volunteers: మాకు న్యాయం చేయండి | Petitions for volunteers in government offices | Sakshi
Sakshi News home page

మాకు న్యాయం చేయండి.. హామీ నెరవేర్చాలంటున్న వలంటీర్లు

Published Tue, Jul 30 2024 4:40 AM | Last Updated on Tue, Jul 30 2024 9:17 AM

Petitions for volunteers in government offices

మాకు న్యాయం చేయండి 

రాష్ట్ర వ్యాప్తంగా పలు కలెక్టరేట్లు, ప్రభుత్వ కార్యాలయాల్లో వలంటీర్ల వినతిపత్రాలు

టీడీపీ ఎన్నికల హామీలను నిలబెట్టుకోవాలి 

రూ. 10 వేలు గౌరవ వేతనం ఇవ్వాలి.. ఉద్యోగ భద్రత కల్పించాలి.. వేతన బకాయిలు వెంటనే చెల్లించాలి

సాక్షి, అమరావతి/మహారాణిపేట(విశాఖ): వలంటీర్లకు జూన్‌ నెల గౌరవ వేతన బకాయిలను వెంటనే చెల్లించడంతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం తమకు ఉద్యోగ భద్రత కల్పించాలంటూ సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా వలంటీర్లు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు వలంటీర్ల ప్రతినిధులు జిల్లా కలెకరేట్లతో పాటు వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదికల్లో వినతిపత్రాలు సమర్పించారు. ఆయా వీడియోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు.

 తాము అధికారంలోకి వస్తే వలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని, వారి గౌరవ వేతనాన్ని రూ. 5 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతామని ఎన్నికల ముందు చంద్రబాబు బహిరంగ సభలలో చెప్పడంతో పాటు మేనిఫెస్టోలో హామీ ఇచి్చన విషయం తెలిసిందే. అయితే, ప్రతి నెలా ఇచ్చే సామాజిక పింఛన్లను.. 2019 ఆగస్టులో వలంటీర్ల వ్యవస్థ ఏర్పాటైనప్పటి నుంచి వారే క్షేత్రస్థాయిలో సమర్థంగా పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం మొదటిసారి ఇచి్చన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో వలంటీర్లను దూరంగా పెట్టి, గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా నిర్వహించారు. 

ఆగస్టు ఒకటో తేదీ నుంచి మొదలయ్యే పింఛన్ల పంపిణీ కూడా వలంటీర్లతో సంబంధం లేకుండా సచివాలయాల ఉద్యోగుల ద్వారా పంపిణీ చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా లక్షన్నర మంది వలంటీర్లు విధుల్లో కొనసాగుతుండగా, వారిలో దాదాపు 75 శాతం మందికి జూన్‌ నెల గౌరవ వేతనం ఇప్పటి వరకూ కూడా అందలేదని వలంటీర్ల సంఘాల ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రూ. 10 వేలు వేతనం ఇవ్వాలి 
కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం నెలకు రూ. 10 వేల గౌరవ వేతనం ఇవ్వాలని, ఇతర సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వలంటీర్లు సోమవారం విశాఖ కలెక్టరేట్‌ ఎదుట నిరసన ప్రదర్శన చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆం«ధ్రప్రదేశ్‌ వలంటీర్లు సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు జగదీష్, కార్యదర్శి సంపత్‌ మాట్లాడుతూ.. ఉద్యోగ భద్రత కల్పిస్తామని ఇచ్చిన వాగ్దానాన్ని తక్షణమే అమలు చేయాలని, పెండింగ్‌లో ఉన్న వేతన బకాయిలు వెంటనే ఇవ్వాలని కోరారు.

 

 

VIDEO and Photo Credits: 𝚅𝙾𝙻𝚄𝙽𝚃𝙴𝙴𝚁 𝙲𝙾𝙽𝙽𝙴𝙲𝚃𝙸𝙾𝙽

వలంటీర్ల వ్యవస్థను రద్దు చేయండి 
సాక్షి, అమరావతి: టీడీపీ నుంచి రెండు సార్లు ఎమ్మెల్సీగా పనిచేసిన వైవీబీ రాజేంద్రప్రసాద్‌ అధ్యక్షుడిగా పనిచేస్తున్న ఏపీ పంచాయతీరాజ్‌ చాంబర్‌ సోమవారం గ్రామ, వార్డు వలంటీర్ల వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్‌ చేసింది. చాంబర్‌ రాష్ట్ర కమిటీ సోమవారం విజయవాడలో సమావేశమై ఈ మేరకు ఏకగ్రీవంగా తీర్మానం చేసింది.  సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ,ఎంపీపీ, జిల్లా పరిషత్‌ చైర్మన్, కౌన్సిలర్, కార్పొరేటర్, చైర్మన్, మేయర్ల ఒక నెల గౌరవ వేతనాన్ని అమరావతి అభివృద్ధికి విరాళంగా ఇవ్వాలని తీర్మానించారు. పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పవన్‌ కల్యాణ్‌ను కలిసి తమ సంఘం 16 డిమాండ్ల వినతిపత్రం ఇచ్చి, చర్చించి ఆయా డిమాండ్లను పరిష్కరించ వలసిందిగా కోరాలని తీర్మానించారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ఏడాదిలో ఒకరోజు తిరుమల శ్రీవారి దర్శనానికి అవకాశం కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ మరో తీర్మానం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement