అక్రమాలకు అడ్డుకట్ట వేస్తూ.. పారదర్శకంగా జిల్లా ప్రజలకు కోరినంత ఇసుకను జిల్లా యంత్రాంగం సరఫరా చేస్తోంది. కృష్ణా, పెన్నా తీర ప్రాంతాల నుంచి ఉప్పునీటి తాకిడి లేని ఇసుకను అందుబాటులోకి తీసుకొచ్చింది. గతంలో ఉన్న స్టాక్ పాయింట్లను రెట్టింపు చేసి భారీగా నిల్వ చేసింది. జగనన్న కాలనీలకే కాకుండా ఇతర కట్టడాలకు సరిపడా ఇసుకను సరఫరా చేస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయంతో ఇసుక అక్రమార్కుల చెర నుంచి వినియోగదారులను గట్టున పడేసినట్లు అయింది.
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఇసుక నిల్వ కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వీటి ద్వారా అన్ని రకాల నిర్మాణాలకు ఇసుక సరఫరా చేసేలా చర్యలు తీసుకుంది. ప్రధానంగా పెన్నా నది ఇసుక సంగం రీచ్ ద్వారా జిల్లాకు సరఫరా అవుతోంది. ప్రతి నెలా 40 నుంచి 50 వేల టన్నుల ఇసుకను జిల్లాలోని వినియోగదారులకు అందించేలా జిల్లా అధికారులు చర్యలు తీసుకున్నారు. గతంలో ఒంగోలుతో పాటు కనిగిరి, గిద్దలూరు, మార్కాపురం, యర్రగొండపాలెంలలో ప్రధాన ఇసుక స్టాక్ పాయింట్లు ఉండేవి. పుష్కలంగా ఇసుక నిల్వలను అందుబాటులో ఉంచేందుకు అదనంగా ఏడు స్టాక్ పాయింట్లను ఏర్పాటు చేశారు. త్వరలో కృష్ణా నది ఇసుకను జిల్లాకు తరలించేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు.
500 ఇళ్లకుపైగా ఉన్న జగనన్న కాలనీలకు ప్రత్యేకంగా..
రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మకంగా చేపట్టిన జగనన్న కాలనీలకు కూడా జిల్లా వ్యాప్తంగా ఇసుక ఉచితంగా సరఫరా అవుతోంది. అందులోనూ ప్రత్యేకంగా 500 ఇళ్లకు పైగా ఉన్న జగనన్న కాలనీల్లోనే జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారులు ప్రత్యేకంగా నిల్వ కేంద్రాలు ఏర్పాటు చేశారు. లబ్ధిదారులకు ఇబ్బందులు లేకుండా ఆయా కాలనీల సమీపంలో పాయింట్లను ఏర్పాటు చేశారు. దీంతో జగనన్న కాలనీలకు సకాలంలో నాణ్యమైన ఇసుక ఉచితంగా సరఫరా చేస్తున్నారు. సింగరాయకొండలోని నిర్మిత కేంద్రం, కనిగిరి పట్టణం, పొదిలి, దర్శి, గిద్దలూరు టిడ్కో ఇళ్ల పక్కన, యర్రగొండపాలెం మండలంలోని మిల్లంపల్లి, బేస్తవారిపేట మండలంలోని మోక్షగుండంలలో స్టాక్ పాయింట్లను ఏర్పాటు చేసి ఆయా గ్రామాల్లోని జగనన్న కాలనీలతో పాటు పరిసర ప్రాంతాల్లోని జగనన్న కాలనీలకు కూడా అక్కడ నుంచే ఇసుక సరఫరా చేస్తున్నారు.
ప్రభుత్వం నిర్దేశించిన ధరకే ఇసుక
జిల్లాలో ఇతర కట్టడాలకు, వ్యక్తిగత గృహాల నిర్మాణాలకు ప్రభుత్వం అందరికీ అందుబాటులో ఇసుక ఉంచేలా డంపింగ్ యార్డులు ఏర్పాటు చేసింది. పారదర్శక విధానంలో ప్రభుత్వం నిర్దేశించిన ధరకే నాణ్యమైన ఇసుకను ప్రభుత్వం సరఫరా చేస్తోంది. జిల్లాలోని నియోజకవర్గాల వారీగా రీజనబుల్ రవాణా చార్జీలతో కలిపి టన్నుకు ప్రభుత్వం నిర్దేశించిన ధరకు సరఫరా చేస్తోంది. ఎవరైనా ఎక్కువ ధరకు ఇసుక అమ్మితే ఎస్‌ఈబీ అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు.
నెలకు 20 వేల టన్నులకు పైగా...
జిల్లాలో నిర్మిస్తున్న జగనన్న కాలనీలకు, ప్రభుత్వం మంజూరు చేసిన వ్యక్తిగత ఇళ్ల నిర్మాణాలకు నెలకు దాదాపు 20 వేల టన్నులకు పైగా ఇసుకను గృహ నిర్మాణ శాఖ సరఫరా చేస్తోంది. ఇంకా కొన్ని ఇళ్ల నిర్మాణాలు కోర్టు కేసుల వలన నిలిచిపోయాయి. అవి కూడా ప్రారంభమైతే మరో 5 నుంచి 10 వేల టన్నుల వరకు అదనంగా ఇసుక వాడకం పెరుగుతుంది. జిల్లాలో మొత్తం 570 జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. వాటిలో మొత్తం ప్రస్తుతం 50,813 గృహాల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి.
నాణ్యమైన ఇసుకతో ఇళ్లు నిర్మించుకున్నాం
గ్రామంలో జగనన్న కాలనీలో ఇంటి నిర్మాణం పూర్తి చేసుకున్నాం. గృహ నిర్మాణ శాఖ అధికారులు నెల్లూరు జిల్లా, సంగం ప్రాంతంలోని పెన్నా నది నుంచి తీసుకొచ్చిన ఇసుకను ఉచితంగా అందజేశారు. హాండ్లింగ్ చార్జీల కింద టన్నుకు రూ.175 చొప్పున మాత్రమే ఇచ్చిన ఇసుక తెచ్చుకున్నాం. నాణ్యమైన ఇసుక కావటంతో నిర్మాణం కూడా బాగా వచ్చింది. పటిష్టంగా నిర్మించుకున్నాం. జగనన్న కాలనీ వల్ల సొంతింటి కల నెరవేరింది. అందుకే ఇంటిపై జగనన్న ఫొటోను కూడా ఏర్పాటు చేసుకొని శాశ్వతంగా మా కుటుంబంలో జగనన్నను ఒక సభ్యునిగా చేసుకున్నాం.
– ధారా నందిని భవానీ, రామాయణ కండ్రిక, పొదిలి
ఇబ్బందులు లేకుండా ఇసుక సరఫరా...
ప్రభుత్వం అందిస్తున్న ఇసుకను లబ్ధిదారులకు ఇబ్బందులు లేకుండా సరఫరా చేస్తున్నాం. జగనన్న కాలనీలతో పాటు ప్రభుత్వం మంజూరు చేసిన వ్యక్తిగత ఇళ్లకు కూడా అందిస్తున్నాం. ప్రభుత్వం విధించిన నిబంధనల మేరకు సరఫరా చేస్తున్నాం. ప్రతి నెలా 20 నుంచి 25 వేల టన్నుల వరకు సరఫరా చేస్తున్నాం. జగనన్న కాలనీలకు అందుబాటులోనే ఇసుక సరఫరా చేస్తున్నాం.
– ఈమని పేరయ్య, పీడీ, జిల్లా గృహ నిర్మాణ శాఖ
Comments
Please login to add a commentAdd a comment