18న ఐఆర్‌ ప్రకటన! | KCR May Announce IR To Govt Employees On 18th June | Sakshi
Sakshi News home page

18న ఐఆర్‌ ప్రకటన!

Published Sun, Jun 16 2019 1:35 AM | Last Updated on Sun, Jun 16 2019 5:28 AM

KCR May Announce IR To Govt Employees On 18th June - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మధ్యంతర భృతి (ఐఆర్‌)ని ప్రకటించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. మధ్యంతర భృతి చెల్లింపునకు ఉన్న సాధ్యాసాధ్యాలపై అధ్యయనం జరుపుతోంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ఈ నెల 18న మంగళవారం మధ్యాహ్నం జరగనున్న కేబినెట్‌ భేటీ అనంతరం ఐఆర్‌పై ప్రకటన వెలువడే అవకాశాలున్నాయి. ఉద్యోగులకు ఐఆర్‌ ప్రకటించా లా లేక ఫిట్‌మెంట్‌పై ప్రకటన చేయాలా? అనే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఐఆర్‌ చెల్లింపునకు ఉన్న సాధ్యాసాధ్యాలపై సీఎం కేసీఆర్‌ ఇటీవల రాష్ట్ర ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావుతో సమావేశమై సుదీర్ఘ కసరత్తు చేశారని సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో ఐఆర్‌ చెల్లింపునకే మొగ్గు చూపే అవకాశాలున్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, ఆర్థిక అవసరాలు, ఆదాయ వనరులను దృష్టిలో పెట్టుకొని ఎంత శాతం మేరకు ఐఆర్‌ ప్రకటించాలన్న అంశంపై కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. ఏపీలో 27శాతం ఐఆర్‌ ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్రంలో అంతకు మించి ప్రకటించవచ్చని ఉద్యోగ వర్గాలు ఆసక్తితో ఎదురుచూస్తున్నాయి.

వాస్తవానికి 2018 జూన్‌ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఐఆర్‌ ప్రకటిస్తామని అప్పట్లో ప్రభుత్వం పేర్కొంది. దీనికి సరిగ్గా ఒకరోజు ముందు అంటే 2018 జూన్‌ 1న ఐఆర్‌ ప్రకటనను వాయిదా వేయాలని నిర్ణయించింది. వేతన సవరణ సంఘం (పీఆర్సీ) చైర్మన్, సభ్యులతో సీఎం కేసీఆర్‌ సమీక్షించి ఈ నిర్ణయం తీసుకున్నారు. పీఆర్సీ నివేదిక సమర్పించడానికి ముందే ఐఆర్‌ ప్రకటించడం సరికాదనే అభిప్రాయం రావడంతో సీఎం వెనక్కి తగ్గారు. ఉద్యోగులకు ఐఆర్‌ చెల్లించడానికి వీలుగా వెంటనే నివేదిక సమర్పించాలని అప్పట్లో పీఆర్సీ చైర్మన్, సభ్యులను సీఎం ఆదేశించారు. ఉద్యోగులకు ఒక శాతం ఐఆర్‌ చెల్లిస్తే ఏడాదికి రూ. 300 కోట్లు, 10 శాతం ఇస్తే రూ. 3,000 కోట్లు, 20 శాతం ఇస్తే రూ.6,000 కోట్ల వ్యయం కానుందని అప్పట్లో ఆర్థికశాఖ అధికారులు సీఎంకు నివేదించారు. ఈ లెక్కన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సైతం 27శాతం ఐఆర్‌ ప్రకటిస్తే ఏటా ప్రభుత్వంపై రూ. 8,100 కోట్ల భారం పడే అవకాశాలున్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా ఉందని, ఆదాయం సమృద్ధిగా పెరుగుతోందని రాష్ట్ర ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు ఇటీవల సచివాలయంలో మీడియాకు తెలిపారు. దీంతో ఐఆర్‌ ప్రకటన రావచ్చని ఉద్యోగ సంఘాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. 

పీఆర్సీ నివేదిక ఆలస్యం? 
రిటైర్డ్‌ ఐఏఎస్‌ సీఆర్‌ బిస్వాల్‌ నేతృత్వంలో మహమ్మద్‌ అలీ రఫత్, ఉమామహేశ్వర్‌రావుతో 2018 మే 18న ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర తొలి పే రివిజన్‌ కమిషన్‌ (పీఆర్సీ) ఏర్పాటు చేసింది. 3 నెలల్లోగా నివేదిక సమర్పించాలని అప్పట్లో ప్రభుత్వం ఆదేశించినప్పటికీ ఇప్పటివరకు నివేదిక సమర్పించలేదు. 9 నెలలుగా రాష్ట్రంలో వరుస ఎన్నికలు జరగడంతో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అమలు చేయాల్సి వచ్చింది. దీంతో ఐఆర్, వేతన సవరణ అంశాలు మరుగునపడ్డాయి. దీంతో పీఆర్సీ కమిటీ కాలపరిమితిని ప్రభుత్వం వరుసగా పొడిగించాల్సి వచ్చింది. ఎన్నికలన్నీ ముగియడంతో ప్రభుత్వం మళ్లీ పీఆర్సీ నివేదికపై దృష్టి సారించే అవకాశాలున్నాయి. పీఆర్సీ నివేదిక ఆలస్యం కావడంతో ప్రస్తుతానికి ప్రభుత్వం ఐఆర్‌ చెల్లింపునకు మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది. 2018 జూలై 1 నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పీఆర్సీ అమలు కావాల్సి ఉంది. తక్షణమే 43 శాతం ఐఆర్‌ ప్రకటించి గత జూలై నుంచి రావాల్సిన బకాయిలతో సహా చెల్లించాలని తెలంగాణ ఉద్యోగులు, గెజిటెడ్‌ అధికారులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, వర్కర్ల జేఏసీ తాజాగా డిమాండ్‌ చేసింది. 

పరిశీలనలో రిటైర్మెంట్‌ వయసు పెంపు! 
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీవిరమణ వయసును 58 ఏళ్ల నుంచి 61 ఏళ్లకు పొడిగిస్తామని గత డిసెంబర్‌లో జరిగిన రాష్ట్ర శాసనసభ మధ్యంతర ఎన్నికల సందర్భంగా అధికార టీఆర్‌ఎస్‌ హామీ ఇచ్చింది. ఈ నెల 18న జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ భేటీలో రిటైర్మెంట్‌ వయసు పెంపు ప్రతిపాదనపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశముంది. సీపీఎస్‌ రద్దు చేయాలని ఇటీవల ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో రాష్ట్రంలో సైతం సీపీఎస్‌ రద్దు అంశాన్ని కేబినెట్‌ భేటీలో పరిశీలించవచ్చని ఉద్యోగ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement