‘న్యాయ రాజధాని’ మా హక్కు  | Rayalaseema Garjana Sabha For Kurnool as the Judicial Capital | Sakshi
Sakshi News home page

‘న్యాయ రాజధాని’ మా హక్కు 

Published Mon, Dec 5 2022 7:24 AM | Last Updated on Mon, Dec 5 2022 10:50 AM

Rayalaseema Garjana Sabha For Kurnool as the Judicial Capital - Sakshi

కర్నూలు ఎస్టీబీసీ గ్రౌండ్‌లో రాయలసీమ గర్జన సభ ఏర్పాట్లను పరిశీలిస్తున్న మంత్రి బుగ్గన, ప్రజాప్రతినిధులు, నాయకులు

సాక్షి ప్రతినిధి, కర్నూలు/కర్నూలు (రాజ్‌విహార్‌) : అన్ని విధాలా వెనుకబడి ఉన్న రాయలసీమ అభివృద్ధిని అడ్డుకోవద్దని, నాడు రాజధానిని కోల్పోయినందున.. నేడు న్యాయ రాజధాని అయినా ఇవ్వాలని ‘సీమ’ జిల్లాల ప్రజలు దిక్కులు పిక్కటిల్లేలా కర్నూలు వేదికగా నేడు గర్జించనున్నారు. శ్రీబాగ్‌ ఒప్పందం మేరకు 1937లో కాశీనాథుని నాగేశ్వరరావు ఇంట్లో పెద్దమనుషులు చేసిన ఒప్పందం మేరకు కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని సీమవాసులు డిమాండ్‌ చేస్తున్నారు. ఆరు దశాబ్దాలుగా ఇచ్చిన మాటను నెరవేర్చడాన్ని పాలకులు నిర్లక్ష్యం చేసినా, 2020లో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల అభీష్టం మేరకు జీఎన్‌ రావు కమిటీ నివేదిక ఆధారంగా కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేసి ‘న్యాయం’ చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ప్రతిపక్ష పార్టీ.. హైకోర్టు ఏర్పాటుకు అడ్డు తగులుతూనే ఉంది. దీనిపై కర్నూలు బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో వంద రోజులకుపైగా రిలే దీక్షలు చేశారు. రాయలసీమ జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీలు, నిరసనలు, మానవ హారాలు చేశారు. వెనుకబడిన ప్రాంతానికి న్యాయం దక్కుతుందని ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలిపారు. ఇదే క్రమంలో ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చిన చంద్రబాబుకు కూడా తమ ఆకాంక్షను నిరసన రూపంలో తెలియజేశారు. అయితే కర్నూలు వేదికగా చంద్రబాబు సీమ ప్రజల ఆకాంక్షలకు గండికొట్టేలా, కర్నూలులో హైకోర్టు అవసరం లేదని, రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతి మాత్రమే ఉండాలని అంటూ.. టీడీపీ కార్యకర్తలతోనూ అదే విధంగా నినాదాలు చేయించి సీమ ప్రజలను మరింత రెచ్చగొట్టారు. ఈ క్రమంలో ‘సీమ వాణి’ మరింత గట్టిగా వినిపించేందుకు జేఏసీ నేతలు సిద్ధమయ్యారు. ‘రాయలసీమ గర్జన’ పేరుతో నేడు భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. దీనికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది.


సభాప్రాంగణాన్ని పరిశీలిస్తున్న మంత్రి బుగ్గన 

ఉమ్మడి ఆరు జిల్లాల నుంచి.. 
కర్నూలు నగరంలో ఎస్టీబీసీ మైదానంలో జరిగే ఈ సభకు అన్ని ఏర్పాట్లను జేఏసీ, వైఎస్సార్‌సీపీ నేతలు పూర్తి చేశారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, కర్నూలు, నంద్యాల జిల్లా అధ్యక్షులు బీవై రామయ్య, కాటసాని రాంభూపాల్‌రెడ్డి వారం రోజులుగా దీనిపై కసరత్తు చేస్తున్నారు. ఈ సభకు ‘గ్రేటర్‌ రాయలసీమ’లోని ఉమ్మడి ఆరు జిల్లాల్లోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తరలిరానున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధాహ్నం 2 గంటల వరకు జరిగే ఈ సభకు ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, ఎన్జీవోలు, స్వర్ణకారులు, వస్త్ర వ్యాపారులు, ఆటో డ్రైవర్లు.. చివరకు తోపుడు బండ్లు, పాల వ్యాపారులు కూడా స్వచ్ఛందంగా మద్దతు ప్రకటించి గళం విప్పేందుకు సిద్ధమయ్యారు. మొదటగా లక్ష మందితో సభ నిర్వహించాలని భావించినా, నిఘా వర్గాలు, నిర్వాహకుల లెక్క ప్రకారం అంతకు మించి భారీగా ప్రజలు తరలి రానున్నారని తెలుస్తోంది. దీంతో ట్రాఫిక్‌కు, వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. 

‘న్యాయ రాజధాని’ ప్రకటనతో వేగంగా అభివృద్ధి
హైకోర్టు ఏర్పాటైతే నాలుగు జిరాక్స్‌ మిషన్లు మినహా ఏం ఉపయోగం లేదని కొంత మంది హేళన చేస్తున్నారు. రాష్ట్రంలో నాలుగో అతిపెద్ద నగరం, సౌత్‌ ఇండియాకు ముఖ ద్వారం కర్నూలు. న్యాయ రాజధానిగా కర్నూలును ప్రకటిస్తే సాధారణ నగరాల కంటే భిన్నమైన అభివృద్ధి జరుగుతుంది. బెంగళూరు–హైదరా>బాద్, చెన్నై–బెంగళూరు ఇండస్ట్రియల్‌ కారిడార్‌ల పరిధిలో కర్నూలు ఉంది. ఇప్పటికే పారిశ్రామికంగా కర్నూలు వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ క్రమంలో ‘న్యాయ రాజధాని’ అయితే పారిశ్రామికవేత్తలు హైదరాబాద్‌కు ప్రత్యామ్నాయంగా కర్నూలును ఎంచుకునే అవకాశం ఉంది. వాతావరణ పరిస్థితులు, భూమి, నీటి లభ్యత హైదరాబాద్‌ కంటే మరింత మేలుగా ఉండే అవకాశం ఉంది. రోడ్డు, రైలు మార్గాలతో పాటు విమానాశ్రయం కూడా ఉంది.

దీంతో ప్రధాన నగరాలకు రవాణా సౌకర్యం కూడా మెరుగ్గా ఉంటుంది. హైకోర్టు ఏర్పాటైతే లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్‌తో పాటు 43కు పైగా ట్రిబ్యునల్స్‌ ఏర్పాటయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రభుత్వం లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్, ఏసీబీ కోర్టు కర్నూలులో ఏర్పాటు చేసింది. వీటి ఏర్పాటుతో నగరంలో నిర్మాణ రంగం వేగం పుంజుకోనుంది. నగర పరిధి విస్తరించనుంది. దీంతో ఉపాధి, వ్యాపార అవకాశాలు మెరుగు పడతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే 1953లో రాష్ట్ర రాజధానిగా ఉన్న కర్నూలును 1956లో త్యాగం చేయకుండా ఉండి ఉంటే ‘సీమ’ జిల్లాల ముఖచిత్రం మరోలా ఉండేది. త్యాగం చేయడంతో కర్నూలుతో పాటు సమీప జిల్లాలైనా అనంతపురం, వైఎస్సార్‌ జిల్లాలు కూడా భారీగా నష్టపోయాయి. అందుకే ఈ దఫా ఎట్టి పరిస్థితుల్లో ‘న్యాయ రాజధాని’ సాధించాలని ‘సీమ’ వాసులు గట్టిగా సంకల్పించారు. ఆ దిశగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నారు. కాగా,   పార్టీ రీజినల్‌ కో ఆర్డినేటర్‌ ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి, పార్టీ కర్నూలు, నంద్యాల జిల్లా అధ్యక్షులు బీవై రామయ్య, కాటసాని రాంభూపాల్‌రెడ్డి, ఎమ్మెల్యే ఎంఎ హఫీజ్‌ఖాన్, తదితరులు మైదానంలో ఏర్పాట్లు పరిశీలించారు. 

వెనుకబడిన ప్రాంతానికి న్యాయం జరగాలి
‘సీమ’ అత్యంత వెనుకబడిన ప్రాంతం. దీనికి న్యాయం చేసేందుకు హైకోర్టు ఏర్పాటు చేయాలని పెద్దమనుషులు 1937లో ఒప్పందం చేశారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి కాంక్షిస్తూ ముఖ్యమంత్రి హైకోర్టు ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. కానీ కొందరు కుట్రలు చేస్తున్నారు. అది ఎవరో అందరికీ తెలుసు. ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చి చంద్రబాబు మాట్లాడిన మాటలు ఇక్కడి ప్రజలను రెచ్చగొట్టేలా ఉన్నాయి. అందుకే జేఏసీ నేతలు ఉద్యమాన్ని ఉధృతం చేశారు. వారికి సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నాం. సభలో పాల్గొంటున్నాం. కచ్చితంగా ఈ ప్రాంతానికి న్యాయం జరగాలి. 
– బుగ్గన, ఆర్థిక శాఖ మంత్రి 

హైకోర్టు ఏర్పాటు చేసే వరకూ ఉద్యమిస్తాం
కర్నూల్లో హైకోర్టు ఏర్పాటుకు ప్రభుత్వం సుముఖంగా ఉంది. కానీ కొన్ని శక్తులు అడ్డుకుంటున్నాయి. ఇటీవల జిల్లా పర్యటనలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అత్యంత దారుణం. పుండుపై కారం చల్లేలా ఆయన మాట్లాడారు. అమరావతి ఒకటే రాజధానిగా ఉండాలని, కర్నూలుకు హైకోర్టు అవసరం లేదని ఆయన టీడీపీ కార్యకర్తలతో నినాదాలు చేయించారు. అందుకే ‘సీమ గర్జన’తో ప్రజల ఆకాంక్షను నేడు తెలుపబోతున్నాం. 
– విజయ్‌కుమార్‌రెడ్డి, చైర్మన్, రాయలసీమ జేఏసీ

స్వార్థ ప్రయోజనాల కోసమే బాబు కుట్రలు
స్వార్థ ప్రయోజనాల కోసం కుట్రలు పన్నుతున్న ఏకైక వ్యక్తి టీడీపీ నేత చంద్రబాబు. అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలనే ఆశయంతో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ముందుకు వెళ్తున్నారు. కానీ అభివృద్ధి అంతా ఒకే చోట ఉండాలనే ఆలోచనతో చంద్రబాబు అడ్డుకుంటున్నారు. అమరావతి చుట్టూ చంద్రబాబు అనుచరులందరికీ భూములు ఉన్నందున, వారికి నష్టం జరగకూడదని చూస్తున్నారు తప్ప ఇతర ఆలోచన లేదు. తన రియల్‌ దందా దెబ్బ తింటుందనే ఆవేదనతోనే కుట్రలకు తెర లేపారు. రాయలసీమలో పుట్టిన చంద్రబాబుకు సీమ నెత్తురు ఉంటే కర్నూలుకు న్యాయ రాజధాని వచ్చేలా మద్దతు ప్రకటించాలి.
– గుమ్మనూరు జయరాం, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి

చంద్రబాబు అడ్డంకులు తాత్కాలికమే
వేల ఎకరాల పచ్చని పొలాలను రాజధాని పేరుతో తీసుకున్న చంద్రబాబు ప్రభుత్వం వాటిని ఎడారిగా మార్చేసింది. అక్కడ అభివృద్ధి కోసం అంటూ రూ.వేల కోట్లు ఖర్చు చేసినా కనీసం టీ హోటల్‌ కూడా లేదు.  రాష్ట్రంలోని అన్ని ప్రాంతల అభివృద్ధి కోసం సీఎం జగన్‌ వికేంద్రీకరణ దిశగా అడుగులు వేస్తున్నారు.  చంద్రబాబు లాంటి వాళ్లు ఎంత మంది అడ్డుకున్నా అవి తాత్కాలికమే. రాయలసీమ గర్జనకు మా పూర్తి సహకారం ఉంటుంది. 
– గడికోట శ్రీకాంత్‌రెడ్డి, విప్, రాయచోటి ఎమ్మెల్యే  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement