సాక్షి, అమరావతి/కొరిటెపాడు (గుంటూరు): పొగాకు రైతుకు శుభవార్త. రికార్డు స్థాయిలో ధర పలుకుతున్న ప్రస్తుత తరుణంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఒత్తిడి ఫలితంగా పెనాల్టీ లేకుండా అదనపు ఉత్పత్తి కొనుగోలుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. 2022–23 సీజన్‌లో 81,635 హెక్టార్లలో సాగుకు, 142 మిలియన్ కిలోల పొగాకు కొనుగోలుకు పొగాకు బోర్డు అనుమతిచ్చింది. గతేడాది డిసెంబర్‌లో విరుచుకుపడిన మాండూస్ తుపాన్ కారణంగా సగానికిపైగా పొగాకు పంటతోపాటు శనగ, ఇతర పంటలు భారీగా దెబ్బతిన్నాయి.
2021–22లో కిలో పొగాకు గరిష్ఠంగా రూ.210కు పైగా పలికింది. దీంతో పంటలు దెబ్బతిన్న పొగాకు రైతులతో పాటు ఇతర రైతులు కూడా ప్రత్యామ్నాయం లేక పొగాకు సాగుకు మొగ్గు చూపారు. ఫలితంగా అనుమతికి మించి 85,763.50 హెక్టార్లలో పొగాకు సాగైంది. దీనికితోడు వాతావరణం కాస్త అనుకూలించడంతో హెక్టార్‌కు దిగుబడులు కూడా గణనీయంగా పెరిగాయి. రికార్డు స్థాయిలో 172 మిలియన్ కిలోల పొగాకు ఉత్పత్తి అయింది. చరిత్రలో ఇదే అత్యధిక దిగుబడి కావడం గమనార్హం.
మరోవైపు గతేడాది పొగాకుకు రికార్డు స్థాయి ధరలు పలికాయి. ప్రస్తుతం సగటున కిలో రూ.245 నుంచి రూ.281 వరకు పలుకుతున్నాయి. సాధారణంగా అనుమతికి మించి ఉత్పత్తి అయిన సందర్భాల్లో ప్రత్యేక పరిస్థితులుంటే 5 శాతం పెనా ల్టి తో కొనుగోలుకు కేంద్రం అనుమతి ఇస్తుంది. గతంలో కూడా ఇలా అనుమతి ఇచ్చిన సందర్భాలున్నాయి. ఈ ఏడాది రెండోసారి విత్తుకోవడం, పంటను కాపాడుకోవడానికి, అధిక దిగుబడులు సాధించేందుకు రైతులు పెట్టుబడులు ఎక్కువగా పెట్టాల్సి వచ్చింది.
అదనపు అ«దీకృత ఉత్పత్తికి పెనాల్టీ చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడితే తీవ్రంగా నష్టపోతామంటూ పొగాకు రైతులు రాష్ట్ర ప్రభుత్వానికి చేసిన విజ్ఞప్తి మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కేంద్ర వాణిజ్యపన్నుల శాఖమంత్రి పియూష్ గోయల్‌కు లేఖ రాశారు. కర్ణాటకలో వైపరీత్యాల వల్ల దెబ్బతిన్న పంట స్థానంలో రెండోసారి విత్తుకున్న సందర్భంలో పెనాల్టీ లేకుండా అదనపు ఉత్పత్తి విక్రయాలకు కేంద్రం అనుమతి ఇచ్చింది.
అదేరీతిలో రాష్ట్ర రైతులకు కూడా అనుమతినివ్వాలని సీఎం కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వాదేశాలతో పొగాకు బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ అద్దంకి శ్రీధర్‌బాబు బృందం ఢిల్లీ వెళ్లి పలుమార్లు సంప్రదింపులు జరిపింది. పెనాల్టీ లేకుండా అదనపు అ«దీకృత పొగాకు ఉత్పత్తి విక్రయాలకు కేంద్రం అనుమతి ఇచ్చేందుకు కృషిచేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి పొగాకు రైతులు కృతజ్ఞతలు తెలిపారు.
2022–23 పొగాకు పంట కాలానికి సంబంధించి రైతులు అదనంగా పండించిన వర్జీనియా పొగాకును, రిజిస్టర్ కాని అనధికారిక పొగాకును బోర్డు వేలం కేంద్రాల్లో అపరాధ రుసుం లేకుండా అమ్ముకోవడానికి అనుమతిస్తూ కేంద్ర వాణిజ్య, పరిశ్రమలశాఖ గెజిట్ విడుదల చేసిందని పొగాకు బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీధర్‌బాబు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులు సది్వనియోగం చేసుకోవాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment