గుంటూరు రూరల్: డబ్బు ఆశ చూపి యువతుల్ని మోసగించేందుకు ప్రయత్నించిన ఘరానా మోసగాడి ఆగడాలకు దిశ యాప్ సాయంతో అడ్డుకట్ట పడింది. బాధిత యువతులు తమ మొబైల్ ఫోన్‌లోని దిశ యాప్ ఎస్‌వోఎస్ బటన్ నొక్కడంతో నిమిషాల వ్యవధిలోనే పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని యువతులను రక్షించారు. వారిచ్చి న సమాచారం ఆధారంగా అఘాయిత్యాలకు పాల్పడిన 12 మందిని నల్లపాడు పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు.
డీఎస్పీ మహబూబ్‌బాషా కథనం ప్రకారం.. తాడికొండ మండలం పొన్నెకల్లుకు చెందిన పూజారి నాగేశ్వరరావు అనే వ్యక్తి బోర్లు వేసే సమయంలో కొబ్బరి కాయలతో నీరు పడుతుందో లేదో చెప్పే పనులు చేస్తుంటాడు. ఈ క్రమంలోనే గుప్త నిధులను వెతికేందుకు అలవాటు పడ్డాడు. ఈ క్రమంలో తనకు పరిచయమైన వి.నాగేంద్రబాబుకు నగ్నంగా పూజలు చేస్తే ఆర్థికంగా కలిసి వస్తుందని ఆశ చూపాడు.
దీంతో నాగేంద్రబాబు తన క్లాస్‌మేట్ అయిన కర్నూలు జిల్లా ఆత్మకూరు, నంద్యాల ప్రాంతాలకు చెందిన సురేష్, ఖాశిం, పెద్దరెడ్డిలకు ఒకసారి నగ్నంగా పూజలో కూర్చునే మహిళలు ఉంటే వారికి లక్ష రూపాయలు ఇస్తారని చెప్పాడు. దీంతో సురేష్, ఖాశిం, పెద్దరెడ్డి ఇద్దరు యువతులతో గత మంగళవారం గుంటూరు వచ్చి నాగేంద్రబాబును కలిశారు.
ఈ విషయాన్ని నాగేంద్రబాబు పూజారి నాగేశ్వరరావుకు ఫోన్‌లో చెప్పాడు. దీంతో నాగేశ్వరరావు అనుచరులు, అతడి కారు డ్రైవర్ సునిల్, చిలకలూరిపేటకు చెందిన ఉమెన్ ట్రాఫికింగ్‌కు పాల్పడే అరవిందచౌదరి, సుబ్బు, శివ, రాధ గుంటూరు బస్టాండ్‌కు వెళ్లి నంద్యాల నుంచి వచ్చిన సురేష్, ఖాశిం, పెద్దరెడ్డిలను కలిసి.. డబ్బుల విషయమై మాట్లాడుకుని ఒప్పందానికి వచ్చారు.
కదిలితే ప్రాణాలు పోతాయని బెదిరించి..
మంగళవారం రాత్రి పూజలు ప్రారంభించాలని నాగేశ్వరరావు చెప్పగా.. వారంతా తాడికొండ మండలం పొన్నెకల్లులోని నాగేశ్వరరావు ఇంటికి చేరుకున్నారు. ఆ తరువాత నాగేశ్వరరావు యువతులను ఓ గదిలో నగ్నంగా కూర్చోబెట్టి పూజలు ప్రారంభించాడు. మధ్యలో యువతుల పట్ల అసభ్యంగా ప్రవర్తించగా.. వారు అడ్డుకునే ప్రయత్నం చేశారు. పూజ చేస్తున్న సమయంలో కదిలితే ప్రాణాలు పోతాయని బెదిరించడంతో యువతులు ఏమీ చేయలేకపోయారు. పూజలు ముగిసిన అనంతరం నాగేశ్వరరావు, అతని అనుచరులు యువతులపై అఘాయిత్యానికి పాల్పడ్డారు.
బుధవారం నాడు పొన్నెకల్లులో పూజలు కుదరటం లేదని చిలకలూరిపేటలోని పండరీపురంలో అరవిందచౌదరి ఇంట్లో పూజలు చేయాలని నిర్ణయించాడు నాగేశ్వరరావు. బుధవారం రాత్రి అందరూ కలిసి చిలకలూరిపేట వెళ్లారు. శుక్రవారం వరకూ పూజలు చేసే క్రమంలో యువతులపై లైంగిక దాడికి పాల్పడ్డారు. నాలుగు రోజులుగా పూజలు చేస్తున్నా ఫలితం లేకపోవటంతో నాగేశ్వరరావు అక్కడినుంచి జారుకున్నాడు.
దిశ యాప్‌ను ఆశ్రయించడంతో..
ఈ క్రమంలో సదరు యువతులు ఒప్పందం ప్రకారం తమకు డబ్బు ఇస్తే ఇంటికిపోతామని నాగేశ్వరరావు అనుచరులను అడిగారు. దీంతో నాగేశ్వరరావు అనుచరులకు, యువతులకు వివాదం తలెత్తింది. ఈ విషయాన్ని అరవిందచౌదరి నాగేశ్వరరావుకు ఫోన్ చేసి చెప్పగా.. తన ఇంటికి వస్తే సెటిల్‌మెంట్ చేసుకుందామని నాగేశ్వరరావు సూచించాడు. అందరూ కారులో పొన్నెకల్లు బయలుదేరారు.
మధ్యలో నాగేశ్వరరావు అనుచరులు యువతులను బెదిరించడంతో గోరంట్ల సమీపంలో బాధిత యువతులు తమ వద్దనున్న సెల్‌ఫోన్‌లో దిశ యాప్‌లో ఎస్‌వోఎస్ బటన్ నొక్కడంతో వెంటనే స్పందించిన ఎస్పీ ఆరీఫ్ హఫీజ్ నేతృత్వంలో నల్లపాడు పోలీసులు అప్రమత్తమయ్యారు. తక్షణమే నగర శివార్లలోని గోరంట్ల వద్ద ఉన్న యువతుల చెంతకు చేరుకుని ఆమెతోపాటున్న అరవింద చౌదరి, నాగేంద్రబాబు, సునిల్‌ను అదుపులోకి తీసుకున్నారు.
విచారణలో నిందితులు జరిగిన విషయాన్ని ఒప్పుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రధాన నిందితుడు నాగేశ్వరరావు, నాగేంద్రబాబు, అరవింద చౌదరి, రాధ, భాస్కర్, పెద్దరెడ్డి, సాగర్, వెంకటసురేష్, శివ, సునీల్, పవన్, సుబ్బులను అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో మరికొందరు ఉన్నారని, త్వరలో వారిని అరెస్ట్ చేస్తామని డీఎస్పీ మహబూబ్‌బాషా చెప్పారు. ఎవరైనా డబ్బు ఆశచూపి యువతులు, మహిళలకు ఎరవేస్తే నమ్మి మోసపోవద్దని డీఎస్పీ కోరారు.
Comments
Please login to add a commentAdd a comment