తిరుమల/సాక్షి ప్రతినిధి ఏలూరు: ఫోర్జరీ ఆధార్ కార్డులతో తన సిఫార్సు లేఖలపై వేరే రాష్ట్రాలకు చెందినవారికి తిరుమలలో శ్రీవారి దర్శనం చేయిస్తున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ శుక్రవారం టీటీడీ విజిలెన్స్ వలకు చిక్కారు. ఆయనే స్వయంగా ఫోర్జరీ ఆధార్ కార్డులతో భక్తులను దర్శనానికి తీసుకెళ్తుండగా విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారంపై టీటీడీ విజిలెన్స్ అధికారి గిరిధర్‌రావు వెల్లడించిన వివరాలు... ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ ఇతర మతస్తుడైనా తరచూ శ్రీవారి దర్శనానికి సిఫార్సు లేఖలు జారీ చేస్తున్నారు. దీంతో అనుమానం వచ్చిన టీటీడీ ఉన్నతాధికారులు లోతుగా ఈ వ్యవహారాన్ని పరిశీలించారు.
గత నెల రోజుల వ్యవధిలోనే ఎమ్మెల్సీ సాబ్జీ 19సార్లు సిఫార్సు లేఖలు జారీ చేశారని వెల్లడైంది. ఇందులో మూడుసార్లు ఎమ్మెల్సీయే స్వయంగా తిరుమలకు వచ్చారు. తన సిఫార్సు లేఖలపై దర్శనానికి పంపిన భక్తులంతా కూడా ఇతర రాష్ట్రాలకు చెందినవారే. ఈ క్రమంలో శుక్రవారం కూడా ఎమ్మెల్సీ సాబ్జీ స్వయంగా తిరుమలకు వచ్చారు. 14 మందికి బ్రేక్ దర్శనాలు కావాలని దరఖాస్తు చేశారు. ఆయన ఎమ్మెల్సీ కావడంతో టీటీడీ నిబంధనల మేరకు 10 మందికి అధికారులు బ్రేక్ దర్శన టికెట్లు ఇచ్చారు. అయితే అనుమానంతో ఆయనతోపాటు దర్శనానికి వెళ్తున్నవారిని విజిలెన్స్ అధికారులు తనిఖీ చేశారు.
భక్తులు ఫోర్జరీ ఆధార్ కార్డులపై దర్శనానికి వెళుతున్నట్లు గుర్తించి వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. బెంగళూరుకి చెందిన భక్తుల ఆధార్ కార్డులను ఫోర్జరీ చేసి హైదరాబాద్‌కు చెందినవారిగా సృష్టించారని వెల్లడైంది. అంతేకాకుండా ఆరుగురు భక్తులకు దర్శనానికి సంబంధించి ఎమ్మెల్సీ డ్రైవర్ ఖాతాలో రూ.లక్షా 5 వేలు జమయ్యాయి. దీంతో వీరిపై విజిలెన్స్ అధికారులు ఫిర్యాదు చేయడంతో డ్రైవర్‌తో పాటు ఎమ్మెల్సీని టూటౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని రద్దు చేయాలి
అధికార హోదాను అడ్డుపెట్టుకొని దర్శనాల్లో అక్రమాలకు పాల్పడిన ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ శాసనమండలి సభ్యత్వాన్ని రద్దు చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. మండలి చైర్మన్ ఈ సంఘటనపై వెంటనే స్పందించాలని ఆ పార్టీ నేతలు భానుప్రకాష్, విష్ణువర్ధన్ రెడ్డి వేర్వేరుగా డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment