రైలు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు
బషీరాబాద్: రైల్లోంచి పడి ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన సోమవారం చోటుచేసుకుంది. రెల్వే పోలీసుల కథనం ప్రకారం.. కర్ణాటక రాష్ట్రం సేడం ప్రాంతానికి చెందిన సంతోష్ రైలులో వెళ్తుండగా బషీరాబాద్ మండల కేంద్రంలోని నవాంద్గి రైల్వే స్టేషన్ సమీపంలో కిందపడ్డాడు. ఈ ప్రమాదంలో ఆయన రెండు చేతులు విరిగిపోయాయి. స్థానికుల సమాచారంతో 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని ఆయనను తాండూరులోని జిల్లా ఆస్పత్రికి తరలించారు.
మరో సంఘటనలో.. వికారాబాద్ మండల పరిధిలోని కొత్తగడి గ్రామానికి చెందిన అనిల్(18) కుటుంబ సభ్యులతో కలిసి తాండూరుకు రైలులో వస్తున్నాడు. డోర్ పక్కన నిలబడ్డ అనిల్ రుక్మాపూర్ రైల్వే స్టేషన్ వద్ద ప్రమాదవశాత్తు రైలులోనుంచి కిందపడ్డాడు. కుటుంబీకులు గమనించి చైన్ లాగి రైలును నిలిపివేశారు. తీవ్రంగా గాయపడిన అనిల్‌ను 108లో తాండూరులోని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం క్షతగాత్రులిద్దరిని హైదరాబాద్‌కు రిఫర్ చేసినట్లు డాక్టర్లు తెలిపారు.