AP: ఆమెకు టెర్రర్ | Problems for Kadiam Nursery Farmers | Sakshi
Sakshi News home page

AP: ఆమెకు టెర్రర్

Published Sun, Nov 10 2024 5:49 AM | Last Updated on Sun, Nov 10 2024 5:54 AM

Problems for Kadiam Nursery Farmers

హత్యాచార ఘటనతో వలస కూలీల్లో భయాందోళన

నర్సరీల్లో పనికి వెనుకంజ మొక్కల ఉత్పత్తిపై ప్రతికూల ప్రభావం

కడియం నర్సరీ రైతులకు ఇబ్బందులు

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న హత్యాచార ఘటనలు మహిళలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. ముఖ్యంగా బతుకుతెరువు కోసం ఇతర ప్రాంతాల నుంచి తూర్పు గోదావరి జిల్లాకు వలస వచ్చిన మహిళా కూలీలు ఈ వరుస ఘటనలతో హడలెత్తుతున్నారు. ప్రధానంగా కడియం పరిసర మండలాల్లోని నర్సరీల్లో రోజువారీ పనులకు ఒకరిద్దరుగా వెళ్లడానికి వలస మహిళా కూలీలు జంకుతున్నారు. గత నెల 15న నర్సరీలో పనికి వెళ్లిన 43 ఏళ్ల కస్తూరి సామూహిక లైంగిక దాడికి, హత్యకు గురవడమే దీనికి కారణం. ఈ పరిస్థితులు నర్సరీ రైతులకు ఇబ్బందికరంగా మారాయి. మరోవైపు నర్సరీల్లో మొక్కల ఉత్పత్తిపై కూడా ప్రతికూల ప్రభావం పడుతోంది.

కడియం: తూర్పు గోదావరి జిల్లా కడియం, రాజమహేంద్రవరం రూరల్‌తో పాటు కోనసీమ జిల్లా కొత్తపేట, ఆలమూరు, మండపేట రూరల్‌ తదితర ప్రాంతాల్లో నర్సరీలు విస్తరించి ఉన్నాయి. ఈ ప్రాంతంలో 1,500 రిజిస్టర్డ్, రిజిస్టర్‌ కానివి మరో 500 పైగా కలిపి మొత్తం రెండు వేలకు పైగా నర్సరీలు ఉన్నాయి. వీటికి దేశవ్యాప్తంగానే ప్రత్యేక గుర్తింపు ఉంది. రూ.5 నుంచి రూ.50 లక్షల వరకూ విలువ చేసే మొక్కలను ఇక్కడి రైతులు స్వీయ ప్రతిభతో ఉత్పత్తి చేస్తూంటారు. నాణ్యమైన మొక్కలు సరసమైన ధరలకు లభిస్తూండటంతో ఇక్కడి మొక్కల వ్యాపారం దేశం నలుమూలలా విస్తరించింది. 

వేలాది మందికి ఉపాధి 
ఇక్కడి నర్సరీలపై ఆధారపడి ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వేలాది మంది కారి్మకులు జీవనం సాగిస్తున్నారు. మొక్కల సాగు, రవాణా తదితర పనుల్లో వీరి పాత్ర అత్యంత కీలకం. నర్సరీలతో పాటు, పూలతోటలు, గోదావరి లంక ప్రాంతాల్లో కూరగాయల సాగులో కూడా వలస కూలీల పాత్ర ఎక్కువే. సుమారు వందేళ్ల చరిత్ర ఉన్న కడియం నర్సరీ రంగానికి శ్రీకాకుళం, విజయనగరం, ఒడిశా తదితర ప్రాంతాల నుంచి వలస వచ్చిన దాదాపు 25 వేల మంది కూలీలు వెన్నెముకగా ఉన్నారు. వారు తమ కుటుంబాలతో వచ్చి ఇక్కడ స్థిరపడి, నర్సరీల్లో ఉపాధి పొందుతున్నారు.

వీరిలో 12 వేల మందికి పైగా మహిళా కూలీలే కావడం విశేషం. చేసే పనిని బట్టి రోజు కూలీగా, కాంట్రాక్టు విధానంలో వీరికి రైతులు చెల్లింపులు చేస్తారు. మహిళలకు రోజుకు రూ.350 నుంచి రూ.400 వరకూ చెల్లిస్తారు. ప్యాకెట్లు పెట్టడం, వాటిని సర్దడం, మొక్కల పెంపకం, కలుపుతీతలు, ఎరువులు వేయడం, మందుల పిచికారీ, నీరు పెట్టడం, ఎగుమతులు, దిగుమతులు తదితర విభాగాల్లో మహిళా కూలీలు పని చేస్తూంటారు. ప్యాకెట్లను బట్టి కూలి ఉంటుంది. ఒక్కోసారి రోజుకు సగటున ఒక్కొక్కరికి రూ.600 నుంచి రూ.800 వరకూ కూడా గిట్టుబాటు అవుతూంటుంది. 

చిన్న కమతాలే అధికం 
స్థానిక నర్సరీల్లో 85 శాతం పైగా అరెకరం నుంచి రెండెకరాల విస్తీర్ణం ఉన్న చిన్న కమతాలే ఉన్నాయి. ఈ రైతులు ఒకరిద్దరు మహిళలను పనిలో పెట్టుకుని, తాము కూడా పని చేస్తూ మొక్కలు ఉత్పత్తి చేస్తారు. ఇద్దరు మనుషులు నాలుగైదు రోజులు పని చేస్తే మొక్కల సాగులో ఒక దశ పని పూర్తవుతుంది. మళ్లీ కొన్ని రోజులకు పనిలోకి పిలుస్తూంటారు. కానీ అక్టోబర్‌ హత్యాచార ఘటన తరువాత ఒకే రోజు ఐదారుగురు కలసి పనిలోకి వచ్చేందుకు మాత్రమే మొగ్గు చూపుతున్నారు. దీంతో ఒకరిద్దరే అవసరమయ్యే చిన్న కమతాల రైతులకు భారం తప్పడం లేదు. 

భయం తొలగించేందుకు చర్యలు 
మహిళా కూలీల్లో భయాన్ని తొలగించేందుకు సర్‌ ఆర్థర్‌ కాటన్‌ నర్సరీ ఫార్మర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు, పోలీసులు పలు చర్యలు చేపట్టారు. ఒకరిద్దరుగా పనులకు వెళ్లవద్దని మహిళలకు సూచించారు. అలాగే ప్రతి నర్సరీలోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని రైతులకు సూచించారు. అతిగా ప్రవర్తించే వ్యక్తుల సమాచారం తమకు ముందుగా ఇస్తే నిఘా ఉంచుతామని భరోసా ఇస్తున్నారు.

మత్తులో జోగుతున్న యువత
నర్సరీల్లో పనులు చేస్తున్న వారిలో అత్యధిక శాతం మందికి మద్యం అలవాటు ఉందని స్థానికులు చెబుతున్నారు. దీనికి తోడు ఇటీవల గంజాయి వినియోగం కూడా పెరిగిందని అంటున్నారు. జన సంచారం లేని ప్రాంతాల్లోనే కాకుండా జనావాసాల మధ్య సైతం గంజాయి తాగుతూ మత్తులో జోగుతున్నారని చెబుతున్నారు.

ఒకరిద్దరుగా వెళ్లడానికి భయంగా ఉంది 
గతంలో మాదిరిగా ఒకరిద్దరుగా పనుల్లోకి వెళ్లడానికి భయపడుతున్నాం. కస్తూరి ఘటన తరువాత ఒకరిద్దరం పనులకు రాలేమని చెప్తున్నాం. రైతులు అర్థం చేసుకుంటున్నారు. అవసరం లేకపోయినా ఎక్కువ మందిని పనిలోకి పిలవడం వారికి ఇబ్బందే. అయినప్పటికీ తప్పడం లేదు. – జి.నీలవేణి, నర్సరీ కూలీ, కడియపులంక 

మహిళా కూలీలు జంకుతున్నారు 
కస్తూరి ఘటనకు ముందు ఎంత మంది కావాలంటే అంత మందే కూలీలు పనులకు వచ్చేవారు. కానీ ఇప్పుడు ఒకరిద్దరుగా రావడానికి భయపడుతున్నారు. మేము కూడా ఉంటామన్న భరోసా ఇస్తే తప్ప పనుల్లోకి రావడం లేదు. బాగా తెలిసిన వారే అయినప్పటికీ వారిని భయం వెంటాడుతోంది. – ఎం.నాగేశ్వరరావు, నర్సరీ రైతు 

అవగాహన పెంచుతున్నాం
రౌతు కస్తూరి ఘటన తరువాత నర్సరీల్లో పనులకు వచ్చే మహిళల భద్రతకు తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలను ఇప్పటికే పలు సమావేశాల ద్వారా వివరించాం. నర్సరీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించాం. పనులకు వెళ్లి వచ్చే సమయంలో కూలీలకు సమావేశాలు  ఏర్పాటు చేసి, స్వీయ రక్షణకు తీసుకోవాల్సిన చర్యలను వివరిస్తున్నాం. – ఎ.వేంకటేశ్వరరావు, ఇన్‌స్పెక్టర్, కడియం

రౌతు కస్తూరి ఘటన క్రమం ఇదీ.. 
అక్టోబర్‌ 15 : డ్వాక్రా సమావేశం ముగించుకుని బుర్రిలంకలోని ఇంటి నుంచి మధ్యాహ్నం 1.30 గంటలకు కాలినడకన కిలోమీటరు దూరంలోని నర్సరీకి పనికి వెళ్ళింది. సాయంత్రానికి తిరిగి ఇంటికి రాలేదు. బంధువులు చుట్టుపక్కల వెతికినా ఆచూకీ తెలియలేదు.
అక్టోబర్‌ 16 : కస్తూరి భర్త పాపారావు ఫిర్యాదు మేరకు కడియం పోలీస్‌ స్టేషన్‌లో మిస్సింగ్‌ కేసు నమోదైంది. 
అక్టోబర్‌ 17: బుర్రిలంకకు 6 కిలోమీటర్ల దూరంలో ఆలమూరు మండలం చొప్పెల్ల లాకుల వద్ద బాగా పాడైపోయిన స్థితిలో ఉన్న మహిళ మృతదేహాన్ని గుర్తించారు. శరీరంపై ఉన్న ఆపరేషన్‌ ఆనవాళ్లు, కాలి పట్టీల ఆధారంగా ఆ మృతదేహం కస్తూరిదేనని కుటుంబ సభ్యులు నిర్ధారించారు. కస్తూరిపై సామూహిక అత్యాచారం చేసి, హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. 
అక్టోబరు 31 : నలుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.

అక్టోబర్‌ 15 దుర్ఘటనతో.. 
కడియం మండలం కడియపులంక పంచాయతీ బుర్రిలంక వద్ద నర్సరీలో పని చేస్తూ జీవనం సాగిస్తున్న రౌతు కస్తూరిపై గత నెల 15వ తేదీన నలుగురు దుర్మార్గులు మద్యం మత్తులో అత్యంత పాశవికంగా సామూహిక లైంగిక దాడికి పాల్పడి, హత్య చేశారు. ఈ దారుణ ఘటనతో నర్సరీల్లో పనులు చేసుకునేందుకు వచ్చే వలస మహిళలు, వారి కుటుంబాల్లో తీరని భయం అలముకుంది. ఎక్కడెక్కడి నుంచో ఉపాధి పొందేందుకు ఈ ప్రాంతానికి వచ్చినప్పటికీ వారు, స్థానికులతో కలసిమెలసి జీవిస్తున్నారు. తాము వలస వచ్చామన్న విషయాన్ని మరచిపోయి, హాయిగా గడుపుతున్నారు.

ఎప్పటి మాదిరిగానే పనికి వెళ్లిన మహిళ పట్ల, తమకు నిత్యం కనిపించే వ్యక్తులే ఇంతటి దారుణానికి ఒడిగట్టడం వారిలో భయాందోళనను నింపింది. ఈ ఘటన నేపథ్యంలో ఇప్పుడు నర్సరీల్లో కూలి పనులకు వెళ్లేందుకు వలస మహిళా కూలీలు జంకుతున్నారు. రైతుల అవసరాన్ని బట్టి గతంలో ఒకరిద్దరుగా కూడా పనులకు వెళ్లేవారు. అటువంటిది ఇప్పుడు పనికి రావడానికి నిరాకరిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement