
సాక్షి, హైదరాబాద్ : కొణిదెల, నందమూరి వార్ ముదురుతోంది. సోషల్ మీడియాలో బాలయ్యపై నాగబాబు మరోసారి కౌంటర్ ఇచ్చారు. నందమూరి ఫ్యామిలీ వాళ్లే సూపర్ స్టార్లా ? ఇండస్ట్రీలో మరే స్టార్లు లేరా? అంటూ నిప్పులు చెరిగారు. టీడీపీని గెలిపించిన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఎవరో బాలయ్యకు తెలియదా అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్‌ను రాజకీయంగా టీడీపీ వాడుకుని ఇప్పుడు పవన్ ఎవరో తెలియదు అనడం మమ్మల్ని ఎంతగానో బాధించింది అని నాగబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
''ఒక సినీ హీరోగా పవన్ కళ్యాణ్ మీకు తెలియకపోతే మాకేమీ ఇబ్బంది లేదు. కానీ అవసరానికి రాజకీయంగా వాడుకుని ఇప్పడు తెలియదు అంటే వాళ్లను ఏమనాలి. బాలయ్య ఎవరో నాకు తెలియదు అంటే రాద్ధాంతం చేస్తున్న నందమూరి అభిమానులు గతంలో బాలయ్య కామెంట్లకు ఏం సమాధానం చెబుతారు. బాలకృష్ణ బావ చంద్రబాబు నాయుడు మా ఇంటికి వచ్చి పవన్ కళ్యాణ్‌ను స్వాగతించి రాజకీయంగా వాడుకున్నారు. ఏపీ సీఎంగా వైఎస్ జగన్ గెలవాల్సిన సమయంలో సీనియారిటీ ఉన్న నాయకుడని చంద్రబాబును నమ్మి టీడీపీకి పవన్ మద్దతు తెలిపారు. కనీసం ఒక్క సీటు కూడా జనసేన పోటీ చేయకపోయినా టీడీపీ గెలుపుకోసం పవన్ చాలా కష్టపడ్డారు. ఎన్నికల్లో గెలిచాక పవన్ కళ్యాణ్ ఎవరోతెలీదు అనడం ఎంత వరకు సబబు. మీరు అనొచ్చు కానీ, మేము తెలియదంటే కోపమొస్తుందా ? చిరంజీవి ఏమయ్యాడు అంటూ హేళనగా మాట్లాడిన బాలయ్య మాటలను నందమూరి అభిమానులు ఎందుకు ఖండించలేదు.
మా బ్లడ్ వేరు మా బ్రీడు వేరూ అంటూ బాలయ్య అంటూ ఉంటారు. నందమూరి హీరోలు ఆకాశం నుంచి వచ్చారా? మీరు మాలాగే మనుషులు తల్లీదండ్రులకు పుట్టినవారే. ఆస్ట్రియాలో బ్లూబ్లడ్ అనే కల్చర్ ఉండేది, వాళ్లే గొప్పవాళ్లు అనే అహంతో ఆ రాజవంశీకులు వ్యవహరిస్తే వాళ్లను ప్రజలు దించేశారు. పేరున్న ప్రతివారు స్టార్లే.. జనాలు మెచ్చుకుంటేనే స్టార్లవుతారు. మా అన్నతమ్ముళ్ల మీద బాలయ్య 6 సార్లు కామెంట్లు చేస్తే, తిరిగి సీరియస్‌గా కాకుండా ఫన్నీగా కౌంటర్ ఇచ్చా. మా కుటుంబాన్ని ఎందుకు లాగుతున్నారు? నందమూరి వంశీయులు సూర్యవంశీకులా. అమితాబ్ బచ్చన్‌ను కించపరిచేలా కూడా బాలయ్య మాట్లాడారు'' అంటూ నాగబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ఈ మధ్యే బాలకృష్ణ నటిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్‌పై నాగబాబు తీవ్ర ఆరోపణలు చేశారు. కట్టుకథలు మూటకట్టి ప్రేక్షకుల మొహాన కొట్టొదయ్యా అంటూ వేమన శతకం తరహాలో ఓ కవితనే అందుకున్నారు. కాంట్రవర్సీలకు దూరంగా ఉండే నాగబాబు.. పవన్ తనకు తెలియదని బాలకృష్ణ కామెంట్ చేసిన దగ్గర నుంచే ఈ వివాదం మొదలైంది. బాలకృష్ణ గురించి అడిగితే ఆయనెవరో తెలియదని నాగబాబు అనడం, తర్వాత బాలకృష్ణ ఎవరో తెలుసని, ఆయన పాత సినిమాల్లో కమెడియన్ అంటూ ఓ వీడియో పెట్టడంతో, బాలయ్య అభిమానులు సోషల్‌మీడియా వేదికగా నాగబాబుపై విరుచుకుపడ్డారు. వీటన్నిటికి కౌంటర్‌గా నాగబాబు ఆదివారం నుంచి కొన్ని వీడియోలు పెడుతూ, తాను ఎందుకు అలా అనాల్సి వచ్చిందో వివరణ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment