ప్రతి పంటకూ మద్దతు ధర కల్పిస్తున్నాం | Poonam Malakondaiah Says We provide support pricing for each crop | Sakshi
Sakshi News home page

ప్రతి పంటకూ మద్దతు ధర కల్పిస్తున్నాం

Published Sun, Jun 27 2021 3:40 AM | Last Updated on Sun, Jun 27 2021 3:40 AM

Poonam Malakondaiah Says We provide support pricing for each crop - Sakshi

సాక్షి, అమరావతి:  రాష్ట్రంలో పండిన ప్రతి పంటకూ మార్కెటింగ్‌ సౌకర్యం కల్పించి ప్రతి రైతుకూ మద్దతు ధర వచ్చేలా చూస్తున్నామని వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య చెప్పారు. ఈ ఏడాది మామిడి సీజన్‌లో 27 కిసాన్‌ రైళ్ల ద్వారా 16 వేల మెట్రిక్‌ టన్నుల మామిడిని ఎగుమతి చేసి రైతులకు మద్దతు ధర కల్పించినట్టు వెల్లడించారు. తాడేపల్లిలోని విపత్తుల నిర్వహణ శాఖ కార్యాలయంలో ఉద్యాన శాఖ కమిషనర్‌ శ్రీధర్‌తో కలిసి శనివారం మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు.  మామిడి కిలోకు సరాసరి ధర రూ.12కు తగ్గకుండా చూస్తున్నామని హామీ ఇచ్చారు. అంతకంటే తక్కువ ధరకు కొనుగోలు చేస్తే ప్రాసెసింగ్‌ యూనిట్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఉద్యాన శాఖ కమిషనర్‌ ప్రతి వారం చిత్తూరు వెళ్లి పరిస్థితిని సమీక్షిస్తున్నారని,  కలెక్టర్‌ కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్‌ చేస్తున్నారని చెప్పారు.  

తప్పుడు ప్రచారంతో మార్కెట్‌ సెంటిమెంట్‌ను దెబ్బతీయొద్దు 
కొందరు మామిడిపై తప్పుడు ప్రచారంతో మార్కెట్‌లో సెంటిమెంట్‌ను దెబ్బతీస్తున్నారని మాలకొండయ్య ఆవేదన వ్యక్తం చేశారు. మామిడి రైతుల్లో అనవసర భయాందోళనలు సృష్టించవద్దని అందరినీ కోరుతున్నామన్నారు. దుష్ప్రచారం చేస్తే పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు. మామిడి రైతులకు సరైన ధర రాదు అనే భయాన్ని కల్పించవద్దని కోరారు. ధరల స్థిరీకరణపై ప్రతి రోజూ సమీక్షించి అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. కోవిడ్‌ రెండో దశ మొదలైనప్పటి నుంచి ఉద్యాన రైతులు పంట ఉత్పత్తుల్ని అమ్ముకోవడానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో అనేక చర్యలు తీసుకున్నామని వివరించారు. రాష్ట్రంలోని ఉద్యాన రంగంలో ఉన్న 256 ఎఫ్‌పీవో (రైతు సంఘాలు)లను వ్యాపారులు, మార్కెట్‌లతో అనుసంధానం చేసినట్టు తెలిపారు. ఏపీకి ప్రధాన మార్కెట్లయిన ఢిల్లీ, ముంబై, చెన్నైలోని కమిషనర్లు, మార్కెటింగ్‌ సెక్రటరీలు, పోలీసులతో మాట్లాడి రవాణా, ఎగుమతులకు కావాల్సిన ఏర్పాట్లు చేశామని చెప్పారు. మామిడి తోటలన్నీ రైతు భరోసా కేంద్రాల ద్వారా ఈ–క్రాప్‌లో నమోదయ్యాయని, ఆ డేటాను బట్టి అక్కడి వ్యవసాయ, ఉద్యాన సహాయకులకు ఏం చేయాలో చెప్పామన్నారు. కరోనా విపత్తు వల్ల పంట కోత సమయాల్లో కర్ఫ్యూ అమల్లో ఉన్నా రైతులు పండించిన పంటలను మార్కెట్‌కి తరలించేలా పకడ్బందీ చర్యలు తీసుకున్నామని వివరించారు. పండ్ల రవాణాకు ఎప్పుడు ఇబ్బంది లేకుండా చూశామని చెప్పారు. చిత్తూరు జిల్లాలో ఇంకా 30 శాతం మామిడి పంట జూలై చివరి నాటికి వస్తుందని తెలిపారు. 

2 వేల గోడౌన్లకు 8న సీఎం శంకుస్థాపన 
వైఎస్సార్‌ రైతు దినోత్సవం సందర్భంగా జూలై 8వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా 2 వేల గోడౌన్లు నిర్మాణానికి సీఎం జగన్‌ శంకుస్ధాపన చేస్తున్నారని మాలకొండయ్య తెలిపారు. దశలవారీగా రానున్న ఏడాది కాలంలో ప్రతి మేజర్‌ పంచాయతీలో ఒక గోడౌన్, ప్రతి ఆర్బీకేలో 500 మెట్రిక్‌ టన్నుల గోడౌన్‌ నిర్మాణాం చేపట్టాలన్నది సీఎం ఆలోచన అని తెలిపారు. వెయ్యి మెట్రిక్‌ టన్నుల గోడౌన్స్‌ నిర్మాణానికి కూడా ప్లాన్‌ చేస్తున్నామని, వీటివల్ల రైతులు వారి ఉత్పత్తులను అక్కడే నిల్వ చేసుకోవచ్చన్నారు. ఉద్యాన పంటల కోసం ప్రతి ఆర్బీకేలో కోల్డ్‌ స్టోరేజీ ప్లాంట్ల ఏర్పాటుకు సీఎం నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. దీనికి సంబంధించి టెండర్ల ప్రక్రియతో పాటు అన్ని పనులు పూర్తయ్యాయన్నారు. ప్రతి జిల్లాలో పుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల నిర్మాణానికి సీఎం జగన్‌ ఆదేశాలతో ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని, నూజివీడులో మ్యాంగో ప్రాసెసింగ్‌ యూనిట్, తూర్పుగోదావరిలో కొబ్బరి ప్రాసెసింగ్‌ యూనిట్‌ నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నామని వివరించారు. అలా 25 చోట్ల  ఫల ఉత్పత్తులకు సంబంధించి సుమారు రూ.2,500 కోట్లతో సెకండరీ ప్రాసెసింగ్‌ యూనిట్ల నిర్మాణం చేపడుతున్నట్టు చెప్పారు.  

సాగు విస్తీర్ణం పెరిగింది 
ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాల వల్ల రాష్ట్రంలో ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం పెరిగిందని మాలకొండయ్య తెలిపారు. మార్కెట్‌లో ఉద్యాన శాఖ మార్కెట్‌ జోక్యం వల్ల రైతులకు భరోసా లభించిందన్నారు. దీనివల్ల ఏడాది కాలంలోనే రైతులు ఇతర పంటల నుంచి సుమారు 65 వేల హెక్టార్లలో ఉద్యానవన పంటల వైపు మళ్లారని తెలిపారు. ఉద్యాన శాఖలో కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెస్తున్నామని, డ్రోన్ల ద్వారా ఎరువులు స్ప్రే చేసే వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.  

ఇతర పంటలకూ మంచి ధరలు 
రాష్ట్రంలోని రైతులు పండించిన ఇతర పంటలకూ మంచి ధరలు లభించేలా ప్రభుత్వం చేపట్టిన చర్యలు సత్ఫలితాలిచ్చాయని మాలకొండయ్య పేర్కొన్నారు. క్వింటాల్‌ పసుపునకు రూ.6,850, మిరపకు రూ.7 వేలు, బత్తాయికి రూ.1,450, ఉల్లికి రూ.750, అరటికి రూ.800, చిరు ధాన్యాలకు రూ.2,500 ధర కల్పించామన్నారు. వరి పంట కాకుండా ఇతర పంటలకు మద్దతు ధర కల్పించేందుకు ఇప్పటివరకూ రూ.6 వేల కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసిందని చెప్పారు. కేంద్రం కనీస మద్దతు ధరలు (ఎంఎస్‌పీ) ప్రకటించని పంటలకు సైతం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేరకు శ్రేణీకృత మద్దతు ధర (గ్రేడెడ్‌ ఎంఎస్‌పీ)లను ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు. వేరుశనగ ఏ గ్రేడ్‌కు కేంద్రం ఎంఎస్‌పీ ప్రకటిస్తుందని, బి గ్రేడ్‌ పండించిన రైతులకునా ధర లభించదన్నారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం గ్రేడెడ్‌ ఎంఎస్‌పీ ప్రకటించారు. పొగాకు బోర్డు గుంటూరులో ఉన్నా కోవిడ్‌ సమయంలో వాళ్లు ఏమీ చేయలేకపోయారని, సీఎం ఆదేశాలతో మార్కెటింగ్‌ శాఖ జోక్యం చేసుకుని రైతులకు మంచి ధర వచ్చేటట్టు చేయగలిగిందని గుర్తు చేశారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement