తడిసి ముద్దవుతున్న శ్రీవారి ఆలయం
మహారాణిపేట (విశాఖ దక్షిణ): తమిళనాడు, శ్రీలంక పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం కొమరిన్, ఉత్తర శ్రీలంక పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఉంది. దీనికి అనుబంధంగా విస్తరించిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది రాగల 48 గంటల్లో ఆగ్నేయ అరేబియా సముద్ర ప్రాంతానికి ప్రవేశించి పశ్చిమ దిశగా ప్రయాణించే అవకాశం ఉంది. ఆ తరువాత 48 గంటల్లో ఉత్తర వాయువ్యంగా ప్రయాణించి మరింత బలపడుతుందని వాతావరణ కేంద్రం ప్రకటించింది.
కొమరిన్, ఉత్తర శ్రీలంక పరిసర ప్రాంతాల నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దక్షిణ కోస్తాంధ్ర తీరం వరకు మన్నార్ గల్ఫ్, తమిళనాడు తీర ప్రాంతం మీదుగా సముద్ర మట్టం వద్ద ఉపరితల ద్రోణి వ్యాపించి ఉంది. ఈ ప్రభావం వల్ల రానున్న 48 గంటల్లో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. కాగా, తిరుమలలో సోమవారం వేకువజాము నుంచి మధ్యాహ్నం వరకు కుండపోత వర్షం కురిసింది. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో తిరుమలలోని జలాశయాలలో నీటిమట్టం పెరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment