రామోజీ ఆర్థిక ఉగ్రవాదే కాదు.. దేశద్రోహి కూడా! | Sakshi
Sakshi News home page

రామోజీ ఆర్థిక ఉగ్రవాదే కాదు.. దేశద్రోహి కూడా!

Published Sat, Apr 13 2024 4:16 AM

Ramoji cheated JJ Reddys family - Sakshi

విదేశాల నుంచి అక్రమ పెట్టుబడులతోనే రామోజీ వ్యాపార సామ్రాజ్యం 

మార్గదర్శి, ఈనాడు, డాల్ఫిన్‌ హోటల్స్‌లో జీజే రెడ్డి పెట్టుబడులు!  

ఆ నిధులన్నీ విదేశాల నుంచి అక్రమంగా తెచ్చినట్లు వెల్లడి 

అప్పట్లోనే జీజే రెడ్డిపై దేశద్రోహం కేసు 

దేశం విడిచి పారిపోయిన జీజే రెడ్డి 

ఆయన ఆస్తులు స్వా«దీనం చేసుకొన్న కేంద్ర ప్రభుత్వం 

ఆయన పేరిట మార్గదర్శిలో ఉన్న షేర్లను అప్పగించని రామోజీ 

వాటిని తన కుటుంబంపేరిట బదిలీ చేసుకున్న రామోజీ 

విభ్రాంతి కలిగిస్తున్న రామోజీ అవినీతి విరాట్‌ స్వరూపం 

సాక్షి, అమరావతి: ఈనాడు రామోజీరావు ఆర్థిక ఉగ్రవాదే కాదు.. దేశ ద్రోహి కూడా అన్న విషయం బయటపడింది. ఏడు దశాబ్దాలుగా ఆయన సాగిస్తున్న ఆర్థిక అక్రమాల వెనుక దేశ ద్రోహం వంటి తీవ్రమైన నేరాలు కూడా ఉండటం సంచలనంగా మారింది. విదేశాల నుంచి అక్రమంగా తెచ్చిన నిధులే పునాదిగా రామోజీ వ్యాపార సామ్రాజ్యం విస్తరించిందన్న విషయం వెలుగులోకి వచ్చింది. మార్గదర్శి చిట్‌ఫండ్స్, ఈనాడు, డాల్ఫిన్‌ హోటల్స్‌ ఇలా అన్నింటిలోనూ అక్రమ పెట్టుబడులు, ఆర్థిక మోసాల దందా  దాగుందన్నది స్పష్టమైంది. 

రామోజీ దేశద్రోహం 
అనంతర కాలంలో జీజే రెడ్డిపై దేశద్రోహం కేసు నమోదైంది. దాంతో ఆయన దేశం విడిచి పారిపోయారు. కానీ ఈ కేసు విషయంలో ఆయన ప్రధాన ప్రమోటర్‌గా ఉన్న మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ను మాత్రం కేంద్ర ప్రభుత్వం విచారించకపోవడం గమనార్హం.  జీజే రెడ్డి దేశం విడిచి పారిపోయిన తరువాత ఆయన ఆస్తులను కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.

కానీ, మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో ఆయన పేరిట ఉన్న 288 షేర్లను రామోజీరావు కేంద్ర ప్రభుత్వానికి సరెండర్‌ చేయలేదు. చట్టానికి వ్యతిరేకంగా తన వద్దే అట్టిపెట్టుకున్నారు. అది తీవ్రమైన దేశ ద్రోహ నేరం. అంతేకాదు జీజే రెడ్డి దేశం విడిచిపారిపోవడానికి రామోజీ సహాయం చేశారని కూడా అప్పటి పరిణామాలను నిశితంగా పరిశీలించిన వారు చెబుతుండటం గమనార్హం. ఆ కేసులో ఇతర నిందితులు ఈమేరకు వాంగ్మూలం ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.  

ఈనాడు, డాల్ఫిన్‌ హోటల్స్‌లోనూ జీజే రెడ్డి పెట్టుబడులు! 
రామోజీరావు ప్రధాన వ్యాపార సంస్థలైన ఈనాడు పత్రిక, డాల్ఫిన్‌ హోటల్స్‌లోనూ జీజే రెడ్డి పెట్టుబడులు పెట్టారని బలమైన వాదన ఉంది. జీజే రెడ్డి 1963లోనే రామోజీరావుతో ఎలైట్‌ అనే ఇంగ్లిష్‌ పత్రికను పెట్టించారని, ఆ తర్వాత ఈనాడు పత్రిక ప్రారంభానికి కూడా ఆయన పెట్టుబడి పెట్టారని ఆనాటి ఈనాడు సంస్థ ఉద్యోగులే చెప్పడం గమనార్హం.

కమ్యూనిస్టు కార్డును ఉపయోగించి రష్యా నుంచి ప్రింటింగ్‌ యంత్రాలు తెప్పించి ఈనాడు పత్రికను ప్రారంభించడంలో జీజే రెడ్డి కీలకంగా వ్యవహరించారు. ఈనాడు స్థాపన సమయంలో పెట్టుబడులపై కూపీ లాగితే విదేశాల నుంచి అక్రమ నిధుల బాగోతం బయటపడుతుంది. 1960లలో రష్యా నుంచి తెచ్చిన నిధులను ఈనాడు, డాల్ఫిన్‌ సంస్థల్లో పెట్టుబడిగా పెట్టారనే ఆరోపణలు ఉన్నాయి.

రష్యా నుంచి అక్రమంగా నిధుల తరలింపు విషయంలో జీజే రెడ్డిపై అప్పటి కేంద్ర ప్రభుత్వం దేశ ద్రోహ నేరం కింద కేసు పెట్టింది. అలా అక్రమ నిధులు పెట్టుబడిగా పెట్టిన ఈనాడు, డాల్ఫిన్‌ హోటల్స్, వాటి యజమాని రామోజీరావుపైనా దేశ ద్రోహ నేరం నమోదు చేయాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.  

రామోజీ వాటా 100 షేర్లే... జీజే రెడ్డి పేరిట 288 షేర్లు 
మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ చైర్మన్‌ చెరుకూరి రామోజీరావు. ఆ సంస్థపై సర్వాధికారాలు ఆయన కుటుంబానివేనని అందరూ  భావిస్తారు. కానీ అసలు మార్గదర్శి సంస్థను ఏర్పాటు చేసిందే రామోజీ స్నేహితుడు  జీజే రెడ్డి అని, దానిని ఏర్పాటు చేసే నాటికి రామోజీరావు షేర్లకంటే జీజేరెడ్డి షేర్లు చాలా రెట్లు ఎక్కువ అనే విషయాన్ని ఇన్నాళ్లూ గోప్యంగా ఉంచారు.

1960ల నాటికే జీజే రెడ్డి ఢిల్లీలో బాగా పరపతి  ఉన్న వ్యక్తిగా గుర్తింపు పొందారు. కొండపల్లి  సీతారామయ్య సిఫార్సుతో ఆయన  రామోజీరావుకు తన సంస్థలో గుమస్తాగా ఉద్యోగం ఇచ్చారు. అనంతరం వారిద్దరూ కలిసి 1962లో మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ను స్థాపించారు. ఆ  సంస్థకు జీజే రెడ్డి ప్రధాన ప్రమోటర్‌.

1962 ఆగస్టు 31 నాటికి  హైదరాబాద్‌లోని రిజిస్ట్రార్ ఆఫ్‌ కంపెనీస్‌ రికార్డుల ప్రకారం రామోజీరావు ప్రారంభ వాటా కేవలం రూ.10 మాత్రమే. ఆయన సోదరుడు విశ్వనాథం పేరిట మరో వాటా ఉంది. ఇక 1960–70లలో మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో రామోజీరావు పేరిట ఉన్నవి కేవలం 100 షేర్లు మాత్రమే. కానీ జీజే రెడ్డి పేరిట 288 షేర్లు ఉండటం విశేషం. అంటే మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో ప్రధాన వాటాదారు జీజే రెడ్డే. 

జీజే రెడ్డి కుటుంబాన్ని మోసం చేసిన రామోజీ 
1986లో జీజే రెడ్డి మరణానంతరం ఆయన ఇద్దరు కుమారులు తమ తండ్రి పేరిట ఉన్న 288 షేర్ల వాటాను తమ పేరిట బదిలీ చేయమని కోరితే రామోజీ ససేమిరా అన్నారు. జీజే రెడ్డి ఇద్దరు కుమారులు యూరి రెడ్డి, మార్టిన్‌ రెడ్డిలను తుపాకితో బెదిరించారు. జీజే రెడ్డి పేరిట ఉన్న 288 షేర్లను ఫోర్జరీ సంతకాలతో తన కోడలు శైలజ కిరణ్‌ పేరిట బదిలీ చేశారు. దీనిపై ఆయన కుమారులు ఇచ్చిన ఫిర్యాదుతో సీఐడీ కేసు నమోదు చేసింది. మరోవైపు జీజే రెడ్డి  కుటుంబం తమ వాటా షేర్ల కోసం న్యాయ పోరాటం కూడా చేస్తోంది.  

Advertisement
 
Advertisement