
సాక్షి, అమరావతి: వైఎస్సార్ ఆసరా పథకం రెండో విడతగా రాష్ట్రంలోని 78.75 లక్షల మంది పొదుపు సంఘాల మహిళలకు రూ.6,470 కోట్ల మొత్తాన్ని పంపిణీ చేయనున్నట్టు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అక్టోబర్ 7న ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. వైఎస్సార్ ఆసరా, చేయూత, జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాల అమలుపై జిల్లా కలెక్టర్లు, జేసీలు, డ్వామా, డీఆర్‌డీఏ పీడీలతో మంత్రి పెద్దిరెడ్డి బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
అసెంబ్లీ ఎన్నికల నాటికి (2019 ఏప్రిల్ 11) పొదుపు సంఘాల పేరిట బ్యాంకుల్లో ఉండే అప్పు మొత్తం తమ ప్రభుత్వమే భరిస్తుందన్న మాటను సీఎం నిలబెట్టుకుంటున్నారని చెప్పారు. నాలుగు విడతల్లో పొదుపు సంఘాల మహిళలకు వారి అప్పు మొత్తం చెల్లించేందుకు చర్యలు తీసుకున్నామని, మొదటి విడత గతేడాది చెల్లించామని గుర్తు చేశారు. అక్టోబర్ 8న జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి జిల్లా ఇన్‌చార్జి మంత్రులు ప్రారంభిస్తారని తెలిపారు. అన్ని నియోజకవర్గాల్లో 10 రోజుల పాటు ఆసరా రెండో విడత చెల్లింపులను ఉత్సాహంగా నిర్వహించాలన్నారు. ఈ పది రోజుల్లో వ్యాపార అవకాశాలు, ఉపాధి మార్గాలపై మహిళలకు అవగాహన, బ్యాంకు రుణాలు పొందేలా చూడటం, మార్కెటింగ్ అవకాశాలు వివరించడం వంటి కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.
100 రోజులపాటు జగనన్న స్వచ్ఛ సంకల్పం
ఆరోగ్యవంతమైన గ్రామసీమలే లక్ష్యంగా జగనన్న స్వచ్ఛ సంకల్పం నినాదంతో క్లీన్ ఆంధ్రప్రదేశ్ (క్లాప్) కార్యక్రమం అక్టోబర్ 2న సీఎం చేతుల మీదుగా ప్రారంభమవుతుందని పెద్దిరెడ్డి తెలిపారు. గ్రామస్థాయిలో వంద రోజుల పాటు ఒక ఉద్యమంగా కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు తెలిపారు. పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజాశంకర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment