సాక్షి, విశాఖపట్నం/మహారాణిపేట(విశాఖ దక్షిణ): ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ(పీఎఫ్‌ఆర్) కోసం భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, పలువురు కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, త్రివిధ దళాలకు చెందిన ఉన్నతాధికారులు ఆదివారం విశాఖ రానున్నారు. ప్రముఖుల రాకతో పోలీస్ అధికారులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు.
సాయంత్రం 5.30 గంటలకు భువనేశ్వర్ నుంచి ప్రత్యేక విమానంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ విశాఖ చేరుకుంటారు. ఆయనకు ఆహ్వానం పలికేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సాయంత్రం 4.45 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. ఐఎన్‌ఎస్ డేగాలో రాష్ట్రపతికి స్వాగతం పలికిన తరువాత సాయంత్రం 5.55 గంటకు సీఎం తిరుగు పయనమవుతారు. అనంతరం రాష్ట్రపతి ఐఎన్‌ఎస్ డేగా నుంచి తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రంలో ఏర్పాటు చేసిన బస ప్రాంతానికి చేరుకోనున్నారు. సోమవారం ఉదయం 9.30 గంటలకు ఫ్లీట్ రివ్యూలో పాల్గొంటారు.
ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు కేంద్ర కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి దేవ్‌సింగ్ చౌహన్, కేంద్ర మత్స్యశాఖ, పశుసంవర్థక శాఖ మంత్రి రూపాల పురుషోత్తమ్, కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్, అండమాన్ నికోబార్ దీవుల లెఫ్ట్‌నెంట్ గవర్నర్ అడ్మిరల్ డి.కె.జోషి, రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం, కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శి డాక్టర్ అజయ్‌కుమార్, కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శి (ఎక్స్ సర్వీసెమెన్ వెల్ఫేర్) బి.ఆనంద్, కేంద్ర ఎర్త్ అండ్ సైన్స్ శాఖ కార్యదర్శి డాక్టర్ ఎం.రవిచంద్రన్, గవర్నర్ కార్యదర్శి, స్పెషల్ చీఫ్ సెకట్రరీ ఆర్.పి.సిసోడియా, స్కూల్ ఎడ్యుకేషన్ ప్రత్యేక చీఫ్ సెక్రటరీ బి.రాజశేఖర్, రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు రఘునాధరావు, బి.కృష్ణమోహన్ తదితరులు వస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment