విశాఖలో పెట్రో కొరత! | Petrol Diesel Shortage In Visakhapatnam | Sakshi
Sakshi News home page

విశాఖలో పెట్రో కొరత!

Published Sat, Jun 18 2022 11:46 PM | Last Updated on Sat, Jun 18 2022 11:46 PM

Petrol Diesel Shortage In Visakhapatnam - Sakshi

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఉత్తరాంధ్ర జిల్లాలో పెట్రోల్, డీజిల్‌ కొరత వేధిస్తోంది. గత కొద్దికాలంలో డిమాండ్‌కు తగిన స్థాయిలో ఆయిల్‌ కంపెనీల నుంచి డీలర్లకు సరఫరా కావడం లేదు. ఫలితంగా రోజులో కొద్ది సమయం పాటు కొన్ని పెట్రోలు బంకుల యాజమాన్యాలు షాపులను మూసివేస్తున్నాయి. ప్రధానంగా గత నెలలో హిందుస్తాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (హెచ్‌పీసీఎల్‌) రిఫైనరీలో ఏర్పడిన సాంకేతిక సమస్యలతో ఉత్పత్తి నిలిచి పోవడంతోనే సమస్య ప్రారంభమయ్యిందని తెలుస్తోంది.

ప్రస్తుతం రిఫైనరీలో కాస్తా ఉత్పత్తి యథావిధిగా ఇబ్బందులు లేకుండా సాగుతోంది. అయినప్పటికీ గత కొద్దికా లంగా ఏర్పడిన ఉత్పత్తి కొరతను తీర్చుకునేందుకు అనుగుణంగా బీపీసీఎల్, ఐవోసీలకు కోటా విధానాన్ని అమలు చేస్తున్నట్టు సమాచారం. డిసెంబర్‌ వినియోగం ఆధారంగా కోటాను ఇవ్వడంతో పాటు బల్క్‌ వినియోగదారులకు ఆయిల్‌ అమ్మకాలను నిలిపి వేసినట్టు తెలుస్తోంది.

మొత్తం ఉత్తరాంధ్రలోని ఆరు జిల్లాల్లో 260కి పైగా బంకుల్లో పెట్రోల్, డీజిల్‌ రోజువారీ వినియోగం సగటున రోజువారీగా 17 లక్షల లీటర్ల నుంచి 18 లక్షల లీటర్లు ఉంటుందని అంచనా. అయితే, రోజువారీగా సరఫరా మాత్రం 16 లక్షల లీటర్ల నుంచి 17 లక్షల లీటర్ల మేర ఉంటుందని పెట్రోల్‌ డీలర్లు చెబుతున్నారు. బల్క్‌ వినియోగదారులకు సరఫరా నిలిచిపోవడంతో పాటు బల్క్‌ ధర కంటే రిటైల్‌ ధరనే తక్కువగా ఉండటంతో కొద్ది మంది బల్క్‌ వినియోగదారులు కాస్తా రిటైల్‌గా కొనుగోలు చేస్తున్నారు.

ఒకవైపు సరఫరా కాస్తా తగ్గిపోవడంతో పాటు బల్క్‌ వినియోగదారులు రిటైల్‌గా కొనుగోలు చేయడంతో బంకులకు సరఫరా అయిన ఆయిల్‌ నిల్వలు కాస్తా వెంటనే అయిపోతున్నాయి. ఫలితంగా కొన్ని పెట్రోల్‌ బంకుల యాజమాన్యాలు తిరిగి ఆయిల్‌ సరఫరా అయ్యే వరకు బంకులను మూసేసుకుంటున్న పరిస్థితి ఏర్పడుతోంది. అయితే, క్రమంగా పరిస్థితి మెరుగుపడుతోందని, కొద్దిరోజుల్లోనే ఇబ్బందులు లేకుండా సరఫరా జరుగుతుందని ఆయిల్‌ కంపెనీలు చెబుతున్నాయి.

బల్క్‌ వినియోగదారులూ రిటైల్‌ గానే...! 
వాస్తవానికి ఉత్తరాంధ్ర జిల్లాలో ప్రధానంగా బల్క్‌ వినియోగదారులందరూ ఐవోసీ నుంచి ఆయిల్‌ కొనుగోలు చేస్తున్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో హెచ్‌పీసీఎల్‌కు మాత్రమే రిఫైనరీ ఉంది. ఫలితంగా అటు బీపీసీఎల్‌ కానీ ఇటు ఐవోసీ కానీ హెచ్‌పీసీఎల్‌ నుంచి మాత్రమే ఆయిల్‌ను తీసుకోవాల్సి ఉంటుంది. మరోవైపు బల్క్‌ ధర కంటే రిటైల్‌ ధరనే చౌక. దీంతో డీలర్లు కాస్తా బల్క్‌ వినియోగదారులకు విక్రయించేందుకు ఆసక్తి చూపుతున్నారు.

ఈ నేపథ్యంలో బల్క్‌ వినియోగదారులకు ఆయిల్‌ను సరఫరా చేయవద్దనే షరతును కేంద్ర పెట్రోలియం మంత్రిత్వశాఖ విధించినట్టు తెలుస్తోంది. ఫలితంగా బల్క్‌ వినియోగదారులకు కాస్తా ఆయిల్‌ సరఫరా కావడం లేదని సమాచారం. ఈ నేపథ్యంలో బల్క్‌ వినియోగదారులు కూడా రిటైల్‌గా వచ్చి ఆయిల్‌ను కొనుగోలు చేస్తున్నారు.

దీంతో సరఫరా అయిన పెట్రోల్, డీజిల్‌ కాస్తా బంకులల్లో ఖాళీ అవుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఆయిల్‌ సరఫరా చేసేందుకు కోసం ఆయిల్‌ కంపెనీలకు పలువురు డీలర్లు అడ్వాన్స్‌లను చెల్లించడం పరిపాటి. అయితే, గత కొద్దికాలంగా అడ్వాన్స్‌లను చెల్లించాల్సిన అవసరం లేదని కూడా ఆయిల్‌ కంపెనీలు తేల్చిచెప్పినట్టు సమాచారం.

డిసెంబర్‌ కోటాను బట్టే...! 
విశాఖ తీరంలో హెచ్‌పీసీఎల్‌కు రిఫైనరీ ఉంది. ఈ రిఫైనరీ విస్తరణ పనులు కూడా జరుగుతున్నాయి. ఈ రిఫైనరీ సామర్థ్యాన్ని ఏకంగా 15 ఎంఎంపీటీఏలకు పెంచాలని సంస్థ నిర్ణయించింది. ఈ రిఫైనరీ నుంచే హెచ్‌పీసీఎల్‌ బంకులతో పాటు బీపీసీఎల్, ఐవోసీ బంకులకు కూడా ఆయిల్‌ సరఫరా అవుతుంది. గత నెలలో హెచ్‌పీసీఎల్‌ రిఫైనరీలో ఉత్పత్తికి ఆటంకం ఏర్పడినట్టు తెలుస్తోంది.

ఫలితంగా ఆయిల్‌ సరఫరాలో గత కొద్దికాలంగా ఇబ్బందులు తలెత్తినట్టు తెలుస్తోంది. అయితే, ప్రస్తుతం రిఫైనరీలో ఉత్పత్తి ప్రారంభమయ్యింది. అయినప్పటికీ కొద్దికాలం పాటు సరఫరాలో ఇబ్బందులు లేకుండా చేసేందుకుగానూ డిసెంబర్‌ కోటాకు అనుగుణంగా సరఫరా చేస్తామని ఆయిల్‌ కంపెనీలు చెబుతున్నట్టు సమాచారం. ఇది కూడా బంకు యాజమాన్యాలకు ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. ఫలితంగా తమ వద్ద ఉన్న పెట్రోల్, డీజిల్‌ అయిపోయిన తర్వాత కొన్ని పెట్రోల్‌ బంకులు మూతవేసుకుంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement