‘‘సాయికృష్ణ బతికున్నాడా? చనిపోయాడా? అనేది చెప్పాలి’’ | Perni nani Demand for Clarity on Sai Krishnas Fate | Sakshi
Sakshi News home page

‘‘సాయికృష్ణ బతికున్నాడా? చనిపోయాడా? అనేది చెప్పాలి’’

Jun 20 2026 3:45 PM | Updated on Jun 20 2026 4:07 PM

Perni nani Demand for Clarity on Sai Krishnas Fate

తాడేపల్లి: ‘‘సాయికృష్ణ బతికున్నాడా? చనిపోయాడా? అనేది చెప్పాలి’’ అని మాజీ మంత్రి పేర్ని నాని డిమాండ్‌ చేశారు. శనివారం తాడేపల్లిలో పేర్ని నాని మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సాయికృష్ణ అదృశ్యంపై తల్లి ఫిర్యాదు చేస్తే ఎవరూ పట్టించుకోలేదని అన్నారు. 40 రోజుల తర్వాత చంద్రబాబు ఈ ఘటనపై స్పందించారని తెలిపారు.

మరోవైపు, క్రాంతికుమార్ గుళికలు మింగి ఆత్మహత్య చేసుకున్నాడని, అతని కేసులో అనేక అనుమానాలు ఉన్నాయని పేర్ని నాని చెప్పారు. ‘‘సాయికృష్ణ కేసును నీరుగార్చాలని చూస్తున్నారు. సాయికృష్ణ కేసు చంద్రబాబు పీకల మీదకు రావడంతో అతని తల్లిని పిలిపించుకుని మాట్లాడారు. మరి క్రాంతికుమార్ కుటుంబాన్ని ఎందుకు పిలిపించలేదు? ఎస్సీ కులస్తుడైన క్రాంతికుమార్ కుటుంబానికి ఓదార్పు అవసరం లేదా?’’ అని నిలదీశారు.

కేసు రీఓపెన్ ఎందుకు చేయలేదు? 
క్రాంతికుమార్ వీడియో బయటకు వచ్చాక కేసు రీఓపెన్ ఎందుకు చేయలేదని పేర్ని నాని ప్రశ్నించారు. ‘‘సాయికృష్ణ మిస్సింగ్ పై 40 రోజుల క్రితమే న్యాయవాది కనకదుర్గ ఫిర్యాదు చేసినా సీపీ ఎందుకు స్పందించలేదు? సీపీ రాజశేఖర్ ఆధ్వర్యంలోనే టాస్క్‌ఫోర్స్ పని చేస్తుంది. అలాంటి టాస్క్‌ఫోర్స్ అధికారులే వెళ్లి సాయికృష్ణను పట్టుకువచ్చారు. 

ఆ తర్వాత ఏం జరిగిందో ఎందుకు బయట పెట్టటం లేదు? సీఐ నాగరాజు క్రైం విచారణలో ఆరితేరిన అధికారి. అలాంటి వ్యక్తి సాయికృష్ణను కృష్ణలంక శ్మశాన వాటికలోనే ఎందుకు దహనం చేయిస్తారు? విచారణ అధికారులు కేవలం అదే శ్మశాన వాటికకే ఎలా వెళ్లారు? అక్కడ ఏమైనా అధారాలు దొరికాయా? సీపీ రాజశేఖర్ బాబుకు తెలియకుండానే ఇదంతా జరిగిందా? విచారణాధికారి డీఎన్ కిషోర్ తన పైస్థాయి అధికారులను విచారించగలరా?  సీఐ నాగరాజుపై కేసు నమోదు చేసి 48 గంటలయినా అతన్ని ఎందుకు అరెస్టు చేయలేదు?

సాయికృష్ణ కేసులో ప్రజల్లో ఎన్నో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ముద్దాయిగా ఉన్న సీఐ నాగరాజును ఎందుకు విచారించరు? కేసులో సీపీ పాత్ర ఉందని అందరిలోనూ అనుమానాలు ఉన్నాయి. విజయవాడ సీపీ నాయకత్వంలోనే ఇవన్నీ జరుగుతున్నాయి. సీపీ చేతుల్లో ఉన్న టాస్క్‌ఫోర్స్‌ అధికారులను ఎలా విచారణ చేస్తారు?’’ అని ప్రశ్నించారు. 

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement