![QR code on passbooks during Jagans tenure](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/111.jpg.webp?itok=jDZrOa56)
ఇప్పుడు దాన్ని తమ ఘనతగా చెప్పుకుంటున్న కూటమి ప్రభుత్వం
సాక్షి, అమరావతి: గత ప్రభుత్వ ఘనతను కూడా తన ఘనతగా చెప్పుకోవడానికి చంద్రబాబు ప్రభుత్వం ఏమాత్రం సంకోచించడం లేదు. భూముల రీసర్వే గురించి అబద్ధాలే సిగ్గుపడేలా దుష్ప్రచారం చేసి ఎన్నికల్లో లబ్ధి పొందిన చంద్రబాబు.. ఇప్పుడు ఆ రీ సర్వే ప్రక్రియను తన ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా రైతులకు ఇచ్చే పట్టాదారు పాస్ పుస్తకాల్లో క్యూఆర్ కోడ్ ముద్రించి ఇస్తామంటూ బిల్డప్ ఇస్తున్నారు. వాస్తవానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రీ సర్వేను నిలిపివేసింది.
అయితే దీనివల్ల ఒనగూరే ప్రయోజనాలు తెలియడం.. కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని చేసి తీరాలని స్పష్టం చేయడంతో విధి లేక కొనసాగిస్తోంది. అత్యంత పకడ్బందీగా భూముల కొత్త రికార్డులు తయారు చేసేందుకు.. ఏళ్ల తరబడి కొనసాగుతున్న భూ వివాదాలను పరిష్కరించేందుకు, భూ అక్రమాలకు తావు లేకుండా చేసేందుకు వైఎస్ జగన్ హయాంలో రీసర్వే మొదలుపెట్టారు. సర్వే పూర్తయిన గ్రామాల భూ రికార్డులను జగన్ ప్రభుత్వం జియో కో–ఆర్డినేట్స్ (అక్షాంశాలు, రేఖాంశాలు)తో జారీ చేసింది.
ప్రతి భూమికి ల్యాండ్ పార్సిల్ మ్యాప్, భూ హక్కు పత్రం, ప్రాపర్టీ పార్సిల్ మ్యాప్, ప్రతి గ్రామానికి రెవెన్యూ విలేజ్ మ్యాప్ ఇచ్చింది. ప్రతి భూ కమతానికి ఆధార్ నంబర్ మాదిరిగా ఒక విశిష్ట సంఖ్య(ఐడీ నంబర్) ఇవ్వడంతో పాటు క్యూఆర్ కోడ్ కేటాయించింది. పట్టాదారు పాస్ పుస్తకంలో పొందుపరిచే ఈ కోడ్‌ను స్కాన్ చేస్తే ఆ భూమికి సంబంధించిన అన్ని వివరాలు లభ్యమవుతాయి. దీనివల్ల వాటిని ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉండదు. భూ యజమానికి తెలియకుండా భూ రికార్డుల్లో మార్పు చేయడం అసాధ్యం.
డబుల్ రిజిస్ట్రేషన్లకు ఆస్కారం ఉండదు. సుమారు 8 వేల గ్రామాల్లో రీ సర్వే పూర్తి చేసి 30 లక్షల మందికి పైగా రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చింది. చంద్రబాబు ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఈ ప్రక్రియపై దారుణంగా విషం చిమ్మారు. కానీ, అధికారంలోకి రాగానే మళ్లీ రీ సర్వేను కొనసాగిస్తూ తన ఖాతాలో వేసుకునేందుకు తాపత్రయ పడుతుండటం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment