
హైకోర్టులో మాజీ మంత్రి అంబటి రాంబాబు పిటిషన్
సాక్షి, అమరావతి: తనకు ప్రాణహాని ఉందని.. కాబట్టి తనకు భద్రతను పునరుద్ధరించేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత అంబటి రాంబాబు హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఇప్పటివరకు తనకున్న 4+4 గన్‌మెన్ల భద్రతను ఉపసంహరించడాన్ని సవాల్ చేస్తూ ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనకున్న ప్రాణహాని దృష్ట్యా ఈ వ్యాజ్యం తేలేంతవరకు తనకు 4+4 భద్రతను కొనసాగించేలా ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోర్టును కోరారు.
ఈ వ్యాజ్యంపై గురువారం న్యాయమూర్తి జస్టిస్ బొప్పన వరాహ లక్ష్మీనరసింహ చక్రవర్తి విచారణ జరిపారు. అంబటి తరఫున న్యాయవాది చింతల సుమన్ వాదనలు వినిపిస్తూ.. భద్రతను కొనసాగించాలని పల్నాడు ఎస్పీ, డీజీపీకి వినతిపత్రాలు సమర్పించామని, అయినా ప్రయోజనం లేదన్నారు. పిటిషనర్‌కు ప్రాణహాని ఉందని, అందువల్ల భద్రతను పునరుద్ధరించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ అంబటి రాంబాబు ప్రస్తుతం ఎక్కడ నివసిస్తున్నారని ప్రశ్నించారు.
గుంటూరులో ఉంటున్నారని సుమన్ సమాధానం ఇవ్వగా, మరి పల్నాడు ఎస్పీకి వినతి పత్రం ఇవ్వడం వల్ల ప్రయోజనం ఏముంటుందన్నారు. పిటిషనర్ ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం పల్నాడు జిల్లా పరిధిలో ఉందని, అందువల్ల ఆ జిల్లా ఎస్పీకి వినతి పత్రం ఇచ్చామని సుమన్ తెలిపారు. ఇది పూర్తిగా సాంకేతికపరమైన అంశమని సుమన్ తెలిపారు.
ప్రభుత్వ న్యాయవాది (జీపీ) కె.మురళీకృష్ణారెడ్డి జోక్యం చేసుకుంటూ.. ఇది తాజా వ్యాజ్యమని, గడువునిస్తే పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామన్నారు. ప్రాణహాని దృష్ట్యా ఈలోపు భద్రతను పునరుద్ధరించేలా ఆదేశాలు ఇవ్వాలని సుమన్ కోరారు. ఈ వ్యాజ్యానికి సంబంధించి పూర్తి వివరాలను తమ ముందుంచాలని ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశించారు. తదుపరి విచారణను ఈ నెల 10కి వాయిదా వేశారు.