సాక్షి, హైదరాబాద్: ‘అర్హులైన ప్రభుత్వ ఉద్యోగులందరికీ పదోన్నతులు కల్పిస్తాం. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఖాళీలను త్వరలో భర్తీచేస్తాం’
– గత మార్చి 22న శాసనసభలో పీఆర్సీపై ప్రకటన సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు
‘కొత్త జిల్లాల ప్రాతిపదికన క్యాడర్ విభజన పూర్తిచేసి పదోన్నతులు, బదిలీల ప్రక్రియ ప్రారంభించాలి’
– గత జూన్ 26న పీఆర్‌టీయూ–టీఎస్ నేతలు తనను కలిసిన సందర్భంగా సీఎం కేసీఆర్ ఆదేశం
ఉద్యోగుల పదోన్నతుల ప్రక్రియపై పాలనాయంత్రాంగంలో ఉలుకూపలుకూలేదు. మూడేళ్లుగా ఆ ప్రక్రియ ముందుకు సాగడంలేదు. ఉపాధ్యాయుల పదోన్నతులకేమో ఆరేళ్లుగా అతీగతీలేదు. అర్హులైన ప్రభుత్వ ఉద్యోగులందరికీ పదోన్నతులు కల్పించాలని సీఎం కేసీఆర్ ఆరు నెలలుగా పదే పదే ఆదేశిస్తున్నా, ప్రక్రియ మాత్రం పూర్తి కావడం లేదు. సెప్టెంబర్ 1 నుంచి ఆగస్టు 31వ తేదీ మధ్య కాలాన్ని ఉద్యోగుల పదోన్నతులకు ప్యానెల్ ఇయర్‌గా పరిగణిస్తారు. సీనియారిటీ, రిజర్వేషన్లు, ఖాళీలను పరిగణనలోకి తీసుకుని ఆ ప్యానెల్ ఇయర్‌లో పదోన్నతులు కల్పించాల్సిన అర్హులైన ఉద్యోగుల జాబితాలను సీనియర్ అధికారులతో కూడిన శాఖాపరమైన పదోన్నతుల కమిటీ(డీపీసీ) తయా రు చేస్తుంది.
ఆగస్టు 31తో ప్రస్తుత ప్యానెల్ ఇయర్ ముగింపునకు కేవలం మరొక రోజు మాత్రమే మిగిలి ఉండగా, డీపీసీ సిఫారసు చేసినా పదోన్నతులు పొందలేకపోయిన ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర సచివాలయ సర్వీసుల ఉద్యోగులకు గత రెండేళ్లుగా పదోన్నతులు కల్పించలేదు. దాదాపు 350 పోస్టులు ఖాళీగా ఉండగా, ఆ మేరకు ఉద్యోగులకు పదోన్నతి కల్పించడానికి అవకాశముంది. రూల్ ఆఫ్ రిజర్వేషన్ సమస్యలున్నా, కండిషన్ పదోన్నతులు, సూపర్ న్యూమరరీ పదోన్నతులు ఇచ్చే అవకాశముందని ఉద్యోగసంఘాల నేతలు పేర్కొంటున్నారు.
పదోన్నతులు వచ్చినా లభించని కొత్త పోస్టింగ్‌లు: దాదాపు అన్ని శాఖల డైరెక్టరేట్లతోపాటు జిల్లాస్థాయిల్లో పలువురు ఉద్యోగులకు గత ఫిబ్రవరిలో పదోన్నతులిచ్చినా, వారిలో చాలామంది కొత్త పోస్టింగ్‌లకు నోచుకోకుండా పాత పోస్టుల్లోనే కొనసాగుతున్నారు. కొత్త రాష్ట్రపతి ఉత్తర్వుల ఆధారంగా లోకల్, జోనల్, మల్టీ జోనల్‌గా పోస్టుల పునర్విభజన ప్రక్రియ పూర్తైంది. కేడర్లవారీగా సర్వీసు రూల్స్‌ను ప్రకటిస్తూ జీవోలు రావాల్సి ఉంది. అనంతరం ఆయా లోకల్‌కేడర్ల పోస్టులకు ఉద్యోగులను కేటాయించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తైన తర్వాతే పదోన్నతులు పొందిన ఉద్యోగులకు కొత్త పోస్టింగ్‌లు వచ్చే అవకాశముంది. అయితే రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌కుమార్ రెవెన్యూ శాఖ, సీసీఎల్‌ఏ, ఎక్సైజ్, కమర్షియల్ ట్యాక్సుల శాఖల అదనపు బాధ్యతల్లో తీరిక లేకుండా ఉండటంతో ఉద్యోగుల పదోన్నతులు, ఖాళీల భర్తీ ప్రక్రియ ముందుకు కదలడంలేదని ఉద్యోగ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు.
ఆరేళ్లుగా పదోన్నతుల్లేవ్..: ప్రభుత్వ టీచర్లకు చివరిసారిగా 2015 జూలైలో పదోన్నతులు ఇచ్చారు. గత ఆరేళ్లుగా పదోన్నతులు నిలిచిపోయాయి. 10,479 మంది భాషాపండితులు, వ్యాయామ టీచర్ల పోస్టులను స్కూల్ అసిస్టెంట్లుగా అప్‌గ్రేడ్ చేసినా, న్యాయపరమైన చిక్కులతో పదోన్నతులు నిలిచిపోయాయి.
ఒక్కరోజులో పదోన్నతులొచ్చేనా?
Published Mon, Aug 30 2021 1:51 AM | Last Updated on Mon, Aug 30 2021 1:51 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment