సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: అధికారంలో లేకున్నా వారి ఆగడాలకు అంతులేదు. ప్రభుత్వ ఉద్యోగులను బెదిరించడం, దూషించడం ‘బూతుల బ్రదర్స్’కు నిత్యకృత్యంగా మారింది. శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ ఆగడాలు రోజురోజుకూ మితిమీరుతున్నాయి. గతంలో పలువురు ప్రభుత్వ అధికారులను దుర్భాషలాడిన రవికుమార్ తాజాగా పొందూరు విద్యుత్తు శాఖ ఏఈని ఫోన్‌లో బెదిరించిన వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఉద్యోగం చేయాలని లేదా..?
‘కాస్త మర్యాదగా ఉద్యోగాలు చేయడం నేర్చుకో..! నీకు సర్విసు లేదా? ఉద్యోగం చేయవా నువ్వు...? (రాయలేని భాషలో తిడుతూ) నాకు రూల్స్ చెబుతావా? తమాషాలు దొబ్బుతున్నావా? విద్యుత్ మీటర్ విషయంలో నా మనిషికే నోటీసు ఇస్తావా? డిస్ కనెక్ట్ చెయ్.. జీవితంలో ఇంత పెద్ద తప్పు చేశానా అని బాధపడే రోజు వస్తుంది చూడు నీకు... గుర్తు పెట్టుకో.. నువ్వు ముందు నోటీసు విత్‌డ్రా చేసుకో.
ఎవడా డీఈ...? నా కొడుకు.. ఆడికి చెప్పు.. మళ్లీ నీకు చెబుతున్నా వెధవ వేషాలు వేశావా.. మళ్లీ జీవితంలో కోలుకోలేవు..’ అంటూ పొందూరు ఎలక్ట్రికల్ ఏఈ పైడి దుర్గా ప్రసాద్‌ను కూన రవికుమార్ బెదిరించాడు. ఈ ఘటన మూడు నెలల క్రితం జరగ్గా ఆ సంభాషణ ఆలస్యంగా వెలుగు చూసింది. ఇలాంటి వ్యక్తులు పొరపాటున ఎన్నికైతే ప్రజలను, ఉద్యోగులను బతకనిస్తారా? అనే చర్చ సర్వత్రా జరుగుతోంది.
తాజా బాగోతమిది
పొందూరులో ‘గరుడ’ పేరుతో రెస్టారెంట్‌ను ఏర్పాటు చేసిన టీడీపీ ఎంపీటీసీ బాడాన గిరి అనుమతి లేకుండా విద్యుత్ మీటర్‌ను అమర్చారు. పంచాయతీ అనుమతి లేదని లిఖితపూర్వకంగా ఫిర్యాదు అందడంతో వివరణ ఇవ్వాలని ఎలక్ట్రికల్ ఏఈ పైడి దుర్గా ప్రసాద్ నోటీసు ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన కూన రవికుమార్ ఫోన్ చేసి అసభ్యంగా దూషించారు. ఈ అవమానాన్ని భరించలేక విద్యుత్ శాఖ అధికారి కుమిలిపోయారు.
కూన బ్రదర్స్‌కు ఆనవాయితీనే..
♦ శ్రీకాకుళం సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసిన ఆర్‌ఈసీహెచ్ ప్రసాద్‌ను గతంలో కూన రవికుమార్ నోటికొచ్చినట్టు దూషించారు. నీకు ఉద్యోగం, యూనిఫాం లేకుండా చేస్తా... ఆఫ్టర్ టూ అండ్ ఆఫ్ ఇయర్స్ నీకు ఉద్యోగం ఉండదు.. గుర్తుపెట్టుకో అంటూ బెదిరించారు.
♦ కోవిడ్ సమయంలో మందీ మార్బలంతో పోలీసు స్టేషన్‌కు వచ్చిన రవికుమార్ శంకరగిరి మాన్యాలు పట్టిస్తానంటూ పోలీస్ అధికారులను బెదిరించారు. ‘మీ స్థాయి ఎంత..? మీరు ఎంత..?’ అంటూ నరసన్నపేట సీఐ, ఎస్‌లనుద్దేశించి నోరు పారేసుకున్నారు.
♦ పొందూరులో టీడీపీ కార్యాలయం నిర్వహిస్తున్న భవనాన్ని ఖాళీ చేయాలని కోరినందుకు ఆ ఇంటి యజమానికి ఫోన్‌లో వార్నింగ్ ఇచ్చారు.
♦ పింఛన్ల విషయంలో తన మాట వినలేదని మండల కార్యాలయంలోనే సరుబుజ్జిలి ఎంపీడీవో, ఈవోపీఆర్‌డీకి వార్నింగ్ ఇచ్చారు. ఆఫీసులోనే తలుపులు వేసి మరీ బాదేస్తా.. నన్ను ఎవరూ ఆపలేరు. చెట్టుకు కట్టి కాల్చేస్తా.. చెప్పింది చేయకపోతే నేనేంటో చూపిస్తానంటూ బెదిరించారు.
♦ పనుల విషయంలో తాను చెప్పినట్లు వినకుంటే కుర్చిలో కూర్చున్నా లాక్కుని వచ్చి తంతానంటూ పంచాయతీ కార్యదర్శులను కూన రవికుమార్ భయపెట్టారు.
♦ ఒక బిల్లు విషయంలో సరుబుజ్జిలి ఇన్‌చార్జి ఈవోపీఆర్డీపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు.
♦ మట్టి అక్రమంగా తరలించిన వాహనాలను విడిచిపెట్టలేదని పొందూరు తహసీల్దార్‌పై బెదిరింపులకు పాల్పడ్డారు. ‘పట్టుకున్న వాహనాలను విడిచి పెట్టకపోతే లంచం డిమాండ్ చేశావని నీమీద కంప్లైంట్ చేస్తా. చెప్పు ఎంత కావాలి...? పది వేలు కావాలా? లక్ష కావాలా? ఎంత కావాలి...? ప్రాసెస్ గురించి నాకు చెబుతున్నావా? అంటూ రాయలేని భాషలో ఏకంగా ఎమ్మార్వోను దూషించారు.
♦కూన రవికుమార్ తమ్ముడు కూన వెంకట సత్యనారాయణ ఇటీవల పంచాయతీరాజ్ అసిస్టెంట్ ఇంజనీర్ కెసీహెచ్ మహంతిపై దాడి చేసే వరకు వెళ్లారు. తాను చేసిన పనులకు సంబంధించి ఏఈ అభ్యంతరం వ్యక్తం చేయడంతో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ కార్యాలయంలోనే దౌర్జన్యం చేశారు. ‘ఎంత ధైర్యం రా...! నాకే నోటీసు ఇస్తావా..? ఏమనుకుంటున్నావ్.. నేను కూన రవికుమార్ బ్రదర్‌ని.. జాగ్రత్త... ఇక్కడే పాతేస్తా... ’ అంటూ సత్యనారాయణ రెచ్చిపోయాడు.
Comments
Please login to add a commentAdd a comment