సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు ప్రజా సంక్షేమ పథకాలకు దురుద్దేశాలను ఆపాదిస్తూ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు హైకోర్టును ఆశ్రయించారు. సంక్షేమ పథకాల్లో అక్రమాలు జరిగాయని, పలువురికి లబ్ధి చేకూర్చేలా ప్రభుత్వ నిర్ణయాలు, విధానాలున్నాయని, వాటిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై హైకోర్టు గురువారం విచారణ జరిపింది.
ఈ వ్యాజ్యంలో ముఖ్యమంత్రి జగన్, ఎంపీ వి.విజయసాయిరెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి , మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తదితరులను వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా చేయడంపై అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ తీవ్ర అభ్యంతరం తెలిపారు. దురుద్దేశాలతోనే వీరందరినీ వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా చేర్చారని నివేదించారు.
ప్రభుత్వంపై, రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారిపై రఘురామ విషం చిమ్మడమే ఏకైక లక్ష్యంగా పెట్టుకున్నారని తెలిపారు. వ్యక్తిగత కక్షతోనే ఆయన ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారన్నారు. సంక్షేమ పథకాలు, ప్రభుత్వ విధానాలు, నిర్ణయాలను తప్పుబడుతూ వ్యాజ్యం దాఖలు చేస్తున్నట్లు పేర్కొన్న రఘురామ అందులో సంబంధం లేని వారిని వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా చేర్చారన్నారు. ఈ పిల్ దాఖలు చేసిన తరువాత సీఎంను వదిలేదిలేదంటూ మీడియా సమావేశాలు నిర్వహించి ప్రకటనలు చేశారని నివేదించారు.
అందుకు అనుమతించొద్దు
ప్రజా ప్రయోజనం పేరుతో వ్యాజ్యం దాఖలు చేసిన రఘురామ వాస్తవాలను కోర్టు ముందు ఉంచలేదని అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ తెలిపారు. తనకు సంబంధించిన అన్ని విషయాలను పిల్‌లో పేర్కొన్నట్లు డిక్లరేషన్ ఇచ్చిన రఘురామ వాస్తవానికి పలు కీలక విషయాలను తొక్కిపెట్టారన్నారు.
ఆయన చైర్మన్, ఎండీగా వ్యవహరించిన కంపెనీ పలు రుణ సంస్థలకు రూ.700 కోట్లకు పైగా రుణాలను ఎగవేసిందన్నారు. పిటిషనర్ సీబీఐ కేసు కూడా ఎదుర్కొంటున్నారని శ్రీరామ్ కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ వివరాలను ఆయన వ్యాజ్యంలో పేర్కొనలేదన్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండటంతో రఘురామపై నిబంధనల ప్రకారం అనర్హత వేటు వేయాలంటూ లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు అందిన విషయాన్ని కూడా దాచి పెట్టారని తెలిపారు.
వ్యక్తిగత, రాజకీయ అజెండాతో..
వ్యక్తిగత, రాజకీయ అజెండాతో రఘురామ ముందుకెళుతున్నారని, అందుకు ఈ వ్యాజ్యమే ఉదాహరణ అని పేర్కొన్నారు. రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారిపై విషం చిమ్మేందుకు కోర్టులను వేదికగా చేసుకుంటున్నారని తెలిపారు. ఇందుకు ఎంత మాత్రం అనుమతించొద్దని కోర్టును ఏజీ అభ్యర్థించారు. ఈ వ్యాజ్యం విచారణార్హతపై తమకు అభ్యంతరం ఉందన్నారు.
ఈ వ్యాజ్యంపై విచారణ జరిపే ముందు రఘురామకృష్ణరాజు దురుద్దేశాలను, ఆయనకెంత విశ్వసనీయత ఉందో పరిశీలించాలని కోరారు. ముందు దీన్ని తేల్చిన తరువాతే ఈ వ్యాజ్యంలో తదుపరి విచారణను చేపట్టాలన్నారు. పిల్ నిబంధనల ప్రకారం ప్రతివాదుల జాబితా నుంచి ఎవరినైనా తొలగించే అధికారం ధర్మాసనానికి ఉందన్నారు. ఆ విచక్షణాధికారాన్ని ఇప్పుడు వినియోగించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా ఉన్న వారిని ప్రతివాదుల జాబితా నుంచి తొలగించవచ్చన్నారు. అంతేకాక వారికి నోటీసులు కూడా అవసరం లేదన్నారు.
ముందు విచారణార్హతపై తేలుస్తాం..
వాదనలు విన్న హైకోర్టు తొలుత రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన ఈ వ్యాజ్యం విచారణార్హతపై తేలుస్తామని స్పష్టం చేసింది. ఆ తరువాతే తదుపరి ప్రక్రియ చేపడతామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రతివాదులందరూ విచారణార్హతపై అభ్యంతరాలు తెలియచేయాలని, అందువల్ల వారందరికీ నోటీసులు జారీ చేస్తామని తెలిపింది. రేపు ఎవరూ తమకు వాదనలు వినిపించే అవకాశం రాలేదని అనకూడదని పేర్కొంది. న్యాయ ప్రయోజనాల నిమిత్తం అందరికీ నోటీసులు జారీ చేస్తున్నామంది. నోటీసులు జారీ చేయడం అందరికీ మంచిదని హైకోర్టు స్పష్టం చేసింది.
పలువురికి నోటీసులు జారీ...
ఈమేరకు వ్యక్తిగత ప్రతివాదులుగా ఉన్న ముఖ్యమంత్రి జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డిలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పలు కంపెనీలకు, డైరెక్టర్లకు కూడా నోటీసులు ఇచ్చింది. సీబీఐ డైరెక్టర్, కేంద్ర హోంశాఖ కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్థిక, రెవెన్యూ, గనులు, పరిశ్రమలు, సమాచార పౌర సంబంధాలు, వైద్య, ఆరోగ్య శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులకు సైతం నోటీసులు జారీ చేసింది.
మొత్తం 41 మందికి నోటీసులు ఇచ్చిన హైకోర్టు వారందరినీ రఘురామకృష్ణరాజు వ్యాజ్యం విచారణార్హతపై అభ్యంతరాలను తెలియచేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను డిసెంబర్ 14కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావు, జస్టిస్ మండవ కిరణ్మయి ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
మధ్యంతర ఉత్తర్వులు సాధ్యం కాదు..
మధ్యంతర ఉత్తర్వుల కోసం తాము అనుబంధ పిటిషన్ దాఖలు చేశామని, దాన్ని అనుమతించాలని రఘురామకృష్ణరాజు తరఫు సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధరరావు కోరారు. ఇసుక, మద్యం పాలసీలకు సంబంధించిన రికార్డులను జాగ్రత్త చేసేలా ఆదేశాలు జారీ చేయాలని అభ్యర్థించారు. ఆ పాలసీలకు సంబంధించిన రికార్డులను ధ్వంసం చేస్తున్నారని, వాటిని సీజ్ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ ప్రభుత్వ హయాంలో కోర్టులో రికార్డులను మాయం చేసిన ఘటన కూడా చోటు చేసుకుందని వ్యాఖ్యలు చేయడంపై అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ తీవ్ర అభ్యంతరం తెలిపారు.
కోర్టులో రికార్డులు మాయం అయిన ఘటనను ప్రభుత్వానికి ఆపాదించడం తగదన్నారు. ఇలా ఏదిపడితే అది మాట్లాడితే తాము కూడా అదే విధంగా మాట్లాడాల్సి వస్తుందన్నారు. ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం సాధ్యం కాదని తేల్చి చెప్పింది. ప్రతివాదులకు తాము వ్యక్తిగతంగా నోటీసులు అందచేసేందుకు అనుమతినివ్వాలని మురళీధరరావు కోరగా అందుకు ధర్మాసనం నిరాకరించింది. హైకోర్టు రిజిస్ట్రీనే నోటీసులు పంపుతుందని తేల్చి చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment