సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అమలుచేస్తున్న పలు ప్రజా సంక్షేమ పథకాలకు దురుద్దేశాలను ఆపాదించడంతో పాటు ఆ పథకాలవల్ల పలువురికి లబ్దిచేకూర్చేలా ప్రభుత్వ నిర్ణయాలు, విధానాలున్నాయని, వాటిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై హైకోర్టు తదుపరి విచారణను జనవరి 2కి వాయిదా వేసింది. ఈ వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న వారిలో నోటీసులు అందని వారికి వ్యక్తిగతంగా, ఈ–మెయిల్ ద్వారా నోటీసులు అందజేసేందుకు పిటిషనర్‌కు హైకోర్టు అనుమతినిచ్చింది.
ఈ పిల్‌పై అభ్యంతరాలు వ్యక్తంచేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) జవహర్‌రెడ్డి దాఖలు చేసిన కౌంటర్‌కు తదుపరి విచారణ నాటికి బదులివ్వాలని రఘురామకృష్ణరాజును ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావు, జస్టిస్ మండవ కిరణ్మయి ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. అంతకుముందు.. రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిల్ గురువారం మరోసారి విచారణకు రాగా, రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్. శ్రీరామ్ ఈ పిల్‌పై అభ్యంతరం తెలుపుతూ సీఎస్ ప్రాథమిక కౌంటర్ దాఖలు చేశారని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు.
అనంతరం.. ధర్మాసనం ఈ వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న 41 మందిలో ఎంతమందికి నోటీసులు అందాయి? ఎంతమందికి నోటీసులు అందలేదన్న విషయం గురించి ఆరాతీసి నోటీసులు అందని వారికి వ్యక్తిగతంగా నోటీసులు అందచేసేందుకు పిటిషనర్‌కు అనుమతినిచ్చింది. తదుపరి విచారణను జనవరి 2కి వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీచేసింది.
సీఎం, ప్రభుత్వంపై రోజూ విషం..
ఎంపీ రఘురామకృష్ణరాజు ఎల్లో మీడియా ద్వారా సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో పాటు రాష్ట్ర ప్రభుత్వంపై నిత్యం విషం చిమ్మడమే పనిగా పెట్టుకున్నారని సీఎస్ తన ప్రాథమిక కౌంటర్‌లో హైకోర్టుకు నివేదించారు. ఎలాంటి వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాలను ఆశించి ఈ పిల్ దాఖలు చేయలేదని రఘురామకృష్ణరాజు తన పిటిషన్‌లో పేర్కొన్నప్పటికీ ఆయన ప్రతీరోజూ వ్యక్తిగత వైరంతోనే మీడియా ముందు సీఎంతో పాటు ప్రభుత్వంపై విషం కక్కుతున్నారని సీఎస్ పేర్కొన్నారు. అందుకు సంబంధించి ముఖ్యమంత్రిపై రఘురామకృష్ణరాజు ఎల్లో మీడియా ఛానెళ్లలో మాట్లాడిన మాటలను జవహర్‌రెడ్డి తన అఫిడవిట్‌లో పొందుపరిచారు.
కోర్టులో ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ చేసిన వాదనలను కూడా తప్పుపట్టారన్నారు. వీటిని పరిశీలించి ముఖ్యమంత్రి, ప్రభుత్వంపట్ల పిటిషనర్ తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవాలని జవహర్‌రెడ్డి తన అఫిడవిట్‌లో కోర్టును కోరారు. మీడియాలో ఆయన మాట్లాడిన మాటలను బట్టి ప్రచారం కోసమే ఆయన ఈ పిల్ దాఖలు చేసినట్లు స్పష్టంగా తెలుస్తోందన్నారు. మీడియాతో మాట్లాడే సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి, ఆయన కుటుంబ సభ్యులపై కూడా అసభ్యపదజాలం వాడారని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి శరీరాకృతి గురించి.. మంత్రులు, కార్యదర్శులు, ఇతర అధికారులు, అదనపు అడ్వొకేట్ జనరల్ గురించి ఆయన మాట్లాడిన మాటలన్నీ ప్రజాబాహుళ్యంలో ఉన్నాయన్నారు.
నిజానికి.. బ్యాంకును మోసం చేసిన కేసులో రఘురామకృష్ణరాజుపై సీబీఐ కేసు నమోదు చేసిందని సీఎస్ అందులో గుర్తుచేశారు. ఇక పిటిషనర్ దాఖలు చేసిన పిల్ అసలు హైకోర్టు నిబంధనలకు అనుగుణంగాలేదని, అందువల్ల ఇది పిల్ నిర్వచన పరిధిలోకి రాదన్నారు. వ్యక్తిగత వైరంతోనే ఆయన ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారని వివరించారు. ఈ వ్యాజ్యం దాఖలు వెనుక రఘురామకృష్ణరాజు ఉద్దేశాలను పరిగణనలోకి తీసుకుని దీనిని కొట్టేయాలని ఆయన కోర్టును కోరారు.
Comments
Please login to add a commentAdd a comment