సాక్షి, అమరావతి: కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత జిల్లా, డివిజన్ స్థాయిలో అదనంగా అవసరమయ్యే వివిధ పోస్టులను ప్రస్తుతం ఉన్న అధికారులు, ఇతర సీనియర్ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించడం ద్వారానే భర్తీ చేస్తామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. అర్హత ఉండి పదోన్నతుల కోసం వేచి చూస్తున్న వారందరికీ ప్రమోషన్లు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు చెప్పారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై బుధవారం అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ కోన శశిధర్, సెర్ప్ సీఈవో ఇంతియాజ్ అహ్మద్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీ సంపత్‌కుమార్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ స్పెషల్ కమిషనర్ శాంతిప్రియ పాండే, పంచాయతీరాజ్ ఈఎన్‌సీ సుబ్బారెడ్డి, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఎన్‌సీ కృష్ణారెడ్డిలు సమావేశంలో పాల్గొన్నారు. సిబ్బందిని కేటాయించే విషయంలో శాస్త్రీయంగా చర్చించి నిర్ణయం తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.
44.70 లక్షల ఇళ్లకు కొళాయిలు
గ్రామీణ ప్రాంతాల్లో రాష్ట్ర వ్యాప్తంగా 95.16 లక్షల ఇళ్లుండగా.. ఇప్పటి వరకు 44.70 లక్షల ఇళ్లకు మంచినీటి కొళాయిలను సమకూర్చగలిగామని మంత్రి పెద్దిరెడ్డి చెప్పారు. వాటిలో 5.55 లక్షల ఇళ్లకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే కొళాయిలు ఏర్పాటు చేశామన్నారు. వచ్చే రెండు మూడేళ్లలో ప్రతి ఇంటికీ కొళాయి ఏర్పాటు ద్వారా సురక్షిత నీటిని అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా మంత్రి తెలిపారు.
కావాలనే కోర్టులకెళ్తున్నారు
పాలనా వ్యవహారాల్లో తమ ప్రభుత్వం అత్యంత పారదర్శక విధానాలను అవలంబిస్తోందని.. అయినా లిటిగేషన్ కోసమే కొందరు న్యాయస్థానాల్లో పిటిషన్లు దాఖలు చేస్తూ ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ఆటంకాలు కల్పించే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి పేర్కొన్నారు. శాఖకు సంబంధించిన పెండింగ్ కేసులపై జీపీ, ఏజీపీ, లీగల్ స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులు తదితరులతో ఆయన సమీక్ష నిర్వహించారు. న్యాయస్థానాల పట్ల ప్రభుత్వానికి చాలా గౌరవం ఉందన్నారు. ప్రజల కోసం మంచి ఉద్దేశంతో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను సవివరంగా గౌరవ న్యాయస్థానాల ముందు ఉంచడం ద్వారా కేసులను ఎదుర్కోవచ్చని అధికారులకు సూచించారు. సకాలంలో కౌంటర్లు దాఖలు చేయడం, పూర్తి వాస్తవాలతో కూడిన వివరాలతో వాదనలు వినిపించడం ద్వారా కేసుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని లీగల్ అధికారులను ఆదేశించారు.
పదోన్నతుల ద్వారా కొత్త జిల్లాలకు సిబ్బంది
Published Thu, Mar 3 2022 5:09 AM | Last Updated on Thu, Mar 3 2022 5:09 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment