వెంకటరెడ్డి, డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డికి రాష్ట్రపతి ఉత్తమ పోలీస్ సేవా పతకం(ప్రెసిడెంట్స్ పోలీస్ మెడల్–పీపీఎం) లభించింది. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ వేడుకల వేళ కేంద్ర హోం శాఖ ఈ అవార్డును ప్రకటించింది. విధి నిర్వహణలో ఉత్తమ సేవలందించినందుకు ఉత్తమ సేవలు–2020 సంవత్సరానికి ఈ పురస్కారం దక్కింది. ఈ పతకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం రోజున అందజేయనున్నారు. 1992 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రస్తుతం రాష్ట్ర డీజీపీగా పనిచేస్తున్న సంగతి తెల్సిందే. రాజేంద్రనాథ్‌రెడ్డి గతంలో విజయవాడ నగర పోలీస్ కమిషనర్, ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జనరల్, విజిలెన్స్–ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ జనరల్‌తోపాటు పలు హోదాల్లో విధులు నిర్వహించారు.
వెంకటరెడ్డికి ఐపీఎం
రిటైర్డ్ ఏఎస్పీ నల్లమిల్లి వెంకటరెడ్డి తన సర్వీస్ కాలంలో అందించిన ఉత్తమ సేవలకు కేంద్ర హోం శాఖ ఇండియన్ పోలీస్ మెడల్ (ఐపీఎం) ప్రకటించింది. సబ్ ఇన్‌స్పెక్టర్ 1989 బ్యాచ్‌కు చెందిన వెంకటరెడ్డి పోలీస్ శాఖలో విశిష్టమైన సేవలందించారు. సబ్ ఇన్‌స్పెక్టర్, ఇన్‌స్పెక్టర్, డీఎస్పీ, అడిషనల్ ఎస్పీగా అనేక హోదాల్లో విధులు నిర్వర్తించిన ఆయన పోలీస్ శాఖలో తనదైన ముద్ర వేసుకున్నారు.
విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖలో అడిషనల్ ఎస్పీగా విధులు నిర్వహిస్తూ పదవీ విరమణ చేశారు. విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌లో గతేడాది ఆయన అందించిన సేవలకు కేంద్రం ఈ అవార్డును ప్రకటించింది. స్వాతంత్య్ర దినోత్సవం రోజున సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా వెంకటరెడ్డి ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment