Employee promotions
-
పదోన్నతుల ద్వారా కొత్త జిల్లాలకు సిబ్బంది
సాక్షి, అమరావతి: కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత జిల్లా, డివిజన్ స్థాయిలో అదనంగా అవసరమయ్యే వివిధ పోస్టులను ప్రస్తుతం ఉన్న అధికారులు, ఇతర సీనియర్ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించడం ద్వారానే భర్తీ చేస్తామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. అర్హత ఉండి పదోన్నతుల కోసం వేచి చూస్తున్న వారందరికీ ప్రమోషన్లు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు చెప్పారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై బుధవారం అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ కోన శశిధర్, సెర్ప్ సీఈవో ఇంతియాజ్ అహ్మద్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీ సంపత్‌కుమార్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ స్పెషల్ కమిషనర్ శాంతిప్రియ పాండే, పంచాయతీరాజ్ ఈఎన్సీ సుబ్బారెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఈఎన్సీ కృష్ణారెడ్డిలు సమావేశంలో పాల్గొన్నారు. సిబ్బందిని కేటాయించే విషయంలో శాస్త్రీయంగా చర్చించి నిర్ణయం తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. 44.70 లక్షల ఇళ్లకు కొళాయిలు గ్రామీణ ప్రాంతాల్లో రాష్ట్ర వ్యాప్తంగా 95.16 లక్షల ఇళ్లుండగా.. ఇప్పటి వరకు 44.70 లక్షల ఇళ్లకు మంచినీటి కొళాయిలను సమకూర్చగలిగామని మంత్రి పెద్దిరెడ్డి చెప్పారు. వాటిలో 5.55 లక్షల ఇళ్లకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే కొళాయిలు ఏర్పాటు చేశామన్నారు. వచ్చే రెండు మూడేళ్లలో ప్రతి ఇంటికీ కొళాయి ఏర్పాటు ద్వారా సురక్షిత నీటిని అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా మంత్రి తెలిపారు. కావాలనే కోర్టులకెళ్తున్నారు పాలనా వ్యవహారాల్లో తమ ప్రభుత్వం అత్యంత పారదర్శక విధానాలను అవలంబిస్తోందని.. అయినా లిటిగేషన్ కోసమే కొందరు న్యాయస్థానాల్లో పిటిషన్లు దాఖలు చేస్తూ ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ఆటంకాలు కల్పించే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి పేర్కొన్నారు. శాఖకు సంబంధించిన పెండింగ్ కేసులపై జీపీ, ఏజీపీ, లీగల్ స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులు తదితరులతో ఆయన సమీక్ష నిర్వహించారు. న్యాయస్థానాల పట్ల ప్రభుత్వానికి చాలా గౌరవం ఉందన్నారు. ప్రజల కోసం మంచి ఉద్దేశంతో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను సవివరంగా గౌరవ న్యాయస్థానాల ముందు ఉంచడం ద్వారా కేసులను ఎదుర్కోవచ్చని అధికారులకు సూచించారు. సకాలంలో కౌంటర్లు దాఖలు చేయడం, పూర్తి వాస్తవాలతో కూడిన వివరాలతో వాదనలు వినిపించడం ద్వారా కేసుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని లీగల్ అధికారులను ఆదేశించారు. -
ఒక్కరోజులో పదోన్నతులొచ్చేనా?
సాక్షి, హైదరాబాద్: ‘అర్హులైన ప్రభుత్వ ఉద్యోగులందరికీ పదోన్నతులు కల్పిస్తాం. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఖాళీలను త్వరలో భర్తీచేస్తాం’ – గత మార్చి 22న శాసనసభలో పీఆర్సీపై ప్రకటన సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ‘కొత్త జిల్లాల ప్రాతిపదికన క్యాడర్ విభజన పూర్తిచేసి పదోన్నతులు, బదిలీల ప్రక్రియ ప్రారంభించాలి’ – గత జూన్ 26న పీఆర్టీయూ–టీఎస్ నేతలు తనను కలిసిన సందర్భంగా సీఎం కేసీఆర్ ఆదేశం ఉద్యోగుల పదోన్నతుల ప్రక్రియపై పాలనాయంత్రాంగంలో ఉలుకూపలుకూలేదు. మూడేళ్లుగా ఆ ప్రక్రియ ముందుకు సాగడంలేదు. ఉపాధ్యాయుల పదోన్నతులకేమో ఆరేళ్లుగా అతీగతీలేదు. అర్హులైన ప్రభుత్వ ఉద్యోగులందరికీ పదోన్నతులు కల్పించాలని సీఎం కేసీఆర్ ఆరు నెలలుగా పదే పదే ఆదేశిస్తున్నా, ప్రక్రియ మాత్రం పూర్తి కావడం లేదు. సెప్టెంబర్ 1 నుంచి ఆగస్టు 31వ తేదీ మధ్య కాలాన్ని ఉద్యోగుల పదోన్నతులకు ప్యానెల్ ఇయర్‌గా పరిగణిస్తారు. సీనియారిటీ, రిజర్వేషన్లు, ఖాళీలను పరిగణనలోకి తీసుకుని ఆ ప్యానెల్ ఇయర్లో పదోన్నతులు కల్పించాల్సిన అర్హులైన ఉద్యోగుల జాబితాలను సీనియర్ అధికారులతో కూడిన శాఖాపరమైన పదోన్నతుల కమిటీ(డీపీసీ) తయా రు చేస్తుంది. ఆగస్టు 31తో ప్రస్తుత ప్యానెల్ ఇయర్ ముగింపునకు కేవలం మరొక రోజు మాత్రమే మిగిలి ఉండగా, డీపీసీ సిఫారసు చేసినా పదోన్నతులు పొందలేకపోయిన ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర సచివాలయ సర్వీసుల ఉద్యోగులకు గత రెండేళ్లుగా పదోన్నతులు కల్పించలేదు. దాదాపు 350 పోస్టులు ఖాళీగా ఉండగా, ఆ మేరకు ఉద్యోగులకు పదోన్నతి కల్పించడానికి అవకాశముంది. రూల్ ఆఫ్ రిజర్వేషన్ సమస్యలున్నా, కండిషన్ పదోన్నతులు, సూపర్ న్యూమరరీ పదోన్నతులు ఇచ్చే అవకాశముందని ఉద్యోగసంఘాల నేతలు పేర్కొంటున్నారు. పదోన్నతులు వచ్చినా లభించని కొత్త పోస్టింగ్‌లు: దాదాపు అన్ని శాఖల డైరెక్టరేట్లతోపాటు జిల్లాస్థాయిల్లో పలువురు ఉద్యోగులకు గత ఫిబ్రవరిలో పదోన్నతులిచ్చినా, వారిలో చాలామంది కొత్త పోస్టింగ్‌లకు నోచుకోకుండా పాత పోస్టుల్లోనే కొనసాగుతున్నారు. కొత్త రాష్ట్రపతి ఉత్తర్వుల ఆధారంగా లోకల్, జోనల్, మల్టీ జోనల్‌గా పోస్టుల పునర్విభజన ప్రక్రియ పూర్తైంది. కేడర్లవారీగా సర్వీసు రూల్స్‌ను ప్రకటిస్తూ జీవోలు రావాల్సి ఉంది. అనంతరం ఆయా లోకల్కేడర్ల పోస్టులకు ఉద్యోగులను కేటాయించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తైన తర్వాతే పదోన్నతులు పొందిన ఉద్యోగులకు కొత్త పోస్టింగ్‌లు వచ్చే అవకాశముంది. అయితే రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌కుమార్ రెవెన్యూ శాఖ, సీసీఎల్ఏ, ఎక్సైజ్, కమర్షియల్ ట్యాక్సుల శాఖల అదనపు బాధ్యతల్లో తీరిక లేకుండా ఉండటంతో ఉద్యోగుల పదోన్నతులు, ఖాళీల భర్తీ ప్రక్రియ ముందుకు కదలడంలేదని ఉద్యోగ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ఆరేళ్లుగా పదోన్నతుల్లేవ్..: ప్రభుత్వ టీచర్లకు చివరిసారిగా 2015 జూలైలో పదోన్నతులు ఇచ్చారు. గత ఆరేళ్లుగా పదోన్నతులు నిలిచిపోయాయి. 10,479 మంది భాషాపండితులు, వ్యాయామ టీచర్ల పోస్టులను స్కూల్ అసిస్టెంట్లుగా అప్‌గ్రేడ్ చేసినా, న్యాయపరమైన చిక్కులతో పదోన్నతులు నిలిచిపోయాయి. -
హెచ్‌డీసీసీబీలో రాజుకున్న వివాదం!
- పాలకవర్గం అనుమతి లేకుండానే ముగ్గురికి పదోన్నతులు కొందరు కిందిస్థాయి - ఉద్యోగులకు బదిలీలు సమావేశాన్ని బహిష్కరించిన సభ్యులు - చైర్మన్‌కు అన్నీ చెప్పామంటున్న డీసీసీబీ సీఈఓ సాక్షి, రంగారెడ్డి జిల్లా: హైదరాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (హెచ్‌డీసీసీబీ)లో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. గత పాలకవర్గం హయాంలో నిధుల గోల్‌మాల్‌తో తీవ్ర దుమారం సృష్టించిన హెచ్‌డీసీసీబీ... ప్రస్తుతం ఉద్యోగుల పదోన్నతులు, బదిలీల అంశం తాజా వివాదానికి కారణమైంది. పాలకవర్గం అనుమతి లేకుండా ముగ్గురు అధికారులకు పదోన్నతులు కల్పించారు. కొందరు కిందిస్థాయి ఉద్యోగులను బదిలీ చేశారు. పాలకవర్గం అనుమతి లేకుండానే ఇవన్నీ చేయడంపై సభ్యులు భగ్గుమన్నారు. సోమవారం బ్యాంకు సమావేశ మందిరంలో నిర్వహించిన పాలకవర్గ సమావేశాన్ని బహిష్కరించి నిరసన వ్యక్తం చేయడంతో వివాదం మరింత రసకందాయంగా మారింది. ఏకపక్ష నిర్ణయంతో... డీసీసీబీ పరిధిలోని ముగ్గురు ఉద్యోగులకు ఇటీవల పదోన్నతి కల్పించారు. ఇందులో ఇద్దరు అసిస్టెంట్ జనరల్ మేనేజర్ క్యాడర్‌కు వెళ్లగా, మరొకరు డిప్యూటీ జనరల్ మేనేజర్ కేడర్‌కు వచ్చారు. సాధారణంగా బ్యాంకు ఉద్యోగులకు పదోన్నతి ఇవ్వాల్సి ఉంటే ముందుగా హెచ్ఆర్డీ కమిటీ ఆమోదం తీసుకోవాలి. కానీ ఈ కమిటీ ఆమోదం లేకుండానే ముగ్గురు అధికారులకు పదోన్నతులివ్వడం వివాదాస్పదమైంది. చైర్మన్ ఆమోదంతో పదోన్నతులిచ్చామని బ్యాంకు ఉన్నతాధికారులు చెబుతున్నప్పటికీ ప్రక్రియ ఏకపక్షంగా జరగిందని సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బదిలీల్లో గోప్యత... సిబ్బంది బదిలీల అంశం సైతం డీసీసీబీ పాలకవర్గంలో ముసలం రేపింది. పాలకవర్గం సమావేశంలో ఆమోదం తెలిపి తీర్మానం చేపట్టిన తర్వాతే బదిలీలు చేయాలనే నిబంధనలను బ్యాంకు అధికారులు పక్కనపెట్టారు. బదిలీలు చేపట్టారు. ఇతర విభాగాల్లో ఉద్యోగులు వచ్చినందున డీసీసీబీ పరిధిలో పలు ఖాళీలు ఏర్పడ్డాయి. ప్రాధాన్యత క్రమంలో భాగంగా పలువురు ఉద్యోగులను బదిలీ చేశామని అధికారులు చెబుతుండడం గమనార్హం. చైర్మన్‌కు చెప్పే చేశాం: డీసీసీబీ సీఈఓ రాందాస్ అధికారుల పదోన్నతితో పాటు ఉద్యోగుల బదిలీ అంశం మొత్తం చైర్మన్ అనుమతితోనే చేశాం. సోమవారం నాటి పాలకవర్గ సమావేశంలో ఈ అంశాలకు ప్రాదాన్యత ఇస్తూ నోట్ రూపొందించాం. సభ్యులకు ఈ విషయాల్ని వివరించే లోపే సమావేశం నుంచి నిష్ర్కమించారు. దీంతో వారికి విషయాన్ని వివరించలేకపోయాం.