరారు. మధ్యలో నాగేశ్వరరావు అనుచరులు యువతులను బెదిరించడంతో గోరంట్ల సమీపంలో బాధిత యువతులు తమ వద్దనున్న సెల్ఫోన్లో దిశ యాప్‌లో ఎస్‌వోఎస్ బటన్ నొక్కడంతో వెంటనే స్పందించిన ఎస్పీ ఆరీఫ్ హఫీజ్ నేతృత్వంలో నల్లపాడు పోలీసులు అప్రమత్తమయ్యారు. తక్షణమే నగర శివార్లలోని గోరంట్ల వద్ద ఉన్న యువతుల చెంతకు చేరుకుని ఆమెతోపాటున్న అరవింద చౌదరి, నాగేంద్రబాబు, సునిల్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితులు జరిగిన విషయాన్ని ఒప్పుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రధాన నిందితుడు నాగేశ్వరరావు, నాగేంద్రబాబు, అరవింద చౌదరి, రాధ, భాస్కర్, పెద్దరెడ్డి, సాగర్, వెంకటసురేష్, శివ, సునీల్, పవన్, సుబ్బులను అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో మరికొందరు ఉన్నారని, త్వరలో వారిని అరెస్ట్ చేస్తామని డీఎస్పీ మహబూబ్‌బాషా చెప్పారు. ఎవరైనా డబ్బు ఆశచూపి యువతులు, మహిళలకు ఎరవేస్తే నమ్మి మోసపోవద్దని డీఎస్పీ కోరారు. -
నాగబాబుకు మంత్రి ఆర్కే రోజా స్ట్రాంగ్ కౌంటర్
సాక్షి, అమరావతి: సినీ నటుడు నాగబాబుకు మంత్రి ఆర్కే రోజా కౌంటర్ ఇచ్చారు. ఏదైనా విమర్శ చేసేటపుడు విషయం ఉంటే చేయాలే తప్ప నోటి కి ఎంత వస్తే అంత ఫేక్ వార్తలతో దుష్ప్రచారం చేయడం సబబుకాదని హితవు పలికారు. టూరిజంలో ఆంధ్రప్రదేశ్.. దేశంలో మూడో స్థానంలో ఉందని.. నాగబాబు అదికూడా తెలియకుండా మాట్లాడటం విడ్డూరంగా ఉందని మంత్రి ఆర్కే రోజా అన్నారు. పర్యాటక శాఖ మంత్రిగా చిరంజీవి ఏపీకి ఏం చేశారని రాజకీయంగా తాను ఏనాడు మాట్లాడలేదని చెప్పుకొచ్చారు. రాజకీయాలకు, ఆయన దూరంగా ఉన్నారు కాబట్టి ఆ విషయం మాట్లాడనని తెలిపారు. వ్యక్తిగతంగా తనకు ఎవరితోనూ శత్రుత్వం లేదని.. పార్టీ పరంగా, సిద్ధాంత పరంగానే తన వ్యాఖ్యలుంటాయని స్పష్టం చేశారు. మహిళలను గౌరవించడం ఎలాగో ముందు నాగబాబు తెలుసుకోవాలని మంత్రి రోజా చురకలంటించారు. చదవండి: (బాలయ్య బాబు కాదు.. బాలయ్య తాత.. 60 ఏళ్ల దాటాయి ఎవరొస్తారు చూడటానికి..?) -
ఆగని గరికపాటి వ్యాఖ్యల దుమారం..‘ఆకాశం మీద ఉమ్మేయడం లాంటిదే’
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు చిరంజీవిని ఉద్దేశించి ఆధ్యాత్మిక ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో దుమారమే రేగింది. హైదరాబాద్‌లో బండారు విజయలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమంలో ‘చిరంజీవి ఫొటో సెషన్ ఆపేసి రాకపోతే నేనే వెళ్లిపోతా’అని అసహనం వ్యక్తం చేశారనే అంశం వివాదానానికి దారి తీసింది. అయితే ఆ కార్యక్రమంలో చిరంజీవి, గరికపాటి బాగానే మాట్లాడుకున్నా... ఆ తరువాత నరసింహారావు వ్యాఖ్యలపై చిరంజీవి సోదరుడు నాగబాబు ట్విట్టర్లో ఆయన పేరు ప్రస్తావించకుండా ‘ఏపాటి వాడికైనా చిరంజీవి ఇమేజ్ చూస్తే ఆ పాటి అసూయపడటం పరిపాటే’నని స్పందించారు. నాగబాబు ట్వీట్‌పై బ్రాహ్మణ ఫెడరేషన్ ఉపాధ్యక్షుడు ద్రోణంరాజు రవికుమార్ కౌంటర్ ఇచ్చారు. ‘నిత్యం తన ప్రవచనాలతో సమాజాన్ని ఎంతో సంస్కారవంతం చేస్తున్న ఒక సనాతనవాది, ఆధ్యాత్మిక వేత్తను.. నటనావ్యాపారం తప్ప సమాజహితాన్ని మరిచిన చిత్రవ్యాపారిని చూసి అసూయ చెందాడనడం ఆకాశం మీద ఉమ్మేయడం లాంటిదే’ అని ఘాటుగా స్పందించారు. చదవండి: 'మాకు ఆ ఉద్దేశం లేదు.. ఆయనను ఎవరూ తప్పుగా మాట్లాడొద్దన్న నాగబాబు' ఆగని ట్రోల్స్ మరోవైపు చిరంజీవి అభిమానులు, నటులు గరికపాటిని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. క్షమాపణలు చెప్పాలంటూ చిరంజీవి యూత్ రాష్ట్ర అధ్యక్షుడు రవికుమార్ గరికపాటికి ఫోన్ చేసి డిమాండ్ చేశారు. చిరంజీవి గురించి అలా అనాల్సింది కాదంటూ గరికపాటిపై సినీనటుడు ఉత్తేజ్ మండిపడ్డారు. ఇలా సోషల్ మీడియాలో పోస్టుల పరంపరం కొనసాగింది. చివరకు నాగబాబు మళ్లీ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ ‘గరికపాటి వారు ఏదో మూడ్‌లో అలా అని ఉంటారు. ఆయనలాంటి పండితుడు అలా అని ఉండికూడదని అన్నామే తప్ప, ఆయనతో క్షమాపణ చెప్పించుకోవాలని మాకు కోరిక లేదు. మెగాభిమానులు ఆయ నని అర్థం చేసుకోవాలే గానీ, ఆయన గురించి ఎవరూ తప్పుగా మాట్లాడవద్దని రెక్వెస్ట్’అని పేర్కొన్నారు. -
గాడ్సే మూవీ పబ్లిక్ టాక్
-
నందమూరి హీరోలు ఆకాశం నుంచి వచ్చారా?
సాక్షి, హైదరాబాద్ : కొణిదెల, నందమూరి వార్ ముదురుతోంది. సోషల్ మీడియాలో బాలయ్యపై నాగబాబు మరోసారి కౌంటర్ ఇచ్చారు. నందమూరి ఫ్యామిలీ వాళ్లే సూపర్ స్టార్లా ? ఇండస్ట్రీలో మరే స్టార్లు లేరా? అంటూ నిప్పులు చెరిగారు. టీడీపీని గెలిపించిన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఎవరో బాలయ్యకు తెలియదా అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్‌ను రాజకీయంగా టీడీపీ వాడుకుని ఇప్పుడు పవన్ ఎవరో తెలియదు అనడం మమ్మల్ని ఎంతగానో బాధించింది అని నాగబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ''ఒక సినీ హీరోగా పవన్ కళ్యాణ్ మీకు తెలియకపోతే మాకేమీ ఇబ్బంది లేదు. కానీ అవసరానికి రాజకీయంగా వాడుకుని ఇప్పడు తెలియదు అంటే వాళ్లను ఏమనాలి. బాలయ్య ఎవరో నాకు తెలియదు అంటే రాద్ధాంతం చేస్తున్న నందమూరి అభిమానులు గతంలో బాలయ్య కామెంట్లకు ఏం సమాధానం చెబుతారు. బాలకృష్ణ బావ చంద్రబాబు నాయుడు మా ఇంటికి వచ్చి పవన్ కళ్యాణ్‌ను స్వాగతించి రాజకీయంగా వాడుకున్నారు. ఏపీ సీఎంగా వైఎస్ జగన్ గెలవాల్సిన సమయంలో సీనియారిటీ ఉన్న నాయకుడని చంద్రబాబును నమ్మి టీడీపీకి పవన్ మద్దతు తెలిపారు. కనీసం ఒక్క సీటు కూడా జనసేన పోటీ చేయకపోయినా టీడీపీ గెలుపుకోసం పవన్ చాలా కష్టపడ్డారు. ఎన్నికల్లో గెలిచాక పవన్ కళ్యాణ్ ఎవరోతెలీదు అనడం ఎంత వరకు సబబు. మీరు అనొచ్చు కానీ, మేము తెలియదంటే కోపమొస్తుందా ? చిరంజీవి ఏమయ్యాడు అంటూ హేళనగా మాట్లాడిన బాలయ్య మాటలను నందమూరి అభిమానులు ఎందుకు ఖండించలేదు. మా బ్లడ్ వేరు మా బ్రీడు వేరూ అంటూ బాలయ్య అంటూ ఉంటారు. నందమూరి హీరోలు ఆకాశం నుంచి వచ్చారా? మీరు మాలాగే మనుషులు తల్లీదండ్రులకు పుట్టినవారే. ఆస్ట్రియాలో బ్లూబ్లడ్ అనే కల్చర్ ఉండేది, వాళ్లే గొప్పవాళ్లు అనే అహంతో ఆ రాజవంశీకులు వ్యవహరిస్తే వాళ్లను ప్రజలు దించేశారు. పేరున్న ప్రతివారు స్టార్లే.. జనాలు మెచ్చుకుంటేనే స్టార్లవుతారు. మా అన్నతమ్ముళ్ల మీద బాలయ్య 6 సార్లు కామెంట్లు చేస్తే, తిరిగి సీరియస్‌గా కాకుండా ఫన్నీగా కౌంటర్ ఇచ్చా. మా కుటుంబాన్ని ఎందుకు లాగుతున్నారు? నందమూరి వంశీయులు సూర్యవంశీకులా. అమితాబ్ బచ్చన్‌ను కించపరిచేలా కూడా బాలయ్య మాట్లాడారు'' అంటూ నాగబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ మధ్యే బాలకృష్ణ నటిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్‌పై నాగబాబు తీవ్ర ఆరోపణలు చేశారు. కట్టుకథలు మూటకట్టి ప్రేక్షకుల మొహాన కొట్టొదయ్యా అంటూ వేమన శతకం తరహాలో ఓ కవితనే అందుకున్నారు. కాంట్రవర్సీలకు దూరంగా ఉండే నాగబాబు.. పవన్ తనకు తెలియదని బాలకృష్ణ కామెంట్ చేసిన దగ్గర నుంచే ఈ వివాదం మొదలైంది. బాలకృష్ణ గురించి అడిగితే ఆయనెవరో తెలియదని నాగబాబు అనడం, తర్వాత బాలకృష్ణ ఎవరో తెలుసని, ఆయన పాత సినిమాల్లో కమెడియన్ అంటూ ఓ వీడియో పెట్టడంతో, బాలయ్య అభిమానులు సోషల్‌మీడియా వేదికగా నాగబాబుపై విరుచుకుపడ్డారు. వీటన్నిటికి కౌంటర్‌గా నాగబాబు ఆదివారం నుంచి కొన్ని వీడియోలు పెడుతూ, తాను ఎందుకు అలా అనాల్సి వచ్చిందో వివరణ ఇచ్చారు. -
రచయిత, దర్శకులపై నాగబాబు మండిపాటు
-
విమర్శిస్తే మైలేజ్ వస్తుందని..
♦ యండమూరి, ఆర్జీవీపై పరోక్షంగా నాగబాబు ఫైర్ ♦ స్పందించిన యండమూరి.. ఘాటుగా బదులిచ్చిన ఆర్జీవీ సాక్షి, అమరావతి: చిరంజీవి సినిమా ఖైదీ నంబర్ 150 ప్రీ రిలీజ్ వేడుకలో మెగా బ్రదర్ నాగబాబు పరోక్షంగా రచయిత యండమూరి, రామ్‌గోపాల్ వర్మలపై మండిపడ్డారు. నాగబాబు మాట్లాడుతూ ‘‘ప్రతివాడికీ మెగా ఫ్యామిలీ మీద చూపుంటుంది. చిరంజీవిని, ఆయన కుటుంబ సభ్యులను విమర్శిస్తే వాళ్లకు మైలేజ్ వస్తుంది. ఓ ప్రముఖుడు, రచనల్లో నిపుణుడు, ఎవర్నో హైలైట్ చేయడానికి చరణ్ విలువని తగ్గించిన మూర్ఖుడు ఒకడు న్నాడు. వాడికి కామన్సెన్స్ లేదు. వ్యక్తిత్వపు వికాసపు కోర్సులు చెబుతుంటాడు. మొదట వాడు వ్యక్తిత్వ వికాసం నేర్చుకోవాలి. ఇతరులను తక్కువ చేసే కుసంస్కారం వాడిది’’ అంటూ యండమూరి వీరేంద్ర నాథ్‌పై విమర్శలు గుప్పించారు. రామ్‌గోపాల్ వర్మపై విమర్శలు చేస్తూ.. ‘‘తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ముంబై వెళ్లిన ఒకడు రకరకాల కూతలు కూస్తున్నాడు. ఈ కూతలు ఆపేసి దర్శ కత్వం సక్రమంగా చేసుకుని, ఆ బాంబ్ ఏదో అక్కడే ముంబై లో పేల్చుకుంటే... వాడికీ మంచిది, మాకూ మంచిది. చిరంజీవి సినిమా ఎలా ఉండాలి? ఆయన ఎలా చేయాలి? అని మాట్లాడడం. ఇలాంటి అక్కుపక్షి, పనికిమాలిన సన్నాసి కూసే కూతలతో మాకేం కాదు. ఇలాంటి పక్షి ఎన్ని కూతలు కూసినా.. సూపర్‌హిట్ సినిమాని ఆపలేవు. ఫెయిల్యూర్ సినిమాని లేపలేవు’’ అంటూ ధ్వజమెత్తారు. మనసులో ఉన్నది దాచుకోలేరు నాగబాబు వ్యాఖ్యలపై యండమూరి స్పందించారు. ‘‘ఇటీవల ఓ టీవీ ఫంక్షన్లో నాగబాబు కలసి.. కథలు ఇవ్వాలన్నాడు. మరి, ఇలా ఎందుకు జరిగింది? ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు చిరంజీవి రాజకీయాలకు పనికిరాడు! అని ఓ కామెంట్ చేశా. ఈ మధ్యన రామ్‌చరణ్ తేజ్, దేవిశ్రీ ప్రసాద్ లను పోలుస్తూ ఓ కామెంట్ చేశా. ఇద్దరి తండ్రులూ నాకు క్లోజ్. ఫాదర్ కాదు ముఖ్యం, ప్రతిభ ఉండాలని చెప్పడం ఎవరినీ తక్కువ చేయడం కాదు’’ అని చెప్పారు. ట్వీటర్లో ఆర్జీవీ ఫైర్.. నాగబాబు వ్యాఖ్యలపై వర్మ ట్వీటర్లో ఘాటుగా స్పందిం చారు. మొదట వర్మ అఫీషియల్ ట్వీటర్ ఎకౌంట్ నుండి మెగా ఫ్యామిలీకి క్షమాపణలు చెబుతూ తెలుగులో ట్వీట్స్ వచ్చాయి. తర్వాత ‘నా ట్వీటర్ ఎకౌంట్ ఎవరో హ్యాక్ చేశారు’ అని వర్మ పేర్కొన్నారు. ‘‘నాగబాబు సార్.. మీకు ఇంగ్లిష్ అర్థం కాదు ఎవరితోనైనా చదివించుకోండి. నాకు సలహా ఇచ్చేముందు మీ ‘జబర్దస్త్’ కెరీర్ గురించి ప్రశ్నించు కోండి. ‘ప్రజారాజ్యం’ టైమ్‌లో మీ అన్నయ్యకు తప్పుడు సలహాలిచ్చి ఆయన ఓడిపోయేలా చేశారు. ‘అక్కుపక్షి’ అనే కామెంట్స్ చేసి టైమ్ వృథా చేసుకునే బదులు మీ సోదరు లను బతిమాలుకోండి. లేదంటే రోడ్డున పడే అవకాశం ఉంది’’ అని వర్మ ట్వీట్స్ చేశారు. ఇటువంటి ప్రతిష్ఠాత్మక వేడుకలకు నాగబాబును తీసుకువెళ్లవద్దంటూ చిరంజీవిని కోరారు. ‘‘ఇప్పుడే ‘ఖైదీ నంబర్ 150’ ట్రైలర్ చూశా. ‘అవ తార్’ కంటే కాస్త బాగుంది’’ అని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. -
రచయిత, దర్శకులపై నాగబాబు మండిపాటు
హాయ్‌ల్యాండ్ వేదికగా జరిగిన ఖైదీ నెం. 150 ప్రీ లాంచ్ వేడుకలో మెగా బ్రదర్ నాగేంద్రబాబు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఈ మధ్య కాలంలో మెగా ఫ్యామిలీ మీద కామెంట్లు చేసిన ఇద్దరు ప్రముఖులపై వాళ్ల పేర్లు ప్రశ్నించకుండానే తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. చరణ్ ముఖం మార్పిడి ఆపరేషన్ చేయించుకున్నాడంటూ ఒక వ్యక్తి గతంలో కామెంట్ చేశారని ముందుగా అన్నారు. ఆయన తమ కుటుంబానికి అత్యంత సన్నిహితుడని, గతంలో చిరంజీవి సినిమాలకు కథలు అందించడం, దర్శకత్వం వహించడం కూడా చేశాడని చెప్పారు. వ్యక్తిత్వ వికాస క్లాసులు కూడా చెప్పుకుంటాడని, ఇప్పుడు ఏమీ లేక ఖాళీగా ఉండటం వల్లే ఈ పిచ్చిమాటలు మాట్లాడుతున్నాడని చెబుతూ.. అంతా 'వాడు.. వాడు' అని ప్రస్తావించారు. తాను ఎవరి గురించి చెబుతున్నానో వాడొక్కడికీ అర్థమైతే చాలని, ఇక్కడ ఉన్నవాళ్లందరికీ అర్థం కాకపోయినా పర్వాలేదని తెలిపారు. మరోవ్యక్తి ఇక్కడ డైరెక్షన్ చేయడం చేతకాక ముంబై వెళ్లిపోయి అక్కడి నుంచి సోషల్ మీడియాలో కారుకూతలు కూస్తున్నాడని, ఎవరు పడితే వాళ్లు మెగాస్టార్‌ను ఒక మాట అంటే మైలేజి పెరుగుతుందని అనుకుంటున్నారని నాగేంద్రబాబు మండిపడ్డారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
వేగంగా వెళ్తున్న టాటా ఏస్‌లో నుంచి దిగడానికి ప్రయత్నించిన యువకుడు ప్రమాదవశాత్తు జారిపడి మృతిచెందాడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా జూలూరుపాడులో ఆదివారం చోటుచేసుకుంది. సూరారంకు చెందిన నాగేంద్రబాబు కుటుంబసభ్యులు టాటాఏస్‌లో కొరివి నుంచి స్వగ్రామానికి వెళ్తున్నారు. ఈ క్రమంలో వాహనం జూలూరుపాడు వద్దకు రాగానే నాగేంద్రబాబు(23) టాటాఏస్‌లో నుంచి దిగే క్రమంలో ప్రమాదవశాత్తు కిందపడి అక్కడికక్కడే మృతిచెందాడు. దీంతో ఆ కుటుంబ సభ్యుల రోధనలు మిన్నంటాయి. -
పెళ్లి పత్రికలు పంచడానికి వెళ్లి... పరలోకానికి
బెంగళూరు, న్యూస్‌లైన్ : మేనకోడలు పెళ్లికి ఆహ్వాన పత్రికలు పంచడానికి వెళ్లిన అఖిల కర్ణాటక అన్నయ్య చిరంజీవి అభిమానుల సంఘం అధ్యక్షుడు కోటె వెంకటేశ్ యాదవ్ (45) జబ్బార్ ట్రావెల్స్ బస్సులో సజీవ దహనమయ్యారు. సోదరి అనిత కుమారి (43)తో కలసి మంగళవారం రాత్రి ఆయన హైదరాబాద్‌కు బయలుదేరారు. కేంద్ర మంత్రి చిరంజీవి కుటుంబ సభ్యులకు పత్రికలు పంచాలన్నది ప్రధానోద్దేశం. వారిద్దరి దుర్మరణం వార్త తెలియడంతో పెళ్లి ముచ్చట్లతో సందడిగా ఉన్న ఇంటిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వెంకటేశ్ నివాసం ఇక్కడి కళాసిపాళ్యలో ఉండగా, అనిత బాణసవాడిలో కాపురం ఉంటున్నారు. ఆమె కుమార్తె అనూషకు సతీశ్ అనే అబ్బాయితో వివాహం నిశ్చయమైంది. నవంబరు 14న ఇక్కడి బసవనగుడిలోని కళ్యాణ మంటపంలో వివాహానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వెంకటేశ్...చిరంజీవి, అల్లు అరవింద్ కుటుంబాలకు సన్నిహితుడు. వారిని ఆహ్వానించడానికే సోదరితో కలసి హైదరాబాద్‌కు బయలుదేరాడు. కుమారుడు శ్రీనివాస్ స్వయంగా బస్సు ఎక్కించాడు. బుధవారం వేకువ జామున వారు సజీవ దహనం అయ్యారని తెలుసుకున్న కుటుంబ సభ్యులు, ఆభిమానులు విషాదంలో మునిగిపోయారు. పెద్ద సంఖ్యలో చిరంజీవి అభిమానులు జబ్బార్ ట్రావెల్స్ దగ్గరకు చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ట్రావెల్స్ సిబ్బందితో వాగ్వివాదానికి దిగారు. తరువాత పోలీసులు వారికి నచ్చజెప్పారు. 22 సంవత్సరాలుగా తెలుసు.... నాగేంద్రబాబు వెంకటేశ్ 22 సంవత్సరాలుగా తనకు తెలుసునని చిరంజీవి సోదరుడు, నిర్మాత నాగేంద్రబాబు అన్నారు. ప్రమాద స్థలికి వెళ్లిన ఆయన అక్కడి నుంచే ‘న్యూస్‌లైన్’తో ఫోన్లో మాట్లాడారు. వెంకటేశ్ మరణ వార్తను జీర్ణించుకోలేక పోతున్నామని విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. వెంకటేశ్ కుటుంబాన్నిఆదుకుంటాం ...అల్లు అరవింద్ హామీ కోటె. వెంకటేశ్ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని నిర్మాత అల్లు అరవింద్ హామీ ఇచ్చారు. బుధవారం రాత్రి ఆయనిక్కడ వెంకటేశ్ కుటుంబ సభ్యులను కలుసుకుని సాంత్వన వచనాలు పలికారు. వెంకటేశ్ మృతితో కుటుంబ సభ్యుని కోల్పోయామని, ఆయన 25 ఏళ్లుగా తమకు తెలుసునని గద్గద స్వరంతో అన్నారు. బెంగళూరులో చిరంజీవి కార్యక్రమాలు చేపట్టినప్పుడల్లా వెంకటేశ్ ముందుండే వారని తెలిపారు. అలాంటి వెంకటేశ్ కుటుంబాన్ని అనాథగా మిగలబోనివ్వమని అన్నారు. ఆయన పిల్లల చదువులు, పెళ్లిళ్లకు అండగా నిలబడతామని హామీ ఇచ్చారు. దశ దిన కర్మ లోపు మరో సారి ఇక్కడికి వచ్చి వారికి సాయం అందిస్తామని కూడా ఆయన చెప్పారు. తరలి వచ్చిన అభిమానులు, స్నేహితులు 1992 ఆగస్టు 22న వెంకటేశ్ కర్ణాటక చింరజీవి అభిమానుల సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కర్ణాటక చిరంజీవి అభిమానుల సంఘం అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. కేవలం చిరంజీవి అభిమానులే కాకుండా ఇతర హీరోల అభిమానులు కూడా ఆయనతో స్నేహ పూర్వకంగా వ్యవహరించే వారు. ఆయనిక లేరని తెలియడంతో చిరంజీవి అభిమానులతో పాటు నందమూరి తారక రామారావు, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు, బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల నాయకులు, కర్ణాటక తెలుగు ప్రజా సమితి అధ్యక్షుడు బొందు రామస్వామి ప్రభృతులు వెంకటేశ్ నివాసం దగ్గరకు చేరుకున్నారు. జేడీఎస్ ఎమ్మెల్యే జమీర్ అహ్మద్ ఖాన్ వెంకటేశ్ తండ్రి సుందర్ రాజ్‌ను ఓదార్చారు. స్థానిక శాసన సభ్యుడు ఆర్వీ. దేవరాజ్ కుటుంబ సభ్యులు, బీజేపీ నాయకుడు చింతామణి మహేష్, జేడీఎస్ నాయకుడు రవిప్రసాద్, తమిళనాడు చిరంజీవి అభిమానుల సంఘం అధ్యక్షుడు నాగేష్, కర్ణాటక బాలకృష్ణ అభిమానుల సంఘం అధ్యక్షుడు మాణిక్య, చిరంజీవి అభిమానుల సంఘం నాయకులు అంజి, మార్కండేయ, కర్ణాటక రామ్‌చరణ్ అభిమానుల సంఘం అధ్యక్షుడు మార్టిన్, ప్రధాన కార్యదర్శి మురళి కళ్యాణ్, చిక్కబళ్లాపురం మొబైల్ బాబు, కేఆర్ పురం మార్కెట్ బాబు, ప్రేమ్, రాజబాబు, గోవిందస్వామి, సంతోష్, టెంట్ నాగేంద్ర, బాలాజీ, రమేష్,శీన, మోనిష్, కళ్యాణ్, మురళి, బాలయ్య అభిమానుల సంఘం నాయకులు మార్క్ శీను, అమ్ములు, శ్రీనివాస్, గోపీ, మిలటరి శివ, ఖాన్, హొసూరు బాబు, వీజీ. మంజునాథ్, గోపాల్ తదితరులు వెంకటేశ్ కుటుంబ సభ్యులకు ధైర్య వచనాలు పలికారు.