Ramoji Rao And Yellow Media Fake News On YS Jagan Govt - Sakshi
Sakshi News home page

ఏది నిజం?: ప్రాజెక్టులు పూర్తవుతుంటే ఎందుకంత కుళ్లు రామోజీ?

Published Wed, Jan 18 2023 2:07 AM | Last Updated on Wed, Jan 18 2023 11:17 AM

Ramoji Rao Yellow Media Fake News On YS Jagan Govt - Sakshi

అధికారంలో చంద్రబాబు తప్ప వేరెవరైనా ఉంటే..? ఆ ప్రభుత్వం చేసే మంచిపనులేవీ రామోజీరావుకు కనిపించవు. చంద్రబాబు గనక ఉంటే... ఆయనెంత దుర్మార్గం చేసినా అస్సలు కనిపించదు. అదే తన మార్కు పాత్రికేయమని ఆయన పదేపదే నిరూపిస్తున్నారు. మంగళవారం నాడు ‘ప్రాజెక్టులకు పైసల్లేవు’ అంటూ అచ్చేసిన కథనమూ అలాంటిదే. ఎందుకంటే చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పుడు కేవలం రూ.17,368 కోట్లతోనే 40 జలయజ్ఞం ప్రాజెక్టులను పూర్తి చేస్తానని ప్రకటించారు. అంతకు రెండున్నర రెట్లు అధికంగా ఖర్చు చేసినా ఒక్క ప్రాజెక్టూ పూర్తి చేయలేకపోయారు. ఒక్క ఎకరాకూ కొత్తగా నీళ్లందించలేకపోయారు. కానీ రామోజీరావు ఎప్పుడూ దీన్ని ప్రశ్నించలేదు. ఎందుకంటే అప్పుడు డీపీటీ (దోచుకో– పంచుకో– తినుకో) పద్ధతిలో బాబు దోచుకున్నదాంట్లో తన వాటా భేషుగ్గా అందేసింది. కానీ ఇప్పుడు అలాంటిదేమీ లేదు. ఖర్చుపెట్టే ప్రతి పైసాకూ తగ్గ ప్రతిఫలం రైతుకు దక్కాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆలోచిస్తున్నారు. అది బాబుకే కాదు. ఎల్లో ముఠాలో ఎవ్వరికీ సుతరామూ నచ్చటం లేదు. అందుకే ఈ రాతలు. అసలీ రాతల్లో నిజమెంత? కొంతైనా ఉందా? చూద్దాం...

వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టాక నీటిపారుదల ప్రాజెక్టుల పనుల్లో టీడీపీ ప్రభుత్వ అవినీతిని ప్రక్షాళన చేసి.. జ్యుడిషియల్‌ ప్రివ్యూ, రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా పారదర్శకత తెచ్చారు. రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా పోలవరంలో ఏకంగా రూ.865 కోట్లు ఆదా చేశారు. అన్ని ప్రాజెక్టుల్లోనూ రివర్స్‌ టెండరింగ్‌ వల్ల రూ.2,090 కోట్లు ఆదా అయింది. కానీ కరోనా మహమ్మారి విజృంభణతో రెండేళ్లు ప్రాజెక్టుల పనులపై ప్రతికూల ప్రభావం పడింది. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలతోపాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితీ దెబ్బతింది.

అయినా సరే.. నీటిపారుదల రంగానికి అత్యధిక ప్రాధాన్య­మిస్తూ.. పెట్టే ప్రతి పైసా ప్రతిఫలం రైతు­లకు దక్కేలా ప్రణాళికాయుతంగా సీఎం వైఎస్‌ జగన్‌ ప్రాజెక్టులను పూర్తి చేయిస్తున్నారు. ఇప్పటి­దాకా రూ.23,289 కోట్లను ప్రాజెక్టుల పనులకు ఖర్చు చేసి.. కొత్తగా 1,03,692 ఎకరాలకు సాగు­నీరు అందించారు. 4,84,500 ఎకరాల ఆయక­ట్టును స్థిరీకరించారు. 2019, 2020, 2021, 2022­లలో ప్రతి ఏటా ఖరీఫ్, రబీలలో కోటి ఎకరాల చొప్పున ఆయకట్టుకు నీళ్లందించి చరిత్ర సృష్టించారు. కాకపోతే ఇవేవీ రామోజీ కళ్లకు కన్పించవు. ఎందుకంటే.. అధికారంలో ఉన్నది వైఎస్‌ జగన్‌ కాబట్టి!. తమ డీపీటీకి అడ్డుకట్ట పడింది కాబట్టి!!.

మహోజ్వల ఘట్టం కన్పించలేదా?
పెన్నా డెల్టాకు జీవనాడుల్లాంటి మేకపాటి గౌతమ్‌­రెడ్డి సంగం, నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి నెల్లూరు బ్యారేజ్‌ పనులను దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి చేపట్టారు. 2014–19 మధ్య అధికారంలో ఉన్న చంద్రబాబు వాటిని పూర్తి చేయలేకపోయారు. వైఎస్‌ జగన్‌ వాటిని యుద్ధప్రాతిపదికన పూర్తి చేయించి గత సెప్టెంబరు 6న జాతికి అంకితం చేశారు. తండ్రి చేపట్టిన రెండు బ్యారేజ్‌లను తనయుడు పూర్తి చేసి, జాతికి అంకితం చేయడం నీటిపారుదల రంగ చరిత్రలో మహోజ్వల ఘట్ట­మని రైతులు, నిపుణులు ప్రశంసించారు. కానీ.. ఇది రామోజీకి కన్పించకపోవడం దురదృష్టకరం.


కళ్లుండి చూడలేకపోతే ఎలా..? 
► గాలేరు–నగరి సుజల స్రవంతి పథకంలో అంతర్భాగమైన అవుకు రెండో సొరంగంలో 160 మీటర్ల పొడవున ఫాల్ట్‌ జోన్‌లో ఐదేళ్లపాటు పనులు చేయలేక చంద్రబాబు చేతులెత్తేశారు. సీఎం వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చాక.. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఆ సొరంగాన్ని పూర్తి చేయించారు. శ్రీశైలానికి వరద వచ్చిన వెంటనే ప్రస్తుత డిజైన్‌ మేరకు గాలేరు­–నగరి సుజల స్రవంతి వరద కాలువ ద్వారా 20 వేల క్యూసెక్కులను గండికోట రిజర్వా­యర్‌కు తరలించడానికి సిద్ధమయ్యారు. 

► వెలిగొండ ప్రాజెక్టును ఇదిగో అదిగో అని ఐదేళ్లూ దాటవేసిన చరిత్ర చంద్రబాబుది. కానీ.. వైఎస్‌ జగన్‌ వెలిగొండపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఇప్పటికే మొదటి సొరంగాన్ని పూర్తి చేయించారు. రెండో సొరంగం పనులు వేగంగా సాగుతున్నాయి. నల్లమలసాగర్‌ నిర్వాసితు­లకు పునరావాసం కల్పించి.. ఈ ఏడాదే వెలిగొండ తొలి దశ ద్వారా కృష్ణా జలాలను తరలించి దుర్భిక్ష ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్‌ జిల్లాలను సుభిక్షం చేయడానికి సీఎం వైఎస్‌ జగన్‌ శ్రీకారం చుట్టనున్నారు. 

► కర్నూల్‌ జిల్లాలో పశ్చిమ ప్రాంతంలోని 9 దుర్భిక్ష మండలాల్లో 10,130 ఎకరాలకు నీళ్లందించేందుకు హంద్రీ–నీవా నుంచి 1.238 టీఎం­సీలను ఎత్తిపోసే పథకం పనులను రూ.­180.67 కోట్లను ఖర్చు చేసి, దాదాపుగా పూర్తి చేశారు. 

► అత్యంత వెనుకబడ్డ శ్రీకాకుళం జిల్లాను సుభిక్షం చేయడమే లక్ష్యంగా వంశధార స్టేజ్‌–2 ఫేజ్‌–2లో మిగిలిన పనులతోపాటు వంశధార–నాగావళి అనుసంధానాన్ని ఈ ఏడాదే పూర్తి చేసి, జాతికి అంకితం చేసే దిశగా పనుల్లో వేగం పెంచారు. వంశధార ఫలాలను పూర్తి స్థాయిలో అందించడానికి హిరమండలం ఎత్తిపోతలకు శ్రీకారం చుట్టారు. జలయజ్ఞంలో చేపట్టిన తారకరామ­తీర్థసాగరం, తోటపల్లి, మహేంద్రతనయ ఆఫ్‌షోర్‌ రిజర్వాయర్, హంద్రీ–నీవా, గాలేరు–నగరి తదితర ప్రాజెక్టుల పనుల్లోనూ వేగం పెంచారు. మరి శరవేగంగా పూర్తవుతోన్న ఈ ప్రాజెక్టులను కళ్లుండి చూడ­లేకపోతే ఎలా రామోజీరావు గారూ?

బాబు పాపం వల్లే పోలవరం పనుల్లో జాప్యం..
గోదావరి వరద ప్రవాహాన్ని మళ్లించేలా కాఫర్‌ డ్యామ్‌లు, అప్రోచ్‌ చానల్, స్పిల్‌ వే, íస్పిల్‌ చానల్, పైలట్‌ చానల్‌లను పూర్తి చేయకుండా చంద్రబాబు.. ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌(ఈసీఆర్‌ఎఫ్‌) డ్యామ్‌ పునాది డయాఫ్రమ్‌ వాల్‌ను నిర్మించారు. 2019, జూన్‌లో గోదావరికి వచ్చిన వరదలు కాఫర్‌ డ్యామ్‌ ఖాళీ ప్రదేశాల గుండా అధిక ఉద్ధృతితో ప్రవహించడం వల్ల డయాఫ్రమ్‌ వాల్‌ దెబ్బతింది. ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ నిర్మాణ ప్రాంతంలో ఇసుక కోతకు గురైంది. కోతకు గురైన ప్రదేశాన్ని యథా స్థితికి తెచ్చి... డయాఫ్రమ్‌ వాల్‌ను సరిదిద్దాకనే ప్రధాన డ్యామ్‌ పనులు చేయాలి.

చంద్రబాబు ఈ పాపానికి పాల్పడకపోయి ఉంటే.. ఈ పాటికి సీఎం వైఎస్‌ జగన్‌ పోలవరాన్ని పూర్తి చేసి ఉండేవారు. బాబు చేసిన తప్పులను సరిదిద్దడానికి  కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ)తో పాటు జాతీయ స్థాయి­లో అనేక మంది నిపుణులను సంప్రతి­స్తూనే... స్పిల్‌ వే, స్పిల్‌ చానల్, అప్రోచ్‌ చానల్, పైలట్‌ ఛానల్, ఎగువ కాఫర్‌ డ్యామ్‌ను పూర్తి చేసి, 2021, జూన్‌ 11న గోదావరి ప్రవాహాన్ని స్పిల్‌ వే మీదుగా మళ్లించారు. ఈ నెలాఖరుకు దిగువ కాఫర్‌ డ్యామ్‌ పూర్తి కానుంది. సీడబ్ల్యూసీ ఆమోదించిన డిజైన్‌ల మేరకు డయాఫ్రమ్‌వాల్‌ను సరిదిద్ది.. ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ చేపట్టి, శరవేగంగా పూర్తి చేసే దిశగా సీఎం వైఎస్‌ జగన్‌ అడుగులు వేస్తున్నారు.

నిర్వాసితులకు పునరావాసం.. జలాశయాల్లో గరిష్ట నిల్వ
► కృష్ణా డెల్టాకు జీవనాడి వంటి పులిచింతల ప్రాజెక్టులో 2019, మే వరకూ ఎన్నడూ గరిష్ట స్థాయిలో నీటిని నిల్వ చేయలేదు. నిర్వాసితు­లకు పునరావాసం కల్పించకపోవడం, తెలంగాణకు పరిహారం చెల్లించకపోవడమే అందుకు కారణం. కమీషన్లు రావనే ఉద్దేశంతో చంద్రబాబు ఆ పనులు చేయలేదు. వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే నిర్వాసితులకు పునరావాసం కల్పించి, తెలంగాణకు పరి­హారం చెల్లించి 2019, ఆగస్టులోనే పులిచింతలలో గరిష్ట స్థాయిలో 45.77 టీఎంసీలను నిల్వ చేశారు. కృష్ణా డెల్టాలో రెండో పంటకూ నీళ్లందించడానికి మార్గం సుగమం చేశారు.

► బ్రహ్మంసాగర్‌ రిజర్వాయరు గరిష్ట సామర్థ్యం 17.85 టీఎంసీలు. కానీ మట్టికట్టలో నిర్మాణ లోపాల వల్ల లీకేజీలు ఉండటంతో నిల్వ సామర్థ్యం నాలుగైదు టీఎంసీలకు పడిపోయింది. 2014 నుంచి 2019 వరకూ ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్న చంద్రబాబు... ఎన్నడూ లీకేజీలకు అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేయలేదు. రాయలసీమను సస్యశ్యామలం చేద్దామనే ఆలోచనే రాలేదు. ఆ నాలుగైదు టీఎంసీలతోనే నెట్టుకొచ్చేశారు. వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక... యుద్ధప్రాతిపదికన బ్రహ్మంసాగర్‌ మట్టికట్టలో లీకేజీలున్న చోట రూ.వంద కోట్లతో డయాఫ్రమ్‌ వాల్‌ను నిర్మించారు. లీకేజీలకు అడ్డుకట్ట వేసి ఏకంగా 17.85 టీఎంసీలను నిల్వ చేసి... ఆయకట్టు చివరి భూములక్కూడా నీళ్లిచ్చారు. 

► గండికోట రిజర్వాయర్‌ గరిష్ట సామర్థ్యం 26.85 టీఎంసీలు. కానీ 2014 నుంచి 2019 మధ్య నిర్వాసితులకు పునరావాసం కల్పించకపోవడంతో ఐదారు టీఎంసీలు కూడా నిల్వ చేయలేని దుస్థితి ఉండేది. పునరావాసం గురించి బాబు ఆలోచించనే లేదు. వైఎస్‌ జగన్‌ సీఎం అయ్యాక రూ.వెయ్యి కోట్లతో నిర్వాసితులకు పునరావాసం కల్పించారు. గత రెండేళ్లుగా గరిష్టంగా నీటిని నిల్వ చేస్తున్నారు. ఇప్పుడు కూడా రిజర్వాయర్‌లో 26.25 టీఎంసీల నీరు నిల్వ ఉంది. 

► చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌(సీబీఆర్‌)  గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 10 టీఎంసీలు. కానీ 2014 నుంచి 2019 మధ్య చంద్రబాబు నిర్వాసితులకు పునరావాసం కల్పించలేదు. ఫలితంగా నాలుగైదు టీఎంసీలను కూడా నిల్వ చేయలేని పరిస్థితి. వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చాక రూ.600 కోట్లతో నిర్వాసితులకు పునరావాసం కల్పించారు. రెండేళ్లుగా సీబీఆర్‌లో గరిష్ట స్థాయిలో నీటిని నిల్వ చేస్తున్నారు. ప్రస్తుతం సీబీఆర్‌లో 9.6 టీఎంసీలు నిల్వ ఉన్నాయి.

► నిర్వాసితులకు పునరావాసం కల్పించడం ద్వారా సోమశిల, కండలేరు, గోరకల్లు, అవుకు రిజర్వాయర్లలో 2019, సెప్టెంబరు నాటికే గరిష్ట స్థాయిలో నీటిని నిల్వచేశారు. ఇలాంటి వాస్తవాలను రాస్తే సీఎం వైఎస్‌ జగన్‌ ప్రజలకు చేస్తున్న మేలు బయటపడుతుందని... అబద్ధా­లు రాయటానికే అలవాటు పడ్డారు రామోజీరావు!!

ఇదీ... బాబు అడ్డగోలు దోపిడీ..
► పోలవరం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి మినహా జలయజ్ఞం కింద చేపట్టిన 40 ప్రాజెక్టులను పూర్తి చేయడానికి రూ.17,368 కోట్లు అవసరమని 2014, జూలై 8న నీటిపారుదల ప్రాజెక్టులపై విడుదల చేసిన శ్వేతపత్రంలో నాటి సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

► 2014, జూన్‌ 8 నుంచి 2019, మే 29 వరకూ నీటిపారుదల ప్రాజెక్టులపై రూ.68,293 కోట్లు ఖర్చు చేసినట్లు టీడీపీ చెబుతోంది. కానీ ఇందులో నీరు–చెట్టు పథకానికి, పోలవరానికి పెట్టిన వ్యయాన్ని మినహాయిస్తే ప్రాజెక్టులపై రూ. 45,393 కోట్లు ఖర్చుపెట్టింది. కానీ.. ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టునూ పూర్తి చేయలేదు. కొత్తగా ఒక్క ఎకరాకూ నీళ్లందించలేదు. 

► దీనికి ప్రధాన కారణం... జీవో 22, జీవో 63లను అడ్డంపెట్టుకుని అంచనా వ్యయాలను భారీగా పెంచేశారు. కాంట్రాక్టర్లతో కలిసి ఖజానాను దోచుకున్నారు చంద్రబాబు.

► ఈ దోపిడీ రామోజీకి కమ్మగా కన్పించింది. ఎందుకంటే దోపిడీ చేసిన సొమ్మును ఈ ఎల్లో ముఠా మొత్తం దోచుకో.. పంచుకో.. తినుకో పద్ధతిలో పంచేసుకున్నారు కాబట్టి. 

► ఇక నీరు–చెట్టు కింద టీడీపీ కార్యకర్తలు పనులు చేయకుండానే చేసినట్లు చూపించి రూ.10 వేల కోట్లకుపైగా లాగేశారు. 

► పోలవరం ప్రాజెక్టుపై టీడీపీ సర్కార్‌ రూ.10,584 కోట్లు ఖర్చు పెడితే.. అందులో రూ.పది వేల కోట్లకుపైగా కేంద్రం రీయింబర్స్‌ చేసింది. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే కుడి, ఎడమ కాలువ ద్వారా గ్రావిటీపై నీళ్లందించవచ్చు. కానీ.. కుడి కాలువ ద్వారా నీళ్లందించడానికి రూ.1,900 కోట్లతో పట్టిసీమ ఎత్తిపోతల, ఎడమ కాలువ ద్వారా నీళ్లందించడానికి పురుషోత్తపట్నం ఎత్తిపోతలను చేపట్టిన చంద్రబాబు.. ఆ రెండు ప్రాజెక్టు పనులను ఒకే కాంట్రాక్టర్‌కు ఇచ్చి.. భారీ కమీషన్లు కొట్టేశారు.

ఎలాంటి అనుమతి లేకుండా చేపట్టిన ఈ రెండు ఎత్తిపోతలకు సంబంధించి జాతీయ హరిత ట్రిబ్యునల్‌ రూ.250 కోట్లను ప్రభుత్వానికి జరిమానాగా విధిస్తే.. దానిపై సుప్రీం కోర్టులో పోరాటం చేయాల్సి వస్తోంది. 2019 నుంచి ఆ రెండు ఎత్తిపోతల పథకాల నుంచి ఒక్క చుక్క నీటిని కూడా తోడలేదు. అంటే.. వాటిపై వ్యయం చేసిన రూ.3800 కోట్ల ప్రజాధనం బూడిదలో పోసిన పన్నీరే కదా? ఇలాంటి కఠిన వాస్తవాలను ‘ఈనాడు’ పత్రిక ఎందుకు రాయదు?

► చివరకు కుప్పం నియోజకవర్గానికి నీళ్లందించే కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ పనులను రూ.477 కోట్లతో ప్రారంభించి.. ఆ తర్వాత వ్యయాన్ని రూ.622 కోట్లకు పెంచి.. అస్మదీయ కాంట్రాక్టర్‌తో కలిసి సులువైన మట్టి పనులు చేసి, కమీషన్లు వసూలు చేసుకుని చంద్రబాబు చేతులు దులుపుకుంటే.. ఇప్పుడు ఆ పనులను సీఎం వైఎస్‌ జగన్‌ పూర్తి చేయించే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇలాంటి చంద్రబాబు దరిద్రపు మోసాలేవీ రామోజీకి కనిపించకపోవటమే ఈ రాష్ట్రం దురదృష్టం.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement