![Provided Financial Assistance To Children Who Have Lost Their Parents - Sakshi](/styles/webp/s3/article_images/2021/05/31/Financial-Assistance.jpg.webp?itok=Bai6GrYK)
మంత్రులు, కలెక్టర్ చేతుల మీదుగా రూ.20 లక్షల చెక్కు అందుకుంటున్న చిన్నారులు
రోదన మనోవేదనతో రోడ్డున పడ్డ జీవితాలెన్నో.. చితిమంటల వెలుగులో రక్తతర్పణమాడుతున్న శ్మశానాలెన్నో.. ఆకలి కేకలతో అలమటిస్తున్న ఆర్తనాదాలెన్నో.. కరోనా మనకు మిగిల్చిన మనోవేదన.. మానవ రోదన ఇదీ..! ఈ దయాదాక్షిణ్యం లేని వైరస్ చేతికి చిక్కి ఒంటరైన బతుకులను అక్కున చేర్చుకుంది ప్రభుత్వం. కలలను కబళించి కన్నవారిని కోల్పోయిన ఆ పసి హృదయాలను ప్రేమగా చేరదీసింది. వారెప్పటికీ అనాథలు కాకూడదంటూ ఆర్థిక భరోసాతో ఆ ఆరిపోయే బతుకుల్లో ఓ ఆశా దీపం నింపారు ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి. ఆయన తీసుకున్న ఈ నిర్ణయం ఎన్నో జీవితాలకు కొత్త ఆశలు చిగురించేలా చేసి భవిష్యత్‌కు ఓ భరోసానిచ్చింది.
జే.పంగులూరు: ఓ కుటుంబాన్ని కరోనా కబళించేసింది. ఏకంగా ఆ కుటుంబంలోని ముగ్గురు కరోనాకు బలవడం.. ఆ ఇంట్లోని ఇద్దరు చిన్నారులు అనాథలుగా మారడం ప్రతి ఒక్కరితో కంటతడి పెట్టిస్తోంది. అమ్మ, నాన్న, నాయనమ్మను కోల్పోయిన ఆ పసిహృదయాల వేదన మనస్సును కలచివేస్తోంది. జే.పంగులూరు మండలం అలవలపాడు గ్రామానికి చెందిన బద్రి శ్రీనివాసరావు తన భార్య స్వరాజ్యలక్ష్మి, తల్లి భాగ్యలక్ష్మి, ఇద్దరు పిల్లలు శేషసాయికుమార్, అరవింద్‌తో ఏ చీకూచింతా లేకుండా జీవిస్తున్నాడు. అయితే ఏప్రిల్ 23వ తేదీన బద్రి శ్రీనివాసరావుకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఆ తర్వాత ఇంట్లో వాళ్లు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడంతో వాళ్ల అమ్మకి, భార్య, పెద్దబ్బాయి శేషసాయికి పాజిటివ్‌గా తేలింది. దీంతో నలుగురు ఒంగోలు రిమ్స్‌లో చికిత్స నిమిత్తం చేరారు.
ఏప్రిల్ 23వ తేదీన ఆస్పత్రిలో చేరిన శ్రీనివాసరావు చికిత్స పొందుతూ మూడు రోజుల్లోనే మృతిచెందాడు. ఆయన చనిపోయిన నాలుగు రోజులకు తల్లి భాగ్యలక్ష్మి చనిపోయింది. శ్రీనివాసరావు చనిపోయిన పదిహేను రోజులకు ఆయన భార్య స్వరాజ్యలక్ష్మి కూడా కరోనాకు బలైంది. నెలరోజుల్లోనే వీరు ముగ్గురూ మరణించడంతో ఆ ఇద్దరు పిల్లలు అనాథలుగా మారారు. తల్లిదండ్రులను తమ చేత్తోనే ఖననం చేసి వారి జ్ఞాపకాలతో ఇంటికి చేరిన ఆ పసిహృదయాలను ఓదార్చే వారే కరువయ్యారు. కరోనా భయంతో ఎవ్వరూ దగ్గరకు రాలేదు.. కనీసం పలకరింపులు కూడా దూరమయ్యాయి. ఆ సమయంలో సీఎం జగన్ అభయంతో వారిలో కొత్త ఆశలు చిగురించాయి. వారి భవిష్యత్‌కు పునాదులు పడ్డాయి. పిల్లల్లో పెద్దవాడైన శేషసాయికుమార్ ఇటీవల పదో తరగతి పూర్తి చేసేకోగా, చిన్నబ్బాయి అరవింద్ ఎనిమిదో తరగతి పూర్తి చేసుకున్నాడు.
చదవండి: కోవిడ్ కట్టడిలో సీఎం జగన్ చర్యలు భేష్
బాధిత చిన్నారులకు తక్షణమే భరోసా
Comments
Please login to add a commentAdd a comment