ప్రశాంతంగా మాచర్ల..పోలీసుల ఆధీనంలో పట్టణం | Pinnelli Ramakrishna Reddy Comments On Chandrababu | Sakshi
Sakshi News home page

ప్రశాంతంగా మాచర్ల..పోలీసుల ఆధీనంలో పట్టణం

Published Sun, Dec 18 2022 4:17 AM | Last Updated on Sun, Dec 18 2022 7:41 AM

Pinnelli Ramakrishna Reddy Comments On Chandrababu - Sakshi

నిర్మానుష్యంగా ఉన్న మాచర్ల ఆర్టీసీ బస్టాండ్‌

సాక్షి, నరసరావుపేట, మాచర్ల, మాచర్ల రూరల్‌: టీడీపీ రౌడీ మూకల స్వైర విహారంతో శుక్రవారం రాత్రి అట్టుడికిన మాచర్ల పట్టణంలో శనివారం ప్రశాంత వాతావరణం నెలకొంది. శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి పట్టణాన్ని పోలీసులు తమ ఆధీనంలో తీసుకున్నారు. పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్‌రెడ్డి ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. ఎక్కడికక్కడ చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేసి, తనిఖీలు నిర్వహించారు. 144 సెక్షన్‌ అమలులో ఉన్నందున విద్యా సంస్థలు, వ్యాపార సముదాయాలు తెరవలేదు.

సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఎదురవ్వకుండా చూశారు. ఇరు వర్గాల నేతల ఇళ్లు, కార్యాలయాలు, వ్యాపార కేంద్రాల వద్ద బందోబస్తు నిర్వహించారు. శుక్రవారం రాత్రి జరిగిన దాడికి సంబంధించి వీడియో ఫుటేజీల ఆధారంగా కేసులు నమోదు చేశారు. నిందితులను అరెస్ట్‌ చేయడానికి సిద్ధమవుతున్నారు. గుంటూరు రేంజ్‌ డీఐజీ త్రివిక్రమ వర్మ శనివారం మాచర్ల పట్టణంలో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. ఎవర్నీ ఉపేక్షించవద్దని ఎస్పీ రవిశంకర్‌రెడ్డికి ఆదేశాలు జారీ చేశారు.

బ్రహ్మారెడ్డి వెళ్లిపోయుంటే గొడవకు తావులేదు
మాచర్లలో ఉద్రిక్తత సద్దుమణిగిందని, శాంతిభద్రతలు తమ ఆధీనంలోనే ఉన్నాయని పల్నాడు జిల్లా ఎస్పీ వై రవిశంకర్‌రెడ్డి తెలిపారు. శనివారం ఆయన మాచర్ల రూరల్‌ సర్కిల్‌ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. వెల్దుర్తి, గుండ్లపాడు గ్రామాలకు చెందిన కొంత మంది వ్యక్తులు ర్యాలీలో పాల్గొనడం వల్లే పెద్ద ఎత్తున ఘర్షణకు కారణమైందని తెలిపారు. ఇందులో పోలీసుల వైఫల్యం ఎంతమాత్రం లేదని తెలిపారు.    

సంఘటన స్థలం నుంచి వెళ్లిపోవాలని పోలీసులు ఎంతగా చెప్పినా, జూలకంటి బ్రహ్మారెడ్డి వినిపించుకోకుండా ఉద్రిక్త పరిస్థితికి దారితీసేలా ప్రవర్తించారన్నారు. బ్రహ్మారెడ్డి కార్యాలయం, వీరి మనుషుల గృహాలు దగ్ధం కాలేదని, కేవలం ఫర్నీచర్‌కు మాత్రమే నష్టం జరిగిందని చెప్పారు. విజువల్స్‌ ద్వారా నిందితులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నామని, బాధ్యులందరిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేస్తామని చెప్పారు.

దాడుల్లో ముగ్గురు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు గాయాల­య్యాయని, వారిలో మోహన్‌ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడని తెలిపారు. శాంతి భద్రతలను పరిరక్షించేందుకు అందరూ సహకరించాలన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉక్కుపాదంతో అణిచి వేస్తామని స్పష్టం చేశారు. బంగారం, డబ్బులు పోయినట్లు తమకు ఇంత వరకు ఎవరూ ఫిర్యాదు చేయలేదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 
బందోబస్తులో పోలీసు సిబ్బంది  

అంతా చంద్రబాబు సూచన మేరకే.. 
రాష్ట్రంలో అరాచకాలు సృష్టిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పల్నాడులోనూ గొడవలు సృష్టించి హత్యలు చేయడానికి పథకం ప్రకారం కుట్రలకు తెరలేపారు. మా కుటుంబం నుంచి ఎమ్మెల్యేలుగా ఉన్న ఈ 20 ఏళ్లలో అంతా ప్రశాంతంగా ఉంది. మాచర్ల నియోజకవర్గానికి టీడీపీ ఇన్‌చార్జిగా 7హత్యలు చేసిన జూలకంటి బ్రహ్మారెడ్డిని నియమించడం ద్వా­రా పల్నాడును రావణకాష్టంగా మారుస్తున్నారు.

ఇందులో భాగంగానే శుక్రవారం నాటి ఘటన. బీసీ నాయకులపై టీడీపీ రౌడీలు ముందస్తు వ్యూహం ప్రకారం కర్రలు, రాళ్లతో దాడి చేసి గాయపరిచారు. దౌర్భాగ్య పరిస్థితి నుంచి దౌర్జన్యంగా పుంజుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు డైరెక్షన్‌లో బ్రహ్మారెడ్డి ఫ్యాక్షన్‌ కు తెరలేపారు.

గుర్తుతెలియని వ్యక్తులు చేసిన అల్లర్లను వైఎస్సార్‌సీపీపై రుద్ద­డం సమంజసం కాదు. దోషులు ఎవరన్నది తేల్చి శిక్షలు పడేలా చూడాలని జిల్లా ఎస్పీని కోరాం. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేసి బడుగు, బలహీన వర్గాలకు అండగా ఉండటమే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ ధ్యేయం. 
– మీడియాతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ విప్, మాచర్ల ఎమ్మెల్యే 

బీసీ నేతలపై దాడులు అమానుషం 
బలహీన వర్గాలకు చెందిన కార్యకర్తలు రాజకీయంగా ఎదుగుతున్న సమయంలో టీడీపీ రౌడీమూకలు మాచర్లలో శుక్రవారం దాడి చేయడంపై బీసీ సంఘాలు భగ్గుమన్నాయి. బీసీల జోలికి వస్తే సహించేది లేదని హెచ్చరించాయి. బీసీల పార్టీ అంటూ దశాబ్దాలుగా టీడీపీ మోసం చేసిందని, ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు చూసి బీసీలు వైఎస్సారీసీపీ వైపు మళ్లడంతో ఇలా దాడులకు పాల్పడుతున్నారన్నారు.

మాచర్లలో బీసీలపైన తెలుగుదేశం పార్టీ నాయకులు చేసిన దాడిని ఖండిస్తూ పిడుగురాళ్లలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ దేవళ్ల రేవతి పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement