విమర్శిస్తే మైలేజ్ వస్తుందని..
విమర్శిస్తే మైలేజ్ వస్తుందని..
Published Sun, Jan 8 2017 2:34 AM | Last Updated on Tue, Sep 5 2017 12:41 AM
♦ యండమూరి, ఆర్జీవీపై పరోక్షంగా నాగబాబు ఫైర్
♦ స్పందించిన యండమూరి.. ఘాటుగా బదులిచ్చిన ఆర్జీవీ
సాక్షి, అమరావతి: చిరంజీవి సినిమా ఖైదీ నంబర్ 150 ప్రీ రిలీజ్ వేడుకలో మెగా బ్రదర్ నాగబాబు పరోక్షంగా రచయిత యండమూరి, రామ్‌గోపాల్ వర్మలపై మండిపడ్డారు. నాగబాబు మాట్లాడుతూ ‘‘ప్రతివాడికీ మెగా ఫ్యామిలీ మీద చూపుంటుంది. చిరంజీవిని, ఆయన కుటుంబ సభ్యులను విమర్శిస్తే వాళ్లకు మైలేజ్ వస్తుంది. ఓ ప్రముఖుడు, రచనల్లో నిపుణుడు, ఎవర్నో హైలైట్ చేయడానికి చరణ్ విలువని తగ్గించిన మూర్ఖుడు ఒకడు న్నాడు. వాడికి కామన్‌సెన్స్ లేదు. వ్యక్తిత్వపు వికాసపు కోర్సులు చెబుతుంటాడు. మొదట వాడు వ్యక్తిత్వ వికాసం నేర్చుకోవాలి. ఇతరులను తక్కువ చేసే కుసంస్కారం వాడిది’’ అంటూ యండమూరి వీరేంద్ర నాథ్‌పై విమర్శలు గుప్పించారు. రామ్‌గోపాల్ వర్మపై విమర్శలు చేస్తూ.. ‘‘తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ముంబై వెళ్లిన ఒకడు రకరకాల కూతలు కూస్తున్నాడు. ఈ కూతలు ఆపేసి దర్శ కత్వం సక్రమంగా చేసుకుని, ఆ బాంబ్ ఏదో అక్కడే ముంబై లో పేల్చుకుంటే... వాడికీ మంచిది, మాకూ మంచిది. చిరంజీవి సినిమా ఎలా ఉండాలి? ఆయన ఎలా చేయాలి? అని మాట్లాడడం. ఇలాంటి అక్కుపక్షి, పనికిమాలిన సన్నాసి కూసే కూతలతో మాకేం కాదు. ఇలాంటి పక్షి ఎన్ని కూతలు కూసినా.. సూపర్‌హిట్ సినిమాని ఆపలేవు. ఫెయిల్యూర్ సినిమాని లేపలేవు’’ అంటూ ధ్వజమెత్తారు.
మనసులో ఉన్నది దాచుకోలేరు
నాగబాబు వ్యాఖ్యలపై యండమూరి స్పందించారు. ‘‘ఇటీవల ఓ టీవీ ఫంక్షన్‌లో నాగబాబు కలసి.. కథలు ఇవ్వాలన్నాడు. మరి, ఇలా ఎందుకు జరిగింది? ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు చిరంజీవి రాజకీయాలకు పనికిరాడు! అని ఓ కామెంట్ చేశా. ఈ మధ్యన రామ్‌చరణ్ తేజ్, దేవిశ్రీ ప్రసాద్ లను పోలుస్తూ ఓ కామెంట్ చేశా. ఇద్దరి తండ్రులూ నాకు క్లోజ్. ఫాదర్ కాదు ముఖ్యం, ప్రతిభ ఉండాలని చెప్పడం ఎవరినీ తక్కువ చేయడం కాదు’’ అని చెప్పారు.
ట్వీటర్‌లో ఆర్జీవీ ఫైర్..
నాగబాబు వ్యాఖ్యలపై వర్మ ట్వీటర్‌లో ఘాటుగా స్పందిం చారు. మొదట వర్మ అఫీషియల్ ట్వీటర్ ఎకౌంట్ నుండి మెగా ఫ్యామిలీకి క్షమాపణలు చెబుతూ తెలుగులో ట్వీట్స్ వచ్చాయి. తర్వాత ‘నా ట్వీటర్ ఎకౌంట్ ఎవరో హ్యాక్ చేశారు’ అని వర్మ పేర్కొన్నారు. ‘‘నాగబాబు సార్.. మీకు ఇంగ్లిష్ అర్థం కాదు ఎవరితోనైనా చదివించుకోండి. నాకు సలహా ఇచ్చేముందు మీ ‘జబర్‌దస్త్’ కెరీర్ గురించి ప్రశ్నించు కోండి. ‘ప్రజారాజ్యం’ టైమ్‌లో మీ అన్నయ్యకు తప్పుడు సలహాలిచ్చి ఆయన ఓడిపోయేలా చేశారు. ‘అక్కుపక్షి’ అనే కామెంట్స్ చేసి టైమ్ వృథా చేసుకునే బదులు మీ సోదరు లను బతిమాలుకోండి. లేదంటే రోడ్డున పడే అవకాశం ఉంది’’ అని వర్మ ట్వీట్స్ చేశారు. ఇటువంటి ప్రతిష్ఠాత్మక వేడుకలకు నాగబాబును తీసుకువెళ్లవద్దంటూ చిరంజీవిని కోరారు. ‘‘ఇప్పుడే ‘ఖైదీ నంబర్ 150’ ట్రైలర్ చూశా. ‘అవ తార్’ కంటే కాస్త బాగుంది’’ అని వ్యంగ్యాస్త్రాలు విసిరారు.
Advertisement
Advertisement