PM SHRI-Nadu Nedu నాడు – నేడు స్ఫూర్తితో ‘పీఎం శ్రీ’ స్కూళ్లు | PM Shri Schools With Nadu Nedu inspiration | Sakshi
Sakshi News home page

PM SHRI-Nadu Nedu నాడు – నేడు స్ఫూర్తితో ‘పీఎం శ్రీ’ స్కూళ్లు

Published Thu, Sep 8 2022 5:36 AM | Last Updated on Thu, Sep 8 2022 3:09 PM

PM Shri Schools With Nadu Nedu inspiration - Sakshi

సాక్షి, అమరావతి: విద్యారంగ సంస్కరణల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మక ‘మనబడి నాడు – నేడు’ కార్యక్రమం పలు రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవగా తాజాగా కేంద్ర ప్రభుత్వానికీ స్ఫూర్తిదాయకమైంది. నాడు – నేడు తరహాలో అన్ని సదుపాయాలతో ‘పీఎం శ్రీ’ పేరిట కొత్తగా స్కూళ్లను ప్రారంభించాలని తాజాగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం గమనార్హం. మంగళవారం జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశంలో దీనికి ఆమోదం లభించింది. దేశవ్యాప్తంగా 14,500కు పైగా స్కూళ్లను ప్రారంభించనున్నారు. ప్రాజెక్టు ప్రాతిపదికన ఐదేళ్లపాటు కొనసాగనున్నాయి.

ఆహ్లాదకరంగా విద్యాభ్యాసం..
ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దేందుకు అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మనబడి నాడు – నేడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. పాఠశాలల్లో పూర్తి మౌలిక సదుపాయాలను సమకూర్చడమే కాకుండా ఆహ్లాదకరమైన వాతావరణంలో చదువులు కొనసాగేలా చర్యలు చేపట్టారు. విద్యా ప్రమాణాలు పెరిగేలా పాఠ్యాంశాల్లో కీలక మార్పులు చేపట్టారు.

జగనన్న విద్యాకానుకతోపాటు ఆంగ్ల మాధ్యమం, ఇంగ్లిష్‌ ల్యాబ్‌లు, సీబీఎస్‌ఈ విధానం అమలు, డిజిటల్‌ తరగతులకు శ్రీకారం, 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు, బైజూస్‌ కంటెంట్‌ ద్వారా విద్యార్థుల నైపుణ్యాలను పెంపొందిస్తున్నారు. ఇవన్నీ మంచి ఫలితాలనిస్తుండటంతో పలు రాష్ట్రాల ప్రభుత్వ బృందాలు ఈ కార్యక్రమాలపై అధ్యయనం చేశాయి. ఉత్తరప్రదేశ్‌ సహా ఇతర రాష్ట్రాల్లో వీటి అమలుకు శ్రీకారం చుట్టాయి. 

సదుపాయాలతో మెరుగైన విద్య
ప్రభుత్వ పాఠశాలల్లో నాడు–నేడు కింద  నీటి వసతితో కూడిన మరుగుదొడ్లు, మంచినీరు, మేజర్, మైనర్‌ మరమ్మతులు, విద్యుత్తు, ఫ్యాన్లు, డ్యూయెల్‌ డెస్కులు, బెంచీలు, కుర్చీలు, బీరువాలు, టేబుళ్లు, గ్రీన్‌ చాక్‌ బోర్డులు, పాఠశాల మొత్తానికి పెయింటింగ్, ఇంగ్లిష్, ల్యాబ్, కాంపౌండ్‌ వాల్స్‌ ఏర్పాటు చేస్తున్నారు. తాజాగా అన్ని హైస్కూళ్లలో డిజిటల్‌ తరగతి గదులు ఏర్పాటవుతున్నాయి. 4 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు డిజిటల్‌ కంటెంట్‌ అందుబాటులోకి తెస్తున్నారు. 8వ తరగతికి వచ్చే విద్యార్థులందరికీ ట్యాబ్‌లు అందిస్తున్నారు.

ప్రపంచ ప్రఖ్యాత విద్యాసంస్థ బైజూస్‌ సహకారంతో అత్యుత్తమ పాఠ్యాంశాలతో కూడిన డిజిటల్‌ కంటెంట్‌ అందిస్తున్నారు. రూ.36,843 విలువైన ట్యాబ్, కంటెంట్‌ను ప్రతి విద్యార్థికి ఉచితంగా అందిస్తున్నారు. పదో తరగతి వరకు విద్యార్థులకు ఈ కంటెంట్‌ అందుతుంది. జగనన్న విద్యాకానుక కింద బైలింగ్యువల్‌ టెక్ట్స్‌ బుక్స్, వర్కు బుక్కులు, బ్యాగు, 3 జతల యూనిఫారం, షూ, సాక్సులతోపాటు ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీలను కూడా ప్రభుత్వం విద్యార్ధులకు ఉచితంగా అందిస్తున్న సంగతి తెలిసిందే. 

61,661 విద్యాసంస్థల్లో నాడు–నేడు
కేంద్ర ప్రభుత్వం ఐదేళ్ల కాలపరిమితితో 14,500కు పైగా పీఎం శ్రీ స్కూళ్లను దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయాలని నిర్ణయించగా రాష్ట్రంలో మాత్రం నాడు – నేడు ద్వారా శాశ్వత ప్రాతిపదికన ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నారు. నాడు–నేడు తొలిదశ కింద 15,715 స్కూళ్లలో  సదుపాయాలను కల్పించగా గతేడాది ఆగస్టు 16న ముఖ్యమంత్రి జగన్‌ వీటిని జాతికి అంకితం చేశారు. రెండో విడత నాడు – నేడు కూడా మొదలైంది.

ప్రభుత్వ స్కూళ్లతో పాటు జూనియర్‌ కాలేజీలు, హాస్టళ్లు, భవిత కేంద్రాలు, జిల్లా విద్యాబోధనా శిక్షణ కళాశాలల (డైట్స్‌)లతో పాటు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమల్లోకి తెస్తున్న శాటిలైట్‌ ఫౌండేషన్‌ స్కూళ్లనూ నాడు–నేడులోకి చేర్చింది. తొలివిడతతో కలిపి మొత్తం 61,661 విద్యాసంస్థల్లో పది రకాల సదుపాయాలను సమకూరుస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement