విజయవాడలో ‘ఈనాడు’ ప్రతులను దహనం చేస్తున్న ప్రజలు
సాక్షి, అమరావతి: ప్రజలను తప్పుదోవ పట్టించేలా ‘ఈనాడు’ పత్రిక అసత్య కథనాలు వండి వారుస్తోందని, వారికి అనుకూలమైన చంద్రబాబును సీఎంను చేయాలనే కుట్రతో దిగజారుడు వార్తలు ప్రచురిస్తోందని రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ఎగసిపడింది. తప్పుడు వార్తలు రాసి.. ప్రజలను మోసం చేస్తున్న ఈనాడు పత్రిక ప్రతులను గురువారం వైఎస్సార్‌సీపీ శ్రేణులు, ప్రజా సంఘాలు, సోషల్ యాక్టివిస్టులు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు, నియోజకవర్గ, మండల కేంద్రాల్లో దహనం చేశారు.
రామోజీరావు ఇంతగా దిగజారిపోవడం దారుణం అని ఛీకొట్టారు. పట్టాభినీ కొట్టారంటూ పాత ఫొటోలతో ప్రజలను తప్పుదోవ పట్టించడానికి, ప్రభుత్వం మీద బురద జల్లడానికి ఈనాడు చేసిన కుట్ర మరోసారి బట్టబయలు కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉవ్వెత్తున నిరసనలు ఎగసిపడ్డాయి. వైఎస్సార్, బీఆర్ అంబేడ్కర్ విగ్రహాలు ఉన్న సెంటర్లలో ఈనాడు రామోజీ రావు విధానాలకు వ్యతిరేకంగా ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
అవి 2021లోని ఫొటోలని సోషల్ మీడియా ద్వారా వైరల్ కావడంతో ఎవరికీ కనిపించని రీతిలో రెండో పేజీలో సింగిల్ కాలంలో ‘సవరణ’ వేసి చేతులు దులుపుకుందని ఆందోళనకారులు మండిపడ్డారు. ఈనాడు పత్రిక పుట్టిందే అసత్య వార్తలు రాయడానికి అని పెద్ద ఎత్తున నినదించారు. చంద్రబాబును సీఎం చేయాలనే కుట్రతోనే ఈనాడు పత్రిక దిగజారుడు వార్తలు, కథనాలు రాస్తోందని మంత్రులు ధ్వజమెత్తారు.
ప్రజలను మోసం చేయాలని, సీఎం వైఎస్ జగన్ చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్లకుండా చేయాలనే దురుద్ధేశం.. ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చి, చంద్రబాబుకు ప్రజలను చేరువ చేయాలని రాజగురువు రామోజీ కుట్రలు చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ నేతలు దుయ్యబట్టారు. ఈనాడు దినపత్రిక కాదు.. చంద్రబాబు కరపత్రిక అని పలు ప్రాంతాల్లో నినదించారు.
ఇవి సోషల్ మీడియా రోజులు
పట్టాభి అనే వ్యక్తి జాతీయ నేతలా ఎల్లో మీడియా జాకీలు వేసి లేపుతోందని, ఇవి ఎల్లో మీడియా రోజులు కావని.. సోషల్ మీడియా రోజులు అని ఆందోళనలో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా కార్యకర్తలు నినాదాలు చేశారు. ఎల్లో మీడియా అని ముద్దుగా పిలుచుకునే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, అనుబంధ సంస్థలు ప్రచురిస్తున్న, చూపుతున్న వార్తలు, కథనాలు చూస్తుంటే ఇంకా దిగజారిపోవడానికి వారికి మెట్లు ఏమీ లేవు అని నిరూపించుకున్నాయని మండిపడ్డారు.
చంద్రబాబు మాత్రమే బాగుండాలనేది రామోజీరావు సిద్ధాంతం.. రామోజీరావుకు వయసు పెరిగి.. బుద్ధి మందగించిందని గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ తూర్పారబ్టారు. కుట్రల రామోజీని బట్టలూడదీసి ప్రజల ముందు నిలబెడతామని మాజీ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరావు(నాని) హెచ్చరించారు. దుష్ప్రచారం చేసేటప్పుడు బ్యానర్ ఐటమ్స్.. సవరణకు మాత్రం సింగిల్ కాలమా? అని మాజీ మంత్రి కురసాల కన్నబాబు నిలదీశారు.
రామోజీ ఆరాటమే తప్ప.. చంద్రబాబుకు రాజకీయ భవిష్యత్ లేదని నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. సంబంధం లేని ఫొటోలను ప్రచురించి ప్రజలను మోసం చేయాలని ఈనాడు యాజమాన్యం కుట్ర చేసిందని, సోషల్ మీడియా దెబ్బకు దిగొచ్చిందని వైఎస్సార్‌సీపీ సీనియర్ శాసన సభ్యుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు చంద్రబాబు మాత్రం బాగుండాలనేది రామోజీరావు సిద్ధాంతమని పలువురు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు ధ్వజమెత్తారు.
ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలో ‘ఈనాడు’ ప్రతులను తగలబెడుతున్న స్థానికులు
పెల్లుబికిన ఆగ్రహం
అసత్యాలను ప్రచారం చేస్తున్న ఈనాడు పత్రికను బహిష్కరించాలని తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో వైఎస్సార్‌సీపీ శ్రేణులు పిలుపునిచ్చాయి. ఎక్కడికక్కడ ఈనాడు ప్రతులను దహనం చేశారు. వైఎస్సార్ జిల్లాలోని కడప, పులివెందుల, ప్రొద్దుటూరు, రైల్వేకోడూరు, తదితర పట్టణాల్లో ఈనాడు ప్రతులు కాల్చివేశారు. ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా నిరసన వెల్లువెత్తింది.
ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీడీ–5లను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. కళ్యాణదుర్గంలో రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి కేవీ ఉషశ్రీచరణ్ తన క్యాంపు కార్యాలయం ఎదుట ఈనాడు పత్రిక ప్రతులను దహనం చేశారు. కర్నూలు కలెక్టరేట్ ఎదుట పలువురు ఎమ్మెల్యేలు, ఇతర నేతల ఆధ్వర్యంలో ఈనాడు దినపత్రిక పత్రులను దహనం చేశారు.
అన్ని నియోజకవర్గాల్లో ర్యాలీలు నిర్వహించారు. ఒంగోలు, నెల్లూరు జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు పెద్ద ఎత్తున కొనసాగాయి. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఎమ్మెల్యేలతో కలిసి ఈనాడు పత్రిక ప్రతులను తగులబెట్టారు. వేమూరు నియోజకవర్గం చుండూరు మండలం వలివేరు గ్రామంలో మంత్రి మేరుగ నాగార్జున ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.
రామోజీరావు దిష్టి బొమ్మ దహనం
దేశంలో ఏ రాష్ట్రంలో అమలు కాని రీతిలో ఆంధ్రప్రదేశ్‌లో అట్టడుగు వర్గాలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పిస్తున్న జగన్‌మోహన్‌రెడ్డిపై, ఆయన ప్రభుత్వంపై ఈనాడు విషం చిమ్ముతుండటాన్ని ప్రజలు ఛీకొడుతున్నారని విజయవాడలో పలువురు నేతలు మండిపడ్డారు. రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.
తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రం వద్ద అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం రామోజీరావు దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆ మంటల్లో ఈనాడు ప్రతులను తగులబెట్టారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో ‘పచ్చ’రాతలపై వైఎస్సార్‌సీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. విషపు రాతలు రాస్తున్న ‘ఈనాడు’ పత్రికను వైఎస్సార్‌సీపీ శ్రేణులు బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు పెద్ద ఎత్తున సాగాయి. నిరసన కార్యక్రమాలతో విశాఖపట్నం జిల్లా దద్దరిల్లింది. ఇకనైనా నీచపు రాతలు మానుకోవాలని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు.. రామోజీకి హితవు పలికారు. ప్రభుత్వంపై కక్ష కట్టి ఈనాడు రాస్తున్న అబద్ధపు రాతలను శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా నేతలు ఖండిస్తూ నిరసన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment