
సాక్షి,విజయవాడ( కృష్ణా): తిరుమల శేషాచలం అడవుల్లో ఎక్కువగా సంచరించే పునుగు పిల్లి విజయవాడలో ప్రత్యక్షమైంది. ఈ అరుదైన పిల్లి బెజవాడ బృందావన కాలనీలోని చెట్లపై తిరుగుతుండటాన్ని స్థానికులు రెండు, మూడు రోజులుగా గమనిస్తున్నారు. మంగళవారం రాత్రి ఎ కన్వెన్షన్ సెంటర్ సమీపంలోని ఓ ఇంట్లోకి వెళ్లగా వారు తలుపులన్నీ మూసి పిల్లిని పట్టుకుని బోనులో బంధించారు.
బుధవారం దానిని చూసిన స్థానికులు తిరుమల శేషాచలం అడవుల్లో సంచరించే పునుగు పిల్లిగా గుర్తించారు. తిరుమల నిత్యాన్నదాన కార్యక్రమానికి కూరగాయలు తరలించేందుకు అక్కడి నుంచి వాహనాలు వస్తుంటాయి. అలా వచ్చిన వాహనాల్లో ఇక్కడికి చేరి ఉండొచ్చని వారు భావిస్తున్నారు. ఈ విషయంపై స్థానికుల సమాచారంతో వచ్చి పిల్లిని తీసుకెళ్లిన అటవీశాఖ అధికారులు దానిని అడవిలో వదిలివేయనున్నట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment