అర్చకుల భవన్‌లో మాట్లాడుతున్న శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు
తిరుమల: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కారణజన్ముడిలా ధర్మసంస్థాపన కోసం సనాతన ధర్మాన్ని కాపాడారని తిరుమల శ్రీవారి ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు ఏవీ రమణదీక్షితులు చెప్పారు. ధర్మాన్ని భగవంతుడు రక్షించినట్లుగా అర్చకుల వంశపారంపర్యాన్ని ముఖ్యమంత్రి పునరుద్ధరించారన్నారు. వైఎస్ జగన్ హిందూ దేవాలయాలు, ప్రాచీన దేవాలయాల ప్రతిష్ట కాపాడతారని, ఆలయాలకు పునర్‌వైభవం కల్పిస్తారని నమ్మకం కలిగిందని చెప్పారు. విశ్రాంత అర్చకులను పునర్నియమించడంపై తిరుమలలోని అర్చక భవన్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. వంశపారంపర్య అర్చకుల కోసం దివంగతనేత వైఎస్ రాజశేఖరరెడ్డి దూరదృష్టితో చేసిన చట్టసవరణను తిరిగి ఆయన తనయుడు అమలు చేయడం, మళ్లీ స్వామి సేవ చేసుకునే మహద్భాగ్యం కల్పించడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు. 2018లో చట్ట, రాజ్యాంగ విరుద్ధంగా అప్పటి ప్రభుత్వం మిరాశి అర్చకులను వయోపరిమితి పేరుతో పదవీవిరమణ చేసి బాధపెట్టిందన్నారు. వంశపారంపర్యంగా వస్తున్న అర్చకత్వ హక్కులను గత ప్రభుత్వం కాలరాయడంతో అర్చకులు చాలా నష్టపోయారని తెలిపారు. దీనిద్వారా చాలా ఆలయాలు మూతపడ్డాయని, దేవుళ్లకు ఆరాధనలు కరువయ్యాయని చెప్పారు.
ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని, ఇప్పుడు ఆ హామీని నిలబెట్టుకున్నారని తెలిపారు. హైకోర్టులో వేసిన పిటిషన్‌పై జస్టిస్ రామచంద్రరావు తీర్పు మేరకు విధుల్లోకి తీసుకోవాలని సూచించారని తెలిపారు. అప్పటి ప్రభుత్వంలో పాలకమండలి తీసుకున్న 50వ తీర్మానాన్ని కోర్టు రద్దుచేసిందని తెలిపారు. సాంకేతిక కారణాల వల్ల అర్చకులకు వయోపరిమితి నిబంధనల సడలింపు ఆలస్యమైందన్నారు. శ్రీవారిని, దేవాలయాలను, అర్చకుల కుటుంబాలను ఈ మధ్య రాజకీయాలకు వాడుకోవడం దురదృష్టకరమన్నారు. రాజకీయాలకు, తమకు సంబంధం లేదని, అలా వాడుకునేవారు ఉంటే తమ విజ్ఞప్తిని స్వీకరించాలని పేర్కొన్నారు. అర్చకుల పునర్నియామకానికి కృషిచేసిన టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్‌రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి, ఎమ్మెల్యే కరుణాకరరెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ఆయన చెప్పారు. ఈ సమావేశంలో నాలుగు కుటుంబాలకు చెందిన అర్చకులు నరసింహదీక్షితులు, వెంకటదీక్షితులు, శ్రీనివాసదీక్షితులు, అర్చకులు పాల్గొన్నారు.
మొన్న సన్నిధి గొల్ల.. నేడు విశ్రాంత అర్చకులు
మొన్న సన్నిధి గొల్ల.. నేడు విశ్రాంత అర్చకులు.. వారికి జీవితాంతం శ్రీవారికి సేవచేసే భాగ్యం రాష్ట్ర ప్రభుత్వం కల్పించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. సుదీర్ఘకాలంగా పరిష్కారం కాని సమస్యలను వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక పరిష్కరిస్తుండటంతో ఆయా వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. తిరుమల శ్రీవారిని మొదటగా దర్శనం చేసుకునే యాదవులకు సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం వంశపారంపర్య హక్కు కల్పించింది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో తొలగించిన అర్చకులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తిరిగి తీసుకుంటూ.. వారికి వారసత్వ హక్కు కల్పించారు. అర్చకులకు వయోపరిమితి నిబంధనను ఎత్తేశారు.
వైఎస్ మరణానంతరం రద్దు
శ్రీవారి ఆలయానికి సంబంధించి 1987లో మిరాశీ వ్యవస్థను రద్దుచేశారు. అప్పటి నుంచి వంశపారంపర్య హక్కుల కోసం అర్చకులు పోరాడుతున్నారు. 1996లో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వీరిని తిరిగి ఆలయ అర్చకులుగా నియమించినా.. వారికి పూర్తిస్థాయిలో హక్కులు కల్పించలేదు. అర్చకులకు వంశపారంపర్య హక్కు కల్పించాలంటూ మహానేత, నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన వైఎస్ రాజశేఖరరెడ్డి తిరుమలలోని అర్చకులతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆలయాల్లో అర్చకులుగా పనిచేస్తున్న వారందరికి వంశపారంపర్య హక్కులు కల్పిస్తూ 2007లో జీవో నంబరు 34 జారీచేశారు. మహానేత మరణానంతరం కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం 2012లో అర్చకులకు వయోపరిమితి విధించింది. శ్రీవారి ఆలయంలో 65 సంవత్సరాలు పైబడిన అర్చకులకు ఈ నిబంధనలను అమలు చేయాలని ఆదేశించింది. అర్చకుల అభ్యర్థన మేరకు ఆ నిర్ణయాన్ని రద్దు చేసినప్పటికీ 2018 మే 16న చంద్రబాబు ప్రభుత్వం మరోసారి వయోపరిమితి నిబంధన అమలు చేయాలని నిర్ణయించింది. శ్రీవారి ఆలయంలోని ప్రధాన అర్చకులు నలుగురితోపాటు మరో ఐదుగురు అర్చకులు, గోవిందరాజస్వామి ఆలయం అర్చకుడు, తిరుచానూరు ఆలయానికి చెందిన ఇద్దరు అర్చకులను వయోపరిమితి నిబంధనతో తొలగించింది.
నాడు మాట ఇచ్చారు.. నేడు అమలు చేశారు
గత ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఇద్దరు అర్చకులు కోర్టును ఆశ్రయించారు. 2018 డిసెంబర్‌లో అర్చకులకు అనుకూలంగా వచ్చిన తీర్పును చంద్రబాబు ప్రభుత్వం అమలు చేయలేదు. ఈ విషయాన్ని రమణదీక్షితులు, ఇతర అర్చకులు నాటి ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. తమ ప్రభుతం వచ్చిన వెంటనే సమస్యను పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అర్చకులకు వయసుతో సంబంధం లేకుండా శ్రీవారికి సేవచేసే అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. 2019 డిసెంబర్‌లో రమణదీక్షితుల్ని శ్రీవారి ఆలయ ఆగమ సలహాదారుడిగా, గౌరవ ప్రధాన అర్చకులుగా సీఎం వైఎస్ జగన్ నియమించారు. బ్రహ్మోత్సవాల సమయంలో స్వామికి పట్టువస్త్రాలు సమర్పించడానికి వచ్చిన సీఎంను కలుసుకున్న రమణదీక్షితులు అర్చకుల సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్.. రమణదీక్షితులు సహా రిటైర్ అయిన వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని టీటీడీని ఆదేశించారు.
సీఎంకు రుణపడి ఉన్నాం
మా తాతలు, మా తండ్రి చేసిన వంశపారంపర్య అర్చకత్వాన్ని తిరిగి మాకు కల్పించినందుకు సీఎంకు రుణపడి ఉన్నాం. స్వామికి సేవ చేయడమే మా భావన. రాజులను, చక్రవర్తులను మా వంశీకులందరూ చూశారు. మా కుటుంబం కూడా అదే తరహాలో ముందుకు వెళ్లాలని మా తపన. తిరిగి మా హక్కులను మాకు కల్పించినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.
– నరసింహదీక్షితులు, మాజీ ప్రధాన అర్చకులు (తిరిగి విధుల్లోకి చేరబోయే అర్చకులు)
Comments
Please login to add a commentAdd a comment