అన్నదాతకు మద్దతు | Rapid Grain Procurement In Annamayya And YSR district | Sakshi
Sakshi News home page

అన్నదాతకు మద్దతు

Published Sat, May 7 2022 12:08 PM | Last Updated on Sat, May 7 2022 12:37 PM

Rapid Grain Procurement In Annamayya And YSR district - Sakshi

సాక్షి, రాయచోటి: ప్రభుత్వం అన్నదాతకు అన్ని విధాలా మద్దతు కల్పిస్తోంది. దళారుల ప్రమేయం లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ అండగా ఉన్నామని భరోసానిస్తోంది. ప్రతి సీజన్‌లోనూ ప్రభుత్వం రైతుల పక్షాన నిలుస్తూ.. ఏ ఒక్క రైతు ఇబ్బంది పడకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. రైతులకు సంబంధించిన సరుకుకు గిట్టుబాటు ధర కల్పిస్తూ సకాలంలో బిల్లులు చెల్లించడంతోపాటు పంట సాగుకు ప్రోత్సాహం అందిస్తోంది. దిగుబడి వచ్చిన తర్వాత అన్నదాతలు అమ్ముకోవాలంటే అనేక రకాల ఇబ్బందులు పడేవారు. ఒకవైపు దళారులు, మరోవైపు వ్యాపారులు కుమ్మక్కై ఏదో ఒక రకంగా అన్నదాతను దెబ్బతీసే పరిస్థితి నుంచి ప్రభుత్వం మంచి ధరను అందించి కొనుగోలుకు శ్రీకారం చుడుతూ వస్తోంది. ఈ రబీ సీజన్‌కు సంబంధించి కూడా సుమారు 21 వేల మెట్రిక్‌ టన్నులు కొనుగోలుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి.  

జిల్లాలో 40 కొనుగోలు కేంద్రాలు
రబీ సీజన్‌లో వరి సాగు చేసిన రైతులకు సంబంధించి ప్రస్తుతం కొన్నిచోట్ల నూర్పిళ్లు జరుగుతుండగా, మరికొన్నిచోట్ల పూర్తయ్యాయి. ప్రస్తుతం సీజన్‌ కావడంతో రబీలో పండించిన పంట కొనుగోలుకు ప్రభుత్వం కేంద్రాలను ఏర్పాటు చేసింది. వైఎస్సార్‌ జిల్లాలో సుమారు 29 కేంద్రాలను ఏర్పాటు చేసి కొనుగోలు చేస్తుండగా, అన్నమయ్య జిల్లాలో 11 కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యాన్ని సేకరిస్తున్నారు. ప్రాథమిక సహకార సంఘాలతోపాటు డీసీఎంఎస్, మార్కెటింగ్‌ శాఖల సంయుక్త సహకారంతో కొనుగోలు ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. అన్నమయ్య జిల్లాలోని 134, వైఎస్సార్‌ జిల్లాలో 224 రైతు భరోసా కేంద్రాల్లో అన్నదాతలు రిజిస్టర్‌ చేసుకునేలా అవకాశం కల్పించారు.  

మంచి ధర 
వరి పండిస్తున్న రైతులకు మంచి మద్దతు ధరను అందించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించిన నేపథ్యంలో సంబంధిత అధికారులు ధరను నిర్ణయించారు. మార్కెట్‌ రేటును పరిగణనలోకి తీసుకుని అందుకు అనుగుణంగా మంచి రేటును అందించారు. వరి ధాన్యా నికి సంబంధించి గ్రేడ్‌ –ఏ రకం క్వింటాకు రూ. 1960 (టన్ను రూ. 19,600), సాధా రణ రకం క్వింటా రూ. 1940 (టన్ను రూ. 19,400) ధరతో ధాన్యం తీసుకుంటున్నారు. సరుకు కొనుగోలు చేసిన తర్వాత వెంటనే రైతుల ఖాతాలకు సొమ్మును జమ చేస్తున్నారు. 

21,000 మెట్రిక్‌ టన్నుల సేకరణకు ప్రణాళికలు
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వైఎస్సార్, అన్నమయ్య జిల్లాల్లో పౌరసరఫరాలశాఖ ఆధ్వర్యంలో ఈసారి సుమారు 21000 మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించే దిశగా అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఎక్కడికక్కడ అన్నదాతల ద్వారా ధాన్యం సేకరించి మిల్లులకు పంపించనున్నారు. వైఎస్సార్‌ జిల్లాలో ఇప్పటికే 72 మంది రైతుల నుంచి సుమారు 420 టన్నుల ధాన్యాన్ని సేకరించారు. అన్నమయ్య జిల్లాలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ఇప్పుడిప్పుడే కొనుగోలుకు అధికారులు అడుగులు ముందుకు వేస్తున్నారు. వైఎస్సార్‌ జిల్లాకు సంబంధించి 14 వేల మెట్రిక్‌ టన్నులు ధాన్యం సేకరించాలని లక్ష్యం కాగా, అన్నమయ్య జిల్లాలో ఏడు వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని నిర్ణయించారు. 

ప్రతి రైతు నుంచి కొనుగోలు చేస్తాం  
అన్నమయ్య జిల్లాలో వరి సాగు చేసిన రైతుల నుంచి ధాన్యం కొనుగోలుకు శ్రీకారం చుట్టాం. మంచి గిట్టుబాటు ధర కల్పించి రబీ సీజన్‌ ధాన్యాన్ని సేకరిస్తున్నాం. ఇప్పటికే పౌరసరఫరాలశాఖ ప్రణాళిక రూపొందించి అందుకు అనుగుణంగా ముందుకు వెళుతోంది.             
– తమీమ్‌ అన్సారియా,జాయింట్‌ కలెక్టర్, అన్నమయ్య జిల్లా  

రైతుల శ్రేయస్సే లక్ష్యం 
రాష్ట్ర ప్రభుత్వం రైతుల శ్రేయస్సే లక్ష్యంగా మంచి మద్దతు ధరను అందించి ధాన్యం సేకరిస్తోంది.  వైఎస్సార్‌ జిల్లాలో ఇప్పటికే  సుమారు 400 మెట్రిక్‌ టన్నులకు పైగా ధాన్యాన్ని సేకరించారు.  సుమారు 14 వేల మెట్రిక్‌ టన్నులు రబీ సీజన్‌లో సేకరించాలని లక్ష్యంతో ముందుకు వెళుతున్నాం. జిల్లాలో 29 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశాము.
– సాయికాంత్‌వర్మ,జాయింట్‌ కలెక్టర్, వైఎస్సార్‌ జిల్లా 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement