బ్రాండ్‌ భరోసా  | Rare Sight in Global Investors Summit 2023 | Sakshi
Sakshi News home page

బ్రాండ్‌ భరోసా 

Published Sun, Mar 5 2023 3:31 AM | Last Updated on Sun, Mar 5 2023 3:31 AM

Rare Sight in Global Investors Summit 2023 - Sakshi

(విశాఖ జీఐఎస్‌ ప్రాంగణం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి) : విశ్వసనీయత, భరోసాకు నిదర్శనంగా నిలిచిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  పేరే రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి బ్రాండ్‌గా మారింది. రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టేలా పారిశ్రామికవేత్తలకు ప్రేరణగా నిలిచింది.

ముఖ్యమంత్రి జగన్‌ తానే స్వయంగా ఏపీకి బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారి పారిశ్రామిక సెన్సెక్స్‌లో రాష్ట్ర సూచీని ఉవ్వెత్తున ఎగసేలా చేశారు. ఒక్క పేరు కల్పించిన విశ్వాసంతో దిగ్గజ పారిశ్రామికవేత్తలు ప్రత్యేకంగా విశాఖ సమ్మిట్‌కు హాజరయ్యారు. విశాఖలో రెండు రోజులపాటు నిర్వహించిన గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ 2023 వేదికగా అరుదైన దృశ్యాలు ఆవిష్కృతమయ్యాయి. 

సత్వర నిర్ణయాలు, సమర్థ నాయకత్వం 
జీఐఎస్‌ 2023 సదస్సును విజయవంతంగా నిర్వహించడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం యావత్‌ దేశం దృష్టిని ఆకర్షించింది. కేవలం రెండు రోజుల్లోనే ఏకంగా రూ.13,41,734 కోట్లకుపైగా పెట్టుబడులను సాధించడం ద్వారా పారిశ్రామిక వర్గాల్లో నమ్మకాన్ని రుజువు చేసుకుంది. ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి ఎంతో కాలయాపన తరువాతగానీ నిర్ణయం తీసుకోని అగ్ర పారిశ్రామికవేత్తలు సైతం ఏపీలో పెట్టుబడుల విషయంలో మీనమేషాలు లెక్కించలేదు.

రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలపై సత్వరం సానుకూలంగా స్పందించి ఏకంగా 20 రంగాల్లో 378 పెట్టుబడుల ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి జగన్‌ సమర్థ నాయకత్వం ఉందన్న నమ్మకమే దీనికి కారణం. విశ్వసనీయత, సమర్థత, సత్వర నిర్ణయాలకు సీఎం జగన్‌ను ప్రతీకగా పారిశ్రామికవేత్తలు గుర్తించారు. కోవిడ్‌ సమయంలో పరిశ్రమలకు అండగా నిలవడంతోపాటు గత మూడున్నరేళ్లుగా రాష్ట్రం సాధించిన వృద్ధిని కూడా వారు పరిగణలోకి తీసుకున్నారు.   

కోవిడ్‌లో కాపాడిన సంక్షేమం 
కోవిడ్‌ ప్రతికూల పరిస్థితులను దీటుగా ఎదురొడ్డి మరీ ఆంధ్రప్రదేశ్‌ 2021–22లో 11.43 శాతం వృద్ధి రేటు సాధించడం సాధారణ విషయం కాదు. గత మూడేళ్లలో ఎగుమతుల్లో సగటు వార్షిక వృద్ధిరేటు 9.3 శాతంగా నమోదైంది. సులభతర వాణిజ్య విధానాల్లో దేశంలోనే మొదటిస్థానంలో ఉంది. ఈ విజయాలన్నీ ముఖ్యమంత్రి జగన్‌ దక్షత, రాష్ట్ర అభివృద్ధి పట్ల నిబద్ధతకు నిదర్శనంగా పారిశ్రామికవేత్తలు గుర్తించారు.

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పట్ల విపక్షాలు ఎంత బురద చల్లుతున్నా కరోనా గడ్డు కాలంలో రాష్ట్ర ప్రజల కొనుగోలు శక్తిని నిలబెట్టింది అవేనని పారిశ్రామికవేత్తలు గుర్తించారు. అంత సమర్థ నాయకత్వం ఉన్నందువల్లే ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సన్నద్ధమై ముందుకొచ్చారు.   

తీరం.. మనకు వరంలా 
ఇక అతి పొడవైన తీర ప్రాంతం రాష్ట్రానికే ఉందని గత పాలకులు చెప్పటమే కానీ సద్వినియోగం చేసుకున్న దాఖలాలు లేవు. ఇందుకు భిన్నంగా  తీర ప్రాంతాన్ని రాష్ట్ర ప్రగతికి చుక్కానిగా మలచుకోవాలని విధానపరమైన నిర్ణయం తీసుకుంది సీఎం వైఎస్‌ జగన్‌ మాత్రమే. అందుకే ఇప్పటికే నిర్వహణలో ఉన్న ఆరు పోర్టులతోపాటు కొత్తగా నాలుగు పోర్టుల నిర్మాణాన్ని చేపట్టారు. కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీతో పలుమార్లు చర్చించి పోర్టులను జాతీయ రహదారులతో అనుసంధానించేందుకు రూ.20 వేల కోట్ల రహదారి ప్రాజెక్టులను మంజూరు చేయించడంలో విజయం సాధించారు.

కార్యనిర్వాహక రాజధాని కానున్న విశాఖపట్నం నుంచి భోగాపురం వరకు ఆరులేన్ల రహదారి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించారు. తద్వారా ఏపీని లాజిస్టిక్‌ హబ్‌గా తీర్చిదిద్దే క్రమంలో సీఎం జగన్‌ అతి పెద్ద ముందడుగు వేశారు. ఆ పోర్టులు, పారిశ్రామిక కారిడార్ల పరిధిలో భారీ  పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించగలిగారు. దీంతో రాష్ట్ర పారిశ్రామిక ముఖచిత్రం అమాంతం మారిపోనుంది. ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా యువతకు స్థానికంగా పెద్ద ఎత్తున ఉపాధి కల్పించేలా రాచబాట పరిచారు.   

దార్శనికత చాటిన దూరదృష్టి
మారిన పరిణామాల నేపథ్యంలో యావత్‌ ప్రపంచం దృష్టి కర్బన ఉద్గారాలను తగ్గించడం, కాలుష్య నియంత్రణ మీదే ప్రధానంగా ఉన్నట్లు సీఎం జగన్‌ గుర్తించారు. భవిష్యత్‌ అంతా పునరుత్పాదక ఇంధన వనరుల రంగానిదేనని స్పష్టం కావడంతో ఆ దిశగా రాష్ట్రంలో వనరుల సద్వినియోగంపై దృష్టి సారించారు. పునరుత్పాదక ఇంధనం, గ్రీన్‌ హైడ్రోజన్, గ్రీన్‌ అమ్మోనియా రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించారు. అందుకే ఇంధన రంగంలో రికార్డు స్థాయిలో రూ.9,57,139 కోట్ల మేర పెట్టుబడుల వరద పారింది.  


సగం విజయం ముందుగానే.. 
ఆంధ్రప్రదేశ్‌లో అపార సహజ వనరులున్నా  గతంలో ఎప్పుడూ ఇంత భారీ స్థాయిలో పెట్టుబడులు రాలేదు. రాష్ట్రానికి పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా భవిష్యత్‌ పరిణామాలను ముందుగానే అంచనా వేయడం ద్వారా 50 శాతం లక్ష్యాన్ని సాధించారు. అందుకనుగుణంగా రాష్ట్రంలోని వనరులను సద్వినియోగం చేసుకునేలా ప్రణాళిక రూపొందించి మిగిలిన 50 శాతం లక్ష్యాన్ని చకచకా పూర్తి చేశారు.  

ఆ ఒక్క మాట... ఆ ఒక్క నిర్ణయం
జీఐఎస్‌ వేదికగా ముఖ్యమంత్రి జగన్‌ చెప్పిన రెండు మాటలు యావత్‌ పారిశ్రామిక ప్రపంచానికి భరోసానిచ్చాయి. ఎంవోయూల మేరకు పరిశ్రమల స్థాపనలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తనకు ఒక్క ఫోన్‌ కాల్‌ చేస్తే చాలు పరిష్కరిస్తానని స్పష్ట­మైన హామీనిచ్చారు. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇలాంటి భరోసానివ్వలేదని పారిశ్రామికవేత్తలు వ్యాఖ్యానించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇక వేగంగా ఎంవోయూల సాకారానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంతో అత్యున్నత కమిటీని నియమిస్తున్నట్లు సీఎం జగన్‌ చేసిన ప్రకటన పెట్టుబడిదారుల్లో ఆత్మ విశ్వా­సాన్ని పెంపొందించింది. అటు ముఖ్యమంత్రే స్వయంగా ఫోన్‌ కాల్‌ దూరంలో అందుబాటులో ఉండటం... ఇటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రతి వారం పరిశ్రమల ఏర్పాటును పర్యవేక్షించనుండటం విధానపరంగా విప్లవాత్మక నిర్ణయాలనే ఏకాభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఈ నేపథ్యంలో పారిశ్రామిక పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్‌ సరైన గమ్య స్థానమన్న భావన దేశీయ, అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల్లో స్థిరపడిపోయింది. ఏపీలో పారిశ్రామిక పెట్టుబడులు టేకాఫ్‌ అందుకున్నాయని, ఇక రాష్ట్ర ప్రగతి ఉవ్వెత్తున దూసుకుపోవడం ఖాయమన్నది జీఐఎస్‌–2023 ద్వారా స్పష్టమైంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement