విశాఖ జీఐఎస్ వేదిక నుంచి సాక్షి ప్రతినిధి: రాష్ట్రంలోని అపారమైన అవకాశాలను వివరిస్తూ ‘అడ్వాంటేజ్ ఏపీ’ పేరుతో విశాఖపట్నంలో నిర్వహించిన రెండు రోజుల గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ సూపర్ హిట్ అయ్యింది. దేశ, అంతర్జాతీయ కార్పొరేట్ దిగ్గజాలు ఒకే వేదికపైకి రావడమే కాకుండా రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారీ పెట్టుబడులను పెడుతూ ఒప్పందాలు చేసుకున్నారు. రెండు రోజుల సమావేశాలకు రిలయన్స్ గ్రూపు చైర్మన్ ముఖేష్ అంబానీతో పాటు కరణ్ అదానీ, జిందాల్, బంగూర్, ఒబెరాయ్, భజాంకా, దాల్మియా, మిట్టల్, జీఎం రావు, కృష్ణ ఎల్లా, అపోలో ప్రీతా రెడ్డి, సతీష్ రెడ్డి, బీవీఆర్ మోహన్ రెడ్డి, మసహిరో యమగుచి, టెస్లా కోఫౌండర్ మార్టిన్ ఎబర్‌హార్డ్ వంటి 30కిపైగా కార్పొరేట్ దిగ్గజాలు హాజరయ్యారు.
అంబానీ మొదలు రాష్ట్రంలోని పారిశ్రామికవేత్త వరకు సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను మెచ్చుకోవడమే కాకుండా అందులో భాగస్వామ్యమవుతామంటూ ప్రకటించారు. ఈ రెండు రోజుల సమావేశాల్లో 20 రంగాల నుంచి రూ.13,41,734 కోట్ల విలువైన పెట్టుబడుల ఒప్పందాలు కుదిరాయి. 378 ఒప్పందాల ద్వారా రాష్ట్ర యువతకు ప్రత్యక్షంగా 6,09,868 ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
గత ప్రభుత్వాల వలే ప్రచారం కోసం ఒప్పందాలు కుదుర్చుకొని వదిలేయకుండా వాటిని తక్షణం అమల్లోకి తీసుకువచ్చే విధంగా ముఖ్యమంత్రి.. సీఎస్ అధ్యక్షతన ఒప్పందాల పర్యవేక్షణ కమిటీ వేశారు. ఈ కమిటీ ప్రతి వారం సమావేశమై ఒప్పందాల అమలు తీరు, అనుమతుల మంజూరు వంటి అంశాలను పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు తగు చర్యలు తీసుకుంటుందని సీఎం ప్రకటించడంపై పారిశ్రామికవేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అర్థవంతమైన చర్చలు
ఈ సమావేశాల సందర్భంగా 15 రంగాలపై అర్థవంతమైన చర్చలు జరిగాయి. ఇందులో ఆయా రంగాలకు చెందిన 100 మందికిపైగా ప్రముఖ నిపుణులు పాల్గొని చర్చించారు. పలు దేశాల్లో ఉన్న పరస్పర పెట్టుబడుల అవకాశాలపై వియత్నాం, నెదర్లాండ్స్, యూఏఈ, వెస్ట్రన్ ఆస్ట్రేలియా దేశాలతో కంట్రీసెషన్స్ జరిగాయి. పలు దేశాలకు చెందిన ప్రతినిధులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో వివిధ అంశాలపై చర్చలు జరిపారు.
రాష్ట్రంలోని పెట్టుబడులు, ఉత్పత్తులు, ప్రభుత్వం చేపట్టిన వివిధ ప్రాజెక్టుల నిర్మాణాన్ని కళ్లకు కట్టినట్లు చూపించేలా 137 స్టాల్స్‌తో ఏర్పాటు చేసిన పారిశ్రామిక ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. ముఖ్యంగా ఒక జిల్లా ఒక ఉత్పత్తి పేరుతో జిల్లాల వారీగా ఎగుమతులను ప్రోత్సహిస్తున్న ఉత్పత్తుల స్టాల్ విశేషంగా ఆకర్షించింది. 25 దేశాల నుంచి 46 మంది రాయబారులతో పాటు మొత్తం 14,000కు పైగా ప్రతినిధులు హాజరయ్యారు.
14 యూనిట్లు ప్రారంభం
రాష్ట్రంలో వాణిజ్యపరంగా ఉత్పత్తికి సిద్ధమైన 14 యూనిట్లను సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, శర్బానంద సోనోవాల్ సమక్షంలో వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ యూనిట్ల ప్రారంభం ద్వారా రూ.3,841 కోట్ల పెట్టుబడులు వాస్తవరూపంలోకి రావడమే కాకుండా 9,108 మందికి ఉపాధి లభించనుంది. క్లింబెర్లీ క్లార్క్, బ్లూస్టార్, అంబర్, హావెల్స్, ఎక్సలెంట్ ఫార్మా, ఎన్‌జీసీ టాన్స్‌మిషన్స్, చార్ట్ ఇండస్ట్రీస్, లారస్ ల్యాబ్, అమరా లైఫ్, శారదా ఫెర్రో అల్లాయిస్, విన్‌విన్ స్పెషాలిటీ, ఏవోవీ ఆగ్రో ఫుడ్స్, ఎస్‌హెచ్ ఫుడ్, అవేరా కంపెనీలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment