సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా తీవ్రంగా ఉన్న బొగ్గు కొరత కారణంగా రాష్ట్రంలో ఏర్పడిన విద్యుత్ కొరతను మే మొదటి వారానికల్లా అధిగమించేందుకు ప్రభుత్వం, విద్యుత్ సంస్థలు అన్నిరకాల చర్యలు చేపడుతున్నాయి. దీన్లో భాగంగా రాష్ట్ర ఇంధనశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు బొగ్గు లభ్యత పెంచడం, విద్యుత్ కొరతను అధిగమించడం వంటి అంశాలను నిరంతరం పర్యవేక్షించేందుకు రాష్ట్ర ఇంధనశాఖ ప్రత్యేకంగా ఒక డైరెక్టర్ (బొగ్గు)ను నియమించింది. ఇప్పటివరకు ఏపీజెన్‌కో డైరెక్టర్లే ఈ బాధ్యతలు కూడా చూసేవారు. కానీ ఇప్పుడు ప్రత్యేకాధికారితోపాటు ఉన్నతాధికారులతో ఒక కోర్ మేనేజ్‌మెంట్ బృందాన్ని కూడా ఏర్పాటు చేసింది.
ఇంధనశాఖ కార్యదర్శి బి.శ్రీధర్ పర్యవేక్షణలో పరిశ్రమలకు కూడా మే మొదటివారానికి పూర్తిస్థాయిలో విద్యుత్ సరఫరా పునరుద్దరించాలనే లక్ష్యంతో ఈ బృందం పనిచేయనుంది. ప్రస్తుతం చాలా రాష్ట్రాల్లోని థర్మల్ విద్యుత్ ప్లాంట్లలో రెండు నుంచి ఐదురోజులకు సరిపడా బొగ్గునిల్వలు మాత్రమే ఉన్నాయి. నిబంధనల ప్రకారం థర్మల్ ప్లాంట్‌లో 24 రోజులకు సరిపడా బొగ్గునిల్వలు ఉండాలి. అన్ని రాష్ట్రాలు బహిరంగ మార్కెట్‌లో విద్యుత్ కొనుగోలు చేసేందుకు క్యూ కడుతున్నాయి. ఫలితంగా డిమాండ్–సరఫరా మధ్య అంతరం బాగా పెరిగిపోయింది. విద్యుత్ ఎక్సే్ఛంజిల్లో గత పదేళ్లలో ఎన్నడూ లేనంతగా యూనిట్ ధర గతేడాది అక్టోబర్ తరువాత మళ్లీ రూ.12 నుంచి రూ.20 వరకు పలుకుతోంది. మన రాష్ట్ర విద్యుత్ సంస్థలు కూడా పీక్ అవర్స్‌లో ఇదే ధర వద్ద విద్యుత్ కొనక తప్పని పరిస్థితి ఏర్పడింది.
భారీగా పెరిగిన డిమాండ్
రాష్ట్రంలో వేసవి కారణంగా విద్యుత్ డిమాండ్ అమాంతం పెరిగింది. 2018–19లో 63,605 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ ఉండగా ప్రస్తుతం అది 68,905 మిలియన్ యూనిట్లకు చేరింది. అంటే గతంలో ఎన్నడూ లేనివిధంగా 8.33 శాతం చొప్పున విద్యుత్ డిమాండ్ పెరగింది. అదే సమయంలో బొగ్గు లభ్యత భారీగా పడిపోయింది. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలోను మన రాష్ట్రంలో గృహ అవసరాలకు నిరంతరం, వ్యవసాయానికి ఏడుగంటలు ఉచిత విద్యుత్ సరఫరాకు ఇబ్బంది తలెత్తకుండా చేసేందుకు విద్యుత్ సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. రాష్ట్రంలో ఈ నెల 23న డిస్కంలు 208 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను సరఫరా చేశాయి. గత ఏడాది అదే రోజున 192 మిలియన్ యూనిట్లు సరఫరా అయింది.
ప్రజలు అర్థం చేసుకుంటారు
తప్పని సరై, విధిలేని పరిస్థితుల్లోనే పరిశ్రమలకు విద్యుత్ సరఫరాపై ఆంక్షలు విధించామని రాష్ట్ర ఇంధనశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. విద్యుత్ సంస్థల ఉన్నతాధికారులతో ఆదివారం మంత్రి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆ వివరాలను రాష్ట్ర ఇంధన సంరక్షణ మిషన్ సీఈవో ఎ.చంద్రశేఖరరెడ్డి మీడియాకు వెల్లడించారు. తాత్కాలికంగా ఏర్పడిన విద్యుత్ కొరత సమస్యను ప్రజలు అర్థం చేసుకుంటారన్న నమ్మకం తమకు ఉందని, నెలాఖరుకల్లా విద్యుత్ కొరత తీరుతుందని మంత్రి చెప్పారు.
ఎంత ఖర్చయినా సరే బహిరంగ మార్కెట్‌లో విద్యుత్ కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, కానీ తగినంత విద్యుత్ లభ్యత లేకపోవడమే ప్రధాన సమస్యగా మారిందని పేర్కొన్నారు. విద్యుత్ డిమాండ్ అధికంగా ఉండే మే–అక్టోబర్ నెలల మధ్య కాలానికి విద్యుత్ సంస్థలు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు ఇంధనశాఖ కార్యదర్శి బి.శ్రీధర్ మంత్రికి వివరించారు. విద్యుత్ రంగంపై ప్రతివారం నిర్వహించే సమీక్షల్లో భాగంగా ఏపీ ట్రాన్స్‌కో ప్రాజెక్టులు, నిర్వహణపై సోమవారం సెక్రటేరియట్‌లో చర్చిస్తానని మంత్రి అధికారులకు చెప్పారు. టెలీకాన్ఫరెన్స్‌లో జేఎండీ ఐ.పృధ్వీతేజ్, గ్రిడ్ డైరెక్టర్ ఎ.వి.కె.భాస్కర్, మూడు డిస్కంల సీఎండీలు పాల్గొన్నారు.
కొరతపై ‘కోర్ కమిటీ’
Published Mon, Apr 25 2022 3:20 AM | Last Updated on Mon, Apr 25 2022 4:55 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment