ఏ జన్మ సంబంధమో.. | People Helping Railway police For Orphaned bodies Funerals | Sakshi
Sakshi News home page

ఏ జన్మ సంబంధమో..

Published Mon, Feb 7 2022 5:24 AM | Last Updated on Mon, Feb 7 2022 9:48 AM

People Helping Railway police For Orphaned bodies Funerals - Sakshi

మృతదేహాన్ని మోసుకెళ్తున్న తోటీలు

వారి సావాసం శవాలతో.. వారి సంపాదన అంత్యక్రియలతో.. వారి నిత్య సంభాషణ ముడిపడేది చావుతో.. రైలు పట్టాల నుంచి రుద్రభూమి వరకు వారే. ఆఖరి దశ నుంచి అంత్యక్రియల వరకు వారే. రైలు తాకిడికి ఖండితమైపోయిన దేహాలకు, లోకం కంట పడకుండా పాడైపోయిన శరీరాలకు దిక్కూమొక్కూ వారే. ఎప్పటి రుణానుబంధమో అనాథ మృతదేహాలకు అన్నీ తామే అయ్యి సద్గతులు అందిస్తున్నారు వారు. ఏ జన్మ సంబంధమో వందలాది మృతదేహాలకు అంత్యక్రియలు చేస్తున్నారు. ఈ పని చేసే వారిని ‘తోటి’ అని పిలుస్తారు. కోటికొకరు ఎన్నుకునే ఈ వృత్తిలో జిల్లా వారూ ఉన్నారు. 

జలుమూరు: రైలు కింద పడి ఒకరు మృతి చెందారు.. తోటీ రావాలి. రైలు ప్రమాదంలో ఒకరి మృతదేహం దొరికింది.. తోటీ రావాలి. ఒకరి శవం గుర్తు పట్టలేని స్థితిలో ఉంది.. తోటీని పిలవాలి. ముక్కలైపోయిన శరీరమొకటి పట్టాల పక్కన ఉంది...తోటీ రావాల్సిందే. శవం అన్న పేరు వినడానికి చాలా మంది భయపడతారు. అనడానికి కూడా ఆందోళన చెందుతారు. చూసేందుకు జంకుతారు. కానీ ఈ తోటీల బతుకంతా శవాలతోనే. జీతమెంత తీసుకుంటారో గానీ ఈ సత్కార్యాలు చేసి బోలెడంత పుణ్యంతో పాటు వారి కుటుంబీకుల ఆశీస్సులు కూడా అందుకుంటున్నారు వీరు. తెలిసిన వారి దహన సంస్కారాల్లో పాల్గొనడానికి మొహమాట పడే రోజుల్లో.. నిత్యం ఏ మాత్రం పరిచయం లేని వ్యక్తుల మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహిస్తున్న గొప్ప మనుషులు వీరు. అనాథ శవాల పాలిట సంస్కార ప్రదాతలు ఈ ‘తోటీ’లు.  

పది మంది బృందం 
శ్రీకాకుళం జిల్లా తిలారు నుంచి శిర్లపాడు (ఇచ్ఛాపురం) వరకు, తిలారు నుంచి విజయనగరం వరకు పది మంది తోటీలు ఈ పని చేస్తుంటారు. స్టేషన్ల మధ్య జరిగే ప్రమాదాల సమాచారం అందుకున్న క్షణాల్లో ఇద్దరు చొప్పున అక్కడ ప్రత్యక్షమై అనాథ శవాలకు అంత్యక్రియలు నిర్వహిస్తారు. 

రైలు పట్టాల వెంబడి..  
తోటీల అవసరం ఎక్కువగా ఉండేది రైలు పట్టాల వద్దే. జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకుని మృతదేహాలుగా మారిన వారికి వీరే దిక్కు. ప్రమాదాలు జరిగిన సందర్భాల్లోనూ వీరు ఠక్కున అక్కడ ప్రత్యక్షమవుతారు. సొంత మనుషుల్లా అన్నీ దగ్గరుండి చూసుకుంటారు. మృతదేహం రక్తపు మడుగులో ఉన్నా, కుళ్లిపోయి దుర్వాసన వస్తున్నా ఏ మాత్రం జంకు, సంకోచం లేకుండా అంతిమ సంస్కారాలు జరిపిస్తారు.

వృత్తి సంతృప్తినిస్తోంది..  
15 ఏళ్లుగా ఈ వృత్తి చేస్తున్నాను. మొదటి ఏడాదిలో కొంత భయం ఉండేది. ఇప్పుడు అలవాటైపోయింది. గుర్తు తెలియని వ్యక్తుల మృతదేహాలకు దహన సంస్కారాలు చేయడం పవిత్రంగా భావిస్తాం. ఈ వృత్తి సంతృప్తినిస్తోంది. 
– రాజారావు

బంధువుల అంత్యక్రియల్లోనూ..     
అనాథ శవాలతోపాటు కొన్ని సందర్భాల్లో మా బంధువుల మృతదేహాలకు కూడా దహన సంస్కారాలు చేశాను. అలాంటి సమయాల్లోనే మద్యం అలవాటైపోయింది. తెగిపడిన మృతదేహాలను ఏరి పోగు చేసి ఒక్క చోట చేర్చడానికి ధైర్యం కావాలి. ఈ  17 ఏళ్లలో వందల శవాలకు అంతిమ సంస్కారాలు చేశాను. 
– వెంకటరావు 

వారి సేవలు వెలకట్టలేనివి.. 
తోటీల సేవలు వెలకట్టలేనివి. మేం డబ్బులు ఇచ్చినా అనాథ శవాలకు దహన సంస్కారాలు, పాతిపెట్టడం వంటివి చేయడం సాధారణ విషయం కాదు. కొన్ని సందర్భాల్లో సొంత వారు కూడా దగ్గరకు రాలేని దుస్థితి ఉంటుంది. అలాంటి సమయంలో వారు ఎంతో ధైర్యం చేసి ముందుకు వచ్చి ఆ పనులు చేస్తున్నారు. వారికి నిజంగా చేతులెక్కి మొక్కాలి 
– ఎస్‌.కె షరీఫ్, పలాస జీఆర్పీ ఎస్‌ఐ  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement