సాక్షి, అమరావతి: చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తేనాపల్లి, పేట అగ్రహారం గ్రామాల పరిధిలో పరిశోధనాభివృద్ధి కేంద్రం(ఆర్ అండ్ డీ) ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రభుత్వం నుంచి 2011లో 28 ఎకరాల భూమి తీసుకున్న టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కుటుంబానికి చెందిన గల్లా ఫుడ్స్ ఇప్పటి వరకు ఎలాంటి పనులు మొదలు పెట్టకపోవడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఒప్పందం మేరకు ఆర్ అండ్ డీ కేంద్రం ఏర్పాటు చేయనందున ఆ ఒప్పందాన్ని రద్దు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ పూతలపట్టు మండలం నల్లగట్లపల్లికి చెందిన గాలి పురుషోత్తంనాయుడు ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం న్యాయమూర్తి జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావు విచారణ జరిపారు.
ఈ మొత్తం వ్యవహారంపై వివరణ ఇవ్వాలంటూ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి, ఏపీఐఐసీ చైర్మన్ అండ్ ఎండీ, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్, గల్లా ఫుడ్స్ లిమిటెడ్‌లకు నోటీసులిచ్చారు. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ తదుపరి విచారణను ఈ నెల 14కి వాయిదా వేశారు. అంతకు ముందు పిటిషనర్ తరఫు న్యాయవాది పి.హేమచంద్ర వాదనలు వినిపిస్తూ.. ఆర్ అండ్ డీ కేంద్రం ఏర్పాటు ఒప్పందంతో భూమి తీసుకున్న గల్లా ఫుడ్స్.. ఆ భూమిలో ఎలాంటి కేంద్రాన్నీ ఏర్పాటు చేయలేదన్నారు. ఒప్పందం ప్రకారం రెండేళ్లలో ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. ఆ భూమిని ఉపయోగించనప్పుడు తిరిగి స్వాధీనం చేయాల్సిన బాధ్యత గల్లా ఫుడ్స్‌పై ఉందన్నారు. అయితే ఇప్పటి వరకూ భూమి స్వాధీనానికి అటు గల్లా ఫుడ్స్ గానీ, ఇటు ఏపీఐఐసీ అధికారులు గానీ ఎలాంటి చర్యలూ తీసుకోలేదని హేమచంద్ర వివరించారు.
చదవండి:
ఏపీ: సర్కారు ఆస్పత్రులకు ఆరోగ్యశ్రీ నిధులు రెట్టింపు
6న అల్పపీడనం.. ఏపీలో భారీ వర్షాలు
Comments
Please login to add a commentAdd a comment