
సాక్షి, కృష్ణాజిల్లా: జగ్గయ్యపేట మండలం తక్కెళ్ళపాడులో ఈనెల 21న సమగ్ర భూ సర్వే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించనున్నట్లు రాష్ట్ర రవాణా, సమాచారశాఖ మంత్రి పేర్నినాని తెలిపారు. మంగళవారం సీఎం పర్యటన ఏర్పాట్లను సీఎం ప్రోగ్రాం కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను, జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, జేసీ మాధవిలత, జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబుతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి నాని మీడియాతో మాట్లాడుతూ.. రైతులు ఎదుర్కొంటున్న భూ వివాదాల శాశ్వత పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర భూ సర్వే చేపడుతోంది. బ్రిటిష్ కాలంలో ఉన్న సర్వేలతోనే నేటి వరకు రికార్డులు ఉన్నాయి. రైతుల మధ్య సరిహద్దు గొడవలు ఉండటం, కోర్టులు చుట్టూ తిరిగి సమయం వృధా, ధనం వృధా అవుతోంది. వీటి శాశ్వత పరిష్కారం కోసం అత్యాధునిక పరికరాలతో శాటిలైట్ ద్వారా ఈ సర్వే ప్రక్రియకు శ్రీకారం చుట్టబోతున్నాము. వివాదాలు లేకుండా చేసి ఆస్తిపై యజమానులకు హక్కు కల్పించే దిశగా ఈ సర్వే జరుగుతుంది' అని మంత్రి నాని వెల్లడించారు.
ప్రభుత్వవిప్ ఉదయభాను మాట్లాడుతూ.. ప్రతి రైతుకు భూమిపై హక్కు కల్పించే విధంగా సమగ్ర భూ సర్వే చేపట్టేందుకు సీఎం నిర్ణయించారు. ప్రతీ ఇంటిని కూడా సర్వే నిర్వహించి శాశ్వత హక్కు కల్పించే విధంగా కార్డులు జారీ చేయడం జరుగుతుంది' అని ఉదయభాను తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment