భువనేశ్వర్/న్యూఢిల్లీ: ఒడిశాలో ఘోర రైలు ప్రమాద ఘటనలో ఘటనాస్థలి నుంచి స్వాధీనం చేసుకున్న దాదాపు 40 మృతదేహాలపై ఎలాంటి గాయాలు లేవని తెలుస్తోంది. దుర్ఘటన తాలూకు కొత్త విషయం ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. సంబంధిత వివరాలను గవర్నమెంట్ రైల్వే పోలీస్(జీఆర్‌పీ) మంగళవారం వెల్లడించింది.
‘ప్రమాదం జరిగినపుడు చెల్లాచెదురుగా పడిన బోగీలు పై నుంచి వెళ్తున్న ఓవర్‌హెడ్ లోటెన్షన్(ఎల్‌టీ) విద్యుత్ తీగలకు తగిలాయి. దీంతో విద్యుత్ తీగలు తెగి కొన్ని బోగీలపై పడ్డాయి. అప్పటికే ధ్వంసమైన బోగీల్లో చిక్కుకున్న ప్రయాణికులు ఈ విద్యుదాఘాతంతో ప్రాణాలు కోల్పోయి ఉంటారు. అందుకే దాదాపు 40 మృతదేహాలపై ఎలాంటి గాయాలు లేవు’ అని ఎఫ్‌ఐఆర్‌లో నమోదుచేసినట్లు సబ్ ఇన్‌స్పెక్టర్ పి.కుమార్ నాయర్ చెప్పారు.
మార్చురీలో వందకుపైగా మృతదేహాలు
రైలు ప్రమాదంలో 278 మంది మరణించగా 177 మంది ప్రయాణికుల మృతదేహాలను వారి బంధువులు గుర్తుపట్టారు. దాంతో ఈ మృతదేహాల అప్పగింత ప్రక్రియ పూర్తయింది. తలలు తెగి, ప్రమాదంలో నుజ్జునుజ్జయి అసలు గుర్తుపట్టలేనంతగా ఛిద్రమైన మృతదేహాలను.. తమ వారి ఆచూకీ కోసం మార్చురీకి వచ్చిన వారూ గుర్తించలేకపోతున్నారు. ఘటన జరిగిన తర్వాత మృతదేహాలు రెండు మూడు చోట్లకు సరిగా ప్యాక్‌చేయకుండానే తరలించిన కారణంగా కొంతమేర కుళ్లి దుర్వాసన వస్తున్నాయి.
సీబీఐ దర్యాప్తు షురూ
ప్రమాదంపై సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది. ఈ దుర్ఘటన వెనుక కుట్ర కోణం ఉందంటూ అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో రైల్వే శాఖ, ఒడిశా రాష్ట్ర ప్రభుత్వ ఫిర్యాదు మేరకు సీబీఐ అధికారులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అధికారులు, ఫోరెన్సిక్ నిపుణులు మంగళవారం బాలాసోర్ జిల్లాకు చేరుకున్నారు. బాలాసోర్ రైల్వే పోలీసులు రైల్వే చట్టంలోని ఈ నెల 3న వివిధ సెక్షన్ల కింద నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను సీబీఐ అధికారులు స్వీకరించారు.
స్థానిక పోలీసులు నమోదు చేసి కేసును దర్యాప్తు ప్రక్రియలో భాగంగా మళ్లీ రిజిస్టర్ చేసి, దాన్ని సొంత ఎఫ్‌ఐఆర్‌గా నమోదు చేశారు. అనంతరం దర్యాప్తు మొదలుపెట్టారు. ఎల్రక్టానిక్ ఇంటర్‌లాకింగ్ వ్యవస్థలో మార్పులు చేయడం వల్లే రైలు ప్రమాదం చోటుచేసుకున్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందని రైల్వేశాఖ వెల్లడించిన సంగతి తెలిసిందే. సమగ్ర దర్యాప్తు కోసం ఈ కేసును సీబీఐకి అప్పగించాలని రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది.
రైల్వే శాఖ కార్యకలాపాలపై తమకు కొంత పరిజ్ఞానం ఉందని సీబీఐ అధికారి ఒకరు చెప్పారు. కేసు దర్యాప్తులో భాగంగా రైలు సెక్యూరిటీ సిబ్బంది, ఫోరెన్సిక్ నిపుణుల సాయం కూడా తీసుకుంటామని తెలిపారు. జాయింట్ డైరెక్టర్ (స్పెషల్ క్రైమ్) విప్లవ్‌కుమార్ చౌదరి నేతృత్వంలో ఆరుగురు సభ్యుల సీబీఐ బృందం మంగళవారం మధ్యాహ్నం బహనాగ బజార్ రైల్వేస్టేషన్ సమీపంలోని ఘటనా స్థలానికి చేరుకుంది. ఘటనాస్థలి, సిగ్నల్ గదిని క్షుణ్నంగా పరిశీలించింది. అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్, సిబ్బందిని ప్రశ్నించనుంది.
Comments
Please login to add a commentAdd a comment