సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మీద హత్యాయత్నం ఘటనపై కేసు నమోదు అయింది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు ఫిర్యాదుతో సింగ్‌నగర్ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. హత్యాయత్నం ఐపీసీ సెక్షన్ 307 కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు.
మరోవైపు నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఇప్పటికే ఘటనాస్థలంలో పోలీసులు ఆధారాలు సేకరించారు. పక్కా ప్లాన్ ప్రకారం సీఎం జగన్‌పై దాడి చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణ చేశారు. క్లూస్ టీమ్, సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఏసీపీ స్థాయి అధికారులతో ఆరు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగుతోంది.
‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో భాగంగా శనివారం రాత్రి 8.10 గంటలకు సీఎం వైఎస్ జగన్ విజయవాడ సింగ్ నగర్ డాబా కొట్ల సెంటర్‌కు చేరుకోగానే ఆయనపై హత్యాయత్నం జరిగింది. సీఎం జగన్ కణతకు గురిచూసి పదునైన వస్తువుతో దాడి చేశాడు. అయితే ప్రజలకు అభివాదం చేస్తూ సీఎం జగన్ పక్కకు తిరగడంతో ఆయన ఎడమ కంటి కనుబొమ్మపై భాగాన బలమైన గాయమైంది.
దీంతో సీఎం పక్కకు తూలి.. ఎడమ కంటిని బలంగా అదిమి పట్టుకున్నారు. ఆయన ఎడమ కన్ను పైభాగం వాచిపోయింది. కాగా ఆ వస్తువు పదును, వేగాన్ని బట్టి అది రాయి, గ్రానైట్ పలక, పెల్లెట్, ఎయిర్ బుల్లెట్ ఏదైనా కావచ్చని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. సీఎం జగన్ ఎడమ కంటిపై భాగాన గాయమయ్యాక.. ఆ పదునైన వస్తువు మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌కూ తగలడంతో ఆయనకు కూడా గాయమైంది.
చదవండి: రక్తమోడినా సడలని సంకల్పం
Comments
Please login to add a commentAdd a comment