Rayalaseema Garjana
-
కర్నూలులో న్యాయరాజధాని పెట్టి తీరాల్సిందే అంటోన్న రాయలసీమ ప్రజలు
-
‘సీమ’వాసుల సింహనాదం: గర్జించిన కర్నూలు
సాక్షి ప్రతినిధి, కర్నూలు: రాయలసీమ గర్జన పేరుతో ‘సీమ’వాసులు సోమవారం కర్నూలులో సింహనాదం చేశారు. ‘సీమవాసుల న్యాయమైన’ ఆకాంక్షను యావత్ రాష్ట్రానికి తెలిసేలా గర్జించారు. హైకోర్టు సాధించేవరకూ విశ్రమించేది లేదని, ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని శపథం చేశారు. ‘జై రాయలసీమ.. ఉయ్ వాంట్ జ్యుడీషియల్ క్యాపిటల్’ అంటూ కర్నూలు నగరం హోరెత్తేలా.. దిక్కులు పిక్కటిల్లేలా నినదించారు. ‘రాయలసీమ గర్జన’ పేరుతో పొలిటికల్, నాన్ పొలిటికల్ జేఏసీలు నగరంలోని ఎస్టీబీసీ మైదానంలో నిర్వహించిన భారీ బహిరంగసభ ప్రజలతో పోటెత్తింది. ఉదయం 10 గంటలకే ‘సీమ’ జిల్లాల నుంచి ప్రజలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు భారీగా తరలివచ్చారు. సభా ప్రాంగణం నిండిపోవడంతో సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రజలు రోడ్డు బయటే నిలుచుండిపోయారు. కర్నూలులోని అన్ని రహదారులు జనసంద్రమయ్యాయి. మధ్యాహ్నం 1.30 గంటల వరకూ సభ జరుగుతున్నంతసేపు ‘న్యాయ రాజధాని’ కావాలని నినాదాలు చేశారు. ఫ్లెక్సీలపై ‘న్యాయ రాజధాని మా హక్కు’ అని రాసి వాటిని బెలూన్లకు జత చేసి గాలిలోకి వదిలారు. ఫ్లకార్డులు ప్రదర్శించి నినాదాలు చేశారు. అందరి నోట ‘న్యాయ రాజధాని’ మాటే పలికింది. కర్నూలు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు బీవై రామయ్య అధ్యక్షతన జరిగిన సభలో మంత్రులు, ప్రజాప్రతినిధులు, జేఏసీ నేతలు ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎవరేమన్నారంటే.. కర్నూలులో రాయలసీమ గర్జనకు హాజరైన అశేష జనవాహినిలో ఓ భాగం ‘న్యాయ రాజధాని’ నిర్మించేది జగన్ ప్రభుత్వమే.. రాయలసీమకు న్యాయం చేసేది.. న్యాయ రాజధానిని నిర్మించేది జగన్ ప్రభుత్వం మాత్రమే. ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కువగా సీమ ముఖ్యమంత్రులే ఉన్నారు. చంద్రబాబు ఎక్కువ కాలం సీఎంగా పనిచేశారు. అయితే అందరూ హైదరాబాద్‌నే అభివృద్ధి చేశారు. మన రాష్ట్రంలో ఏ నగరాన్నీ అభివృద్ధి చేయలేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మూడు ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలని వికేంద్రీకరణ తీసుకొచ్చారు. అమరావతిలో రాజధాని వద్దనలేదు. అక్కడ శాసన వ్యవహారాలు, విశాఖపట్నంలో పాలన రాజధాని ఉంటూనే కర్నూలులో న్యాయరాజధాని నిర్మించాలనుకున్నారు. ప్రజల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోకుండా చంద్రబాబు అమరావతిని రాజధాని చేయాలనుకున్నారు. అమరావతిపై కూడా ఆయనకు ప్రేమలేదు. ఆయన బంధు, అనుచరగణం రూ.వేల కోట్లు దోచుకునేందుకు మాత్రమే అక్కడ రాజధాని నిర్మించాలనుకున్నారు. ఇటీవల కర్నూలుకు వచ్చి హేళన చేస్తూ మాట్లాడి ‘సీమద్రోహి’గా మిగిలిపోయారు. – పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గనులు, ఇంధన శాఖ మంత్రి కర్నూలు జగన్నాథగట్టుపై హైకోర్టు.. ఎన్ని శక్తులు అడ్డుపడినా, చంద్రబాబులాంటోళ్లు ఎన్ని కుట్రలు చేసినా కర్నూలు జగన్నాథగట్టుపై హైకోర్టు నిర్మిస్తాం. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయడం చంద్రబాబుకు ఇష్టం ఉందో.. లేదో చెప్పాలి. శతాబ్దాల నుంచి అనేక కరువు కాటకాలను ‘సీమ’ చవిచూసింది. విజయనగర సామ్రాజ్యంలో భరత ఖండంలోనే అత్యంత సంపన్న ప్రాంతంగా ఉన్న సీమ ఇలా తయారైంది. ఇన్ని దశాబ్దాల తర్వాత బాధ్యత గల వ్యక్తి సీమకు హైకోర్టు ఇస్తా అంటే ఎందుకు అడ్డుపడుతున్నారు. మూడు ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలని మా ముఖ్యమంత్రి తపన పడుతున్నారు. చంద్రబాబుకు కృష్ణా, గుంటూరుతో పాటు రాష్ట్రంలో ఏ ప్రాంతంపైనా ప్రేమ లేదు. చంద్రబాబుకు, ఆయన రియల్ ఎస్టేట్ బ్యాచ్‌కు ఉన్న ప్రేమ రాజధాని కోసం సేకరించిన 30 చదరపు కిలోమీటర్ల భూమిపైనే. శ్రీబాగ్ ఒప్పందం, ఆరు సూత్రాలు, 8 సూత్రాల ఒప్పందాలు కర్నూలుకు అనుకూలంగా ఉన్నాయి. శ్రీకృష్ణ, శివరామకృష్ణ కమిటీలు సైతం సమత్యుల అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని చెప్పాయి. – బుగ్గన రాజేంద్రనాథ్, ఆర్థిక శాఖ మంత్రి 26 జిల్లాల అభివృద్ధి సీఎం సంకల్పం దశాబ్దాలుగా సీమ వాసులకు అన్యాయం జరుగుతోంది. చంద్రబాబు కర్నూలుకు వచ్చి ఇక్కడి టీడీపీ నేతలతో అమరావతికి అనుకూలంగా, సీమకు వ్యతిరేకంగా నినాదాలు చేయించి మన ప్రాంతాన్ని హేళన చేశారు. 29 గ్రామాలు అభివృద్ధి చంద్రబాబు ఆలోచన కాగా 26 జిల్లాల అభివృద్ధి ముఖ్యమంత్రి సంకల్పం. – అంజాద్‌బాషా, డిప్యూటీ సీఎం ‘సీమ’కు న్యాయం చేసింది నాడు వైఎస్సార్.. నేడు జగన్ ఎందరో ముఖ్యమంత్రులు రాష్ట్రాన్ని పాలించారు. సీమకు మేలు చేసింది ఇద్దరే. సాగునీటి ప్రాజెక్టులు నిర్మించి వైఎస్ కరువు పోగొడితే.. న్యాయ రాజధానిని నిర్మించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని జగన్ భావించారు. – ఆకేపాటి అమర్నాథ్రెడ్డి, వైఎస్సార్సీపీ కర్నూలు, నంద్యాల జిల్లాల రీజినల్ కోఆర్డినేటర్ త్యాగానికి కూడా హద్దు ఉంటుంది.. 1956లో అప్పటికి రాజధానిగా ఉన్న కర్నూలును త్యాగం చేశాం. అలాగే శ్రీశైలం ప్రాజెక్టుకు 80 వేల ఎకరాల భూములిచ్చాం. త్యాగానికి, ధర్మానికి కూడా హద్దుంటుంది. లేదంటే అన్యాయమవుతాం. – కాటసాని రాంభూపాల్‌రెడ్డి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, నంద్యాల జిల్లా మాది త్యాగం కాదా? రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం భూములిచ్చిన అమరావతి వాసులది త్యాగమైతే, శ్రీశైలం ప్రాజెక్టుకు భూములు ఇచ్చిన మనది త్యాగం కాదా? భూములు కోల్పోయినవారు ఇప్పటికీ 98 జీవో ప్రకారం ఉద్యోగాలు ఇవ్వాలని పోరాటం చేస్తున్నారు. చంద్రబాబు జీవో 69 తీసుకొచ్చి సీమ రైతులు, జీవో 120 తీసుకొచ్చి విద్యార్థుల పొట్ట కొట్టారు. ‘అనంత’కు మంజూరైన ఎయిమ్స్‌ను మంగళగిరికి తరలించి మోసం చేశారు. – బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, శాప్ చైర్మన్ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం.. న్యాయ రాజధాని మా హక్కు. చంద్రబాబు ఇటీవల కర్నూలుకు వచ్చి మాట్లాడిన మాటలు గర్హనీయం. ముఖ్యమంత్రి న్యాయ రాజధానికి సుముఖంగా ఉన్నారు. కానీ కొన్ని శక్తులు అడ్డుపడుతున్నాయి. ఉద్యమాలను మరింత ఉధృతం చేసి వారిపై ఒత్తిడి తెస్తాం. – విజయ్‌కుమార్‌రెడ్డి, జేఏసీ చైర్మన్ ‘‘రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన ప్రాంతం.. రాయలసీమ. రాజధాని కోసం కర్నూలును, శ్రీశైలం ప్రాజెక్టు కోసం 55 వేల ఎకరాల భూములను ఈ ప్రాంతం త్యాగం చేసింది. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం రాజధాని కర్నూలులో ఉండాలి. కనీసం హైకోర్టునైనా కర్నూలులో పెట్టండని అడిగితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముందుకొచ్చి హైకోర్టు ఏర్పాటుపై నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు, కొన్ని ప్రతిపక్షాలు దాన్ని అడ్డుకుంటున్నాయి. ఏం చేస్తున్నార్రా అని మా పిల్లలను అడిగితే హైదరాబాద్‌లో ఉద్యోగం, బెంగళూరులో చదువు, చెన్నైలో శిక్షణ తీసుకుంటున్నామంటున్నారు. ఎన్నేళ్లయినా మా ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్తే తప్ప బతకలేమా? వాటికి సమానంగా ఒక నగరాన్ని నిర్మించుకోలేమా? త్యాగాలకు కూడా ఒక హద్దు ఉంటుంది. ఇప్పుడు ఉద్యమాలు చేయాలి.. కచ్చితంగా హైకోర్టు ఏర్పాటు చేసుకోవాలి’’ – రాయలసీమ గర్జనలో జేఏసీ నేతలు, ప్రజాప్రతినిధులు -
దద్దరిల్లిన సీమ గర్జన.. గ్రాండ్ సక్సెస్.. భారీగా తరలివచ్చిన రాయలసీమ వాసులు
సాక్షి, కర్నూలు: రాయలసీమ ముఖద్వారమైన కర్నూలు మరో చరిత్రాత్మక ఘట్టానికి వేదికైంది. దశాబ్దాల తరబడి కొనసాగుతున్న అన్యాయంపై రాయలసీమ వాసులు గళమెత్తారు. కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటుకు ఉద్యమ బాట పట్టారు. ‘రాయలసీమ గర్జన’ పేరుతో సోమవారం ఎస్టీబీసీ కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. సభకు భారీగా రాయలసీమ వాసులు తరలివచ్చారు. దీంతో కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటే లక్ష్యంగా చేపట్టిన రాయలసీమ గర్జన సూపర్ సక్సెస్ అయ్యింది. గర్జనకు మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్, అంజాద్ బాషా, జయరాం, ఉషశ్రీచరణ్, ఎమ్మెల్యేలు శ్రీకాంత్‌రెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి తదితరులు హాజరయ్యారు. న్యాయ రాజధానిపై జనం నినదించారు. శ్రీబాగ్ ఒప్పందం అమలు, న్యాయ రాజధాని ఏర్పాటుకు డిమాండ్ చేశారు. వెనుకబడిన రాయలసీమ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్నారు. నారాసుర భూతం దిష్టిబొమ్మను సీమ జనం దగ్ధం చేశారు. రాయలసీమ ద్రోహి అంటూ నినాదాలు చేశారు. సభకు మేధావులు, విద్యావంతులు, న్యాయవాదులు, విద్యార్థి సంఘాలతో పాటు అన్ని వర్గాల ప్రజలు మద్దతు ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలనే నినాదంతో ముందుకు వెళ్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాయలసీమ గర్జనకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ సభకు కర్నూలుతో పాటు నంద్యాల, వైఎస్సార్, అన్నమయ్య, అనంతపురం, శ్రీ సత్యసాయి పుట్టపర్తి, తిరుపతి, చిత్తూరు జిల్లాలతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ప్రజా సంఘాల నాయకులు, మేధావులు, న్యాయవాదులు, ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. స్వప్రయోజనాల కోసమే చంద్రబాబు ఆరాటం: మంత్రి పెద్దిరెడ్డి వికేంద్రీకరణ కోసమే సీఎం జగన్ మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేయాలన్నదే సీఎం జగన్ లక్ష్యమన్నారు. చంద్రబాబుకు అసలు చిత్తశుద్ధి లేదని, స్వప్రయోజనాల కోసమే ఆయన ఆరాటం అని పెద్దిరెడ్డి దుయ్యబట్టారు. హైకోర్టు సాధించే వరకూ పోరాటం ఆగదు: మంత్రి బుగ్గన వికేంద్రీకరణతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పేర్కొన్నారు. వికేంద్రీకరణను వ్యతిరేకించే పార్టీలకు బుద్ధి చెప్పేందుకు ఈ రాయలసీమ గర్జన అన్నారు. చంద్రబాబు కుప్పంలో అభివృద్ధి చేయలేకపోయారు. కుప్పాన్ని అన్ని విధాల సీఎం జగన్ అభివృద్ధి చేశారు. చంద్రబాబు దృష్టిలో ఇది రాళ్ల సీమ.. మా దృష్టిలో రత్నాల సీమ. రియల్టర్లపైనే చంద్రబాబుకు ప్రేమ. రాయలసీమకు హైకోర్టు ఇస్తానంటే ఎందుకు అడ్డుపడుతున్నారు. హైకోర్టు సాధించే వరకూ పోరాటం ఆగదని, మంత్రి బుగ్గన స్పష్టం చేశారు. -
రాయలసీమ గర్జన
-
రాయలసీమ గర్జన సభకు పెద్దఎత్తున తరలివస్తున్న ప్రజలు
-
న్యాయ రాజధాని కోసం కదం తొక్కిన సీమ వాసులు
అప్డేట్స్ 01:08PM రాయలసీమ గర్జన సూపర్ సక్సెస్ కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటే లక్ష్యంగా చేపట్టిన రాయలసీమ గర్జన సూపర్ సక్సెస్ అయ్యింది. ఈ గర్జనకు విశేషమైన ప్రజా స్పందన లభించింది. దీనికి రాయలసీమ వాసులు భారీగా తరలివచ్చారు. విద్యార్థులు, న్యాయవాదులు, మేధావులు రాయలసీమ గర్జన సభలో పాల్గొన్నారు. 12:00PM చంద్రబాబుకు రాష్ట్రాభివృద్ధి ఇష్టం లేదు: గుమ్మనూరు జయరాం మూడు రాజధానులపై చంద్రబాబు కుట్ర చేస్తున్నారు: గుమ్మనూరు జయరాం మూడు ప్రాంతాలకు సమన్యాయం చేయాలనే సీఎం జగన్ ముందకెళ్తున్నారు: డిప్యూటీ సీఎం అంజాద్ భాషా ప్రజలకు ద్రోహం చేయాలని చంద్రబాబు చూస్తున్నారు: డిప్యూటీ సీఎం అంజాద్ భాషా 11:48AM రాష్ట్రాభివృద్ధిని చంద్రబాబు అడ్డుకుంటున్నారు: ఎమ్మెల్సీ ఇక్బాల్ చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పడానికి సీమ ప్రజలు సిద్ధంగా ఉన్నారు వికేంద్రీకరణలో భాగంగానే కర్నూలులో న్యాయరాజధాని: ఎమ్మెల్యే రాంభూపాల్‌రెడ్డి న్యాయ రాజధాని కోసం ఎంతకైనా పోరాడతాం 11:52AM రాజధాని అడిగే హక్కు రాయలసీమ వాసులకు ఉంది: బైరెడ్డి సిద్ధార్థ్‌రెడ్డి శ్రీశైలం ప్రాజెక్టుకు భూములిచ్చి రైతులకు ఎంతో త్యాగం చేశారు రాయలసీమకు చంద్రబాబు ద్రోహం చేశారు అన్ని ప్రాంతాలకు సమానంగా రాయలసీమ అభివృద్ధి చేయాలి 11:20AM నారాసుర భూతం దిష్టిబొమ్మను దగ్థం చేసిన సీమజనం రాయలసీమ ద్రోహి చంద్రబాబు అంటూ నినాదాలు 10:30AM మంత్రి బుగ్గన కామెంట్స్ వికేంద్రీకరణతోనే రాష్ట్రాభివృద్ధి వికేంద్రీకరణను వ్యతిరేకించే పార్టీలకు బుద్ధి చెప్పేందుకు ఈ రాయలసీమ గర్జన చంద్రబాబు కుప్పంలో ఎటువంటి అభివృద్ధి చేయలేకపోయారు కుప్పాన్ని అన్ని విధాల సీఎం జగన్ అభివృద్ధి చేశారు చంద్రబాబు దృష్టిలో ఇది రాళ్ల సీమ.. మా దృష్టిలో రత్నాల సీమ రియల్టర్లపైనే చంద్రబాబుకు ప్రేమ రాయలసీమకు హైకోర్టు ఇస్తానంటే ఎందుకు అడ్డుపడుతున్నారు హైకోర్టు సాధించే వరకూ పోరాటం ఆగదు మంత్రి పెద్దిరెడ్డి కామెంట్స్ వికేంద్రకరణ కోసమే సీఎం జగన్ మూడు రాజధానుల నిర్ణయం అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేయాలన్నదే సీఎం జగన్ లక్ష్యం చంద్రబాబుకు అసలు చిత్తశుద్ధి లేదు స్వప్రయోజనాలకోసమే చంద్రబాబు ఆరాటం రాయలసీమ వాసులకు మంచి చేయాలనే ఆలోచన చంద్రబాబుకు లేదు: మంత్రి ఉషశ్రీ చరణ్ వికేంద్రీకరణతో టీడీపీకి మనుగడ ఉండదని చంద్రబాబుకు భయం పట్టుకుంది: మంత్రి ఉషశ్రీ చరణ్ చంద్రబాబు రాయలసీమ ద్రోహి: ఎమ్మెల్యే శ్రీదేవి చంద్రబాబులాంటి ప్రతిపక్షనేతలు ఉండటం దురదృష్టకరం: ఎమ్మెల్యే శ్రీదేవి వికెంద్రీకరణను అడ్డుకునేందుకు చంద్రబాబు కుట్ర చేస్తున్నారు: ఎమ్మెల్యే శ్రీదేవి 10:00AM కర్నూలులో ప్రారంభమైన జేఏసీ రాయలసీమ గర్జన సభ కర్నూలు న్యాయ రాజధాని కోసం గళం విప్పిన సీమ వాసులు రాయలసీమ జిల్లాల నుంచి సభాస్థలికి భారీగా తరలివచ్చిన జనం శ్రీబాగ్ ఒప్పంద ప్రాకరం కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలంటూ డిమాండ్ సభా స్థలికి చేరుకున్న ప్రజాప్రతినిధులు, మేధావులు రాయలసీమ గర్జన సభకు పెద్ద ఎత్తున తరలివచ్చిన మేధావులు, విద్యావేత్తలు, ప్రజా సంఘాల నాయకులు, వైఎస్సార్సీపీ నేతలు గర్జనకు హాజరైన మంత్రులు పెద్దిరెడ్డి, బుగ్గన, అంజాద్ బాషా, జయరాం, ఉషశ్రీచరణ్ సభకు హాజరైన ఎమ్మెల్యేలు శ్రీకాంత్‌రెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డిలతో పాటు ఎమ్మెల్సీ ఇక్బాల్ ‘మా నినాదం ఒక్కటే.. కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేయడమే’ అంటూ సీమ వాసులు కదం తొక్కారు. దీనిలో భాగంగా సోమవారం ఉదయం 10 గంటలకు ఎస్టీబీసీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు ప్రజలు భారీగా తరలివస్తున్నారు. అన్ని విధాలా వెనుకబడి ఉన్న రాయలసీమ అభివృద్ధిని అడ్డుకోవద్దని, నాడు రాజధానిని కోల్పోయినందున.. నేడు న్యాయ రాజధాని అయినా ఇవ్వాలని ‘సీమ’ జిల్లాల ప్రజలు దిక్కులు పిక్కటిల్లేలా కర్నూలు వేదికగా నేడు గర్జించనున్నారు. శ్రీబాగ్ ఒప్పందం మేరకు 1937లో కాశీనాథుని నాగేశ్వరరావు ఇంట్లో పెద్దమనుషులు చేసిన ఒప్పందం మేరకు కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని సీమవాసులు డిమాండ్ చేస్తున్నారు. ఆరు దశాబ్దాలుగా ఇచ్చిన మాటను నెరవేర్చడాన్ని పాలకులు నిర్లక్ష్యం చేసినా, 2020లో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజల అభీష్టం మేరకు జీఎన్ రావు కమిటీ నివేదిక ఆధారంగా కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేసి ‘న్యాయం’ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఉమ్మడి ఆరు జిల్లాల నుంచి.. కర్నూలు నగరంలో ఎస్టీబీసీ మైదానంలో జరిగే ఈ సభకు అన్ని ఏర్పాట్లను జేఏసీ, వైఎస్సార్సీపీ నేతలు పూర్తి చేశారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, కర్నూలు, నంద్యాల జిల్లా అధ్యక్షులు బీవై రామయ్య, కాటసాని రాంభూపాల్‌రెడ్డి వారం రోజులుగా దీనిపై కసరత్తు చేస్తున్నారు. ఈ సభకు ‘గ్రేటర్ రాయలసీమ’లోని ఉమ్మడి ఆరు జిల్లాల్లోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తరలిరానున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధాహ్నం 2 గంటల వరకు జరిగే ఈ సభకు ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, ఎన్జీవోలు, స్వర్ణకారులు, వస్త్ర వ్యాపారులు, ఆటో డ్రైవర్లు.. చివరకు తోపుడు బండ్లు, పాల వ్యాపారులు కూడా స్వచ్ఛందంగా మద్దతు ప్రకటించి గళం విప్పేందుకు సిద్ధమయ్యారు. -
ఇంత విషమా? కూసింత బాబుగారి వైపు చూడరా?
ఊహించిందే. ఎప్పటిలాగే విషపు రాతలు. సీమంతైనా మేలు చేశారా? అంటూ సీఎం జగన్‌ను, ఏపీ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ చంద్రబాబుకు కొమ్ముకాస్తూ కాకమ్మ కథలు రాసింది ఈనాడు . అఫ్కోర్స్.. అది కర్నూల్లో రాయలసీమ గర్జన నేపథ్యంలో ఉక్రోశంతో రాసిందే!. కానీ. పరిస్థితులను ఒక్కసారి బేరీజూ వేసుకోవాలి కదా. ఆ మాత్రం సోయి లేకపోతే ఎలా? అన్నింటికి మించి తల్లి పాలు త్రాగి రొమ్ము గుద్దే చంద్రబాబు ఘనతను కూడా ఒక్కసారైన గుర్తించాలి కదా!. పద్నాలుగేళ్లుగా ముఖ్యమంత్రిగా చేసిన బాబు రాయలసీమ లోనే కాదు, రాష్ట్రంలో ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయినా పూర్తి చేసారా?.. ఇదీ ఈనాడు గుర్తించాల్సిన ప్రధానమైన విషయం. అంతెందుకు సొంత నియోజకవర్గం కుప్పంలోనే బ్రాంచ్ కెనాల్ పూర్తి చేయలేకపోయాడు. మరి సీఎం జగన్.. ఆరు నెలల్లో హంద్రీ–నీవా కుప్పం బ్రాంచ్ కెనాల్‌ను పూర్తి చేస్తారు. బాబు హయాంలో కంటే.. సీఎం జగన్ హయాంలోనే ఇరిగేషన్ పనులు ఊపందుకున్నాయనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి. అయినా ఇది జనమెరిగిన సత్యం. ► వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సీఎం అయ్యాక 2 సంవత్సరాలు కరోనా ఉంది అని మరిచిపోతే ఎలా?.. అయినా కూడా పరిస్థితులకు ఎదురొడ్డి పనులను త్వరగతిన పూర్తి చేసే యత్నం చేస్తున్నారు కదా. ఓ.. బాబూ డైరెక్షన్ కదా.. అందుకే అవేమీ పేపర్‌కి ఎక్కవేమో!. ► ఇది పక్కన పెడితే.. రాయలసీమలో శ్రీ సిటీ సంగతి ఏంటి? అది ఆనాడు మహానేత వైఎస్ఆర్ ప్రారంభించారు. ఇప్పుడు అది ఏపీ పరిశ్రమల కేంద్రంగా విరజిల్లుతోంది. అచ్చం శ్రీసిటీ లాగా .. కడప కొప్పర్తిని అభివృద్ధి చేస్తున్నారు జన నేత వైఎస్ జగన్. మరి చంద్రబాబు ఏం చేశాడు?.. సీమ లో పుట్టి సీమకు ద్రోహం చేయడం తప్పించి!. ► కరువు సీమగా పేరొందిన రాయలసీమకు నీళ్లు ఇవ్వాలని, 2007-08లో ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి.. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ను 11 వేల క్యూసెక్కుల నుంచి 44 వేల క్యూసెక్కుల సామర్ద్యానికి పెంచడానికి చర్యలు చేపట్టారు. అప్పుడేం జరిగిందో ఈనాడుకు గుర్తు లేనట్లుంది. ఒకసారి గుర్తు చేద్దాం.. బాబుగారి(చంద్రబాబు) ఆదేశాల మేరకు, యెల్లో పార్టీ నేతలు దేవినేని ఉమ చౌదరి , కోడెల శివప్రసాదరావు చౌదరి తదితరులు పెద్ద ఎత్తున విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్దకు చేరుకున్నారు. ధర్నా చేసి మరీ రాయలసీమకు వైఎస్ జలాన్ని మళ్లిస్తున్నారని, ఇది జలదోపిడీ అంటూ ఆందోళన చేశారు. మరొకటి చూద్దాం.. ► మద్రాస్ లో వరదలు వచ్చినప్పుడు పక్కనే తిరుపతిలో పదివేల ఉద్యోగాలు కల్పన కోసం హెచ్‌సీఎల్ ఏర్పాటు చేస్తామని.. ఆ కంపెనీ చైర్మన్ శివనాడార్ తిరుమలకు వచ్చిన సందర్బంలో ప్రకటించారు. కానీ, సీఎంగా చంద్రబాబు చేసింది ఏంటి?.. శివనాడార్‌పై ఒత్తిడి తెచ్చి తన అమరావతిలో పెట్టమని ఒత్తిడి చేయడమా?. ► కేంద్రం ఇచ్చిన అన్ని సంస్థల్లో ఉన్నతమైంది ఎయిమ్స్. ఆ ఎయిమ్స్ అనంతపురం నుంచి మంగళగిరికి తరలిపోయింది బాబుగారి దయవల్ల కాదా? ► శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం (నవంబర్ 16,1937) .. రాజధాని, హైకోర్టుల్లో ఏదో ఒకటి రాయలసీమకు ఇవ్వాలి. అందులో ఏం కావాలో కోరుకునే స్వేచ్ఛ సైతం రాయలసీమకుంది. కానీ చంద్రబాబు ఏం చేశాడు? అన్నీ అమరావతి లోనే పెట్టి మా వాళ్ళు మాత్రమే బాగుపడాలని కోరుకున్నాడు. పోనీ ఇవన్నీ పక్కనపెడితే.. ► కాపు గర్జన సందర్భంగా అప్పుడు తునిలో రైలు తగలపడితే ఇది రాయలసీమ రౌడీల పని అని ప్రకటన ఇచ్చాడు చంద్రబాబు. మరి అరెస్ట్ చేసింది కోస్తా కాపులను!. రాయలసీమ ద్రోహిగా బాబుగారు సాధించిన పై ఘనతలు.. బహుశా ఈనాడుకు, దాని అధినేత రామోజీరావు, మిగిలిన యెల్లో మీడియా పేపర్లు.. ఛానెల్స్ దృష్టిలో ఏనాటికీ పడవేమో! -
‘సీమ’ గర్జన: 1937 పెద్ద మనుషుల ఒప్పందంలో ఏముందంటే..
కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటుకు ఉద్యమ బాట పట్టారు రాయలసీమ వాసులు. ‘రాయలసీమ గర్జన’ పేరుతో సోమవారం ఎస్టీబీసీ కళాశాల భారీ బహిరంగ సభకు వేదిక కానుంది.దీనికి మేధావులు, విద్యావంతులు, న్యాయవాదులు, విద్యార్థి సంఘాలతో పాటు అన్ని వర్గాల ప్రజలు మద్దతు ప్రకటించారు. పెద్ద మనుషుల ఒప్పందంలో ఏముందంటే.. వెనుకబడిన రాయలసీమను అభివృద్ధి చేయాలని డిమాండ్ వినిపిస్తున్న నేపథ్యంలో 1937లో పెద్ద మనుషులు రాజధాని లేదంటే హైకోర్టు ఏర్పాటు చేయాలనే ఒప్పందం చేసుకున్నారు. మద్రాసు నుంచి విడిపోయిన తర్వాత కర్నూలు కొన్ని రోజులు రాజధానిగా ఉండేది. ఈ విధంగా 1937 నాడే ఆంధ్ర – రాయలసీమ పెద్దలు పాలనా, అభివృద్ధి వికేంద్రీకరణకు తొలి అడుగు వేశారు. ఈ ఒప్పందంపై నమ్మ కంతోనే ఆంధ్రరాష్ట్రం సాధనలో సీమవాసులు ముందుండి పోరాడారు. 1952లో సిద్ధేశ్వరం అలుగు శంఖు స్థాపన చేస్తామని ముందుకొచ్చిన ఉమ్మడి మద్రాసు ప్రభుత్వ ఆఫర్‌ను కూడా కాదనుకొని నిలిచారు. 1953లో ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది. కర్నూలులో రాజధాని, గుంటూరులో హైకోర్టు ఏర్పడినాయి. మూడేళ్ళకే 1956లో కర్నూలు రాజధాని హైదరాబాదు చేరింది. సీమలోని సిద్ధేశ్వరంను వదిలేసి నాగార్జున సాగర్ నిర్మాణం చేపట్టారు. శ్రీ బాగ్ ఒప్పందం అటకెక్కింది. దశాబ్దాల తర్వాత తెలంగాణ విడిపోయింది. శ్రీబాగ్ ఒప్పందం పునాదిగా 1953 నాటి ఆంధ్ర రాష్ట్రమే మనముందు ఇప్పుడు నిలిచింది. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల వారూ శ్రీ బాగ్ సాక్షిగా వికేంద్రీకరణ స్ఫూర్తిని చాటాలని, కేవలం పాలనా రంగంలోనే కాక జల వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణల కోసం అడుగు ముందుకు వేయాలనే సంకల్పంతో నేడు(సోమవారం) చేపట్టిందే రాయలసీమ గర్జన. రాష్ట్ర విభజన సమయంలో సైతం ఇక్కడ ప్రజల డిమాండ్‌ను పట్టించుకోలేదు. అధికార వికేంద్రీకరణ అవసరమని శివరామకృష్ణన్ కమిటీ నివేదికలు ఇచ్చినా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దానిని తుంగలోకి తొక్కారు. -
రాయలసీమ గర్జనకు భారీగా తరలిరానున్న ప్రజలు
దశాబ్దాల తరబడి కొనసాగుతున్న అన్యాయంపై గళమెత్తేందుకు రాయలసీమ వాసులు సిద్ధమయ్యారు. కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటుకు ఉద్యమ బాట పట్టారు. ‘రాయలసీమ గర్జన’ పేరుతో సోమవారం ఎస్టీబీసీ కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. సభకు అన్ని వర్గాల ప్రజలు తరలి రానుండడంతో పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. కర్నూలు(రాజ్‌విహార్): రాయలసీమ ముఖద్వారమైన కర్నూలు మరో చరిత్రాత్మక ఘట్టానికి వేదిక కానుంది. సోమవారం ఉదయం 10 గంటలకు ఎస్టీబీసీ కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభను జేఏసీ ఏర్పాటు చేసింది. దీనికి మేధావులు, విద్యావంతులు, న్యాయవాదులు, విద్యార్థి సంఘాలతో పాటు అన్ని వర్గాల ప్రజలు మద్దతు ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలనే నినాదంతో ముందుకు వెళ్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాయలసీమ గర్జనకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ సభకు కర్నూలుతో పాటు నంద్యాల, వైఎస్సార్, అన్నమయ్య, అనంతపురం, శ్రీ సత్యసాయి పుట్టపర్తి, తిరుపతి, చిత్తూరు జిల్లాలతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ప్రజా సంఘాల నాయకులు, మేధావులు, న్యాయవాదులు, ప్రజా ప్రతినిధులు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు పూర్తి చేశారు. గర్జనకు సంపూర్ణ మద్దతు రాయలసీమ గర్జనకు తమ పార్టీ నుంచి సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్‌రెడ్డి, కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం ప్రకటించారు. సీమకు జరిగిన అన్యాయాన్ని వినిపించేందుకు రాయలసీమ జేఏసీ నిర్వహించే సభను జయప్రదం చేయాలని కోరారు. ఆదివారం మంత్రులతో పాటు అసెంబ్లీ వ్యవహారాల సమన్వయకర్త గడికోట శ్రీకాంత్‌రెడ్డి, పార్టీ రీజినల్ కో ఆర్డినేటర్ ఆకేపాటి అమర్నాథ్రెడ్డి, కర్నూలు, నంద్యాల జిల్లాల అధ్యక్షులు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, బీవై రామయ్య, ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్‌ఖాన్ సభా స్థలాన్ని సందర్శించారు. రాయలసీమ జేఏసీ చైర్మన్ విజయ్‌కుమార్‌రెడ్డిని కలిసి ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో కర్నూలు నియోజకవర్గ పరిశీలకుడు కర్రా హర్షవర్ధన్‌రెడ్డి, మాజీ ఎంపీ బుట్టా రేణుక, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి, పార్టీ నగర అధ్యక్షురాలు సత్యనారాయణమ్మ, రాయలసీమ జేఏసీ విద్యార్థి సంఘం చైర్మన్ శ్రీరాములు, కన్వీనర్లు చంద్రప్ప, సునిల్‌రెడ్డి, మణిరెడ్డి, వైఎస్సార్సీపీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు రెడ్డిపొగు ప్రశాంత్, పార్టీ నాయకులు రాజావిష్ణువర్ధన్‌రెడ్డి, తెర్నెకల్ సురేందర్‌రెడ్డి, సీహెచ్ మద్దయ్య, తోట వెంకట కృష్ణారెడ్డి, అక్కిమి హనుమంతరెడ్డి, ఆదిమోహన్‌రెడ్డి, ధనుంజయ ఆచారి, సత్యం యాదవ్ పాల్గొన్నారు. పటిష్ట బందోబస్తు కర్నూలు: రాయలసీమ గర్జన కార్యక్రమానికి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ సిద్దార్థ కౌశల్ తెలిపారు. ఆదివారం జిల్లా పోలీసు కార్యాలయ మైదానంలో బందోబస్తుకు వచ్చిన సిబ్బందితో సమావేశం అయ్యారు. ఎస్టీబీసీ కళాశాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పూర్తి సామర్థ్యంతో పోలీసులు పనిచేయాలన్నారు. ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే శాఖా పరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. బహిరంగ సభ దాదాపు మూడు గంటల పాటు సాగుతుందని, మైదానం జనాలతో నిండిన తర్వాత బయట నుండి ఎక్కువ మంది లోపలికి రాకుండా చూసుకోవాలన్నారు. కార్యక్రమం పూర్తిగా ముగిసే వరకు సిబ్బందికి కేటాయించిన స్థానాల్లోనే ఉండాలన్నారు. హోంగార్డు స్థాయి నుంచి పై స్థాయి అధికారి వరకు అప్రమత్తంగా పనిచేయాలని, ఏమైనా సమస్యలు ఉంటే సత్వరమే స్పందించి పై అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. అడిషనల్ ఎస్పీలు కృష్ణకాంత్ పటేల్, డి.ప్రసాద్, నాగబాబు, డీఎస్పీలు, సీఐలు పాల్గొన్నారు. న్యాయ రాజధానితోనే అభివృద్ధి న్యాయ రాజధానితోనే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని రాయలసీమ జేఏసీ చైర్మన్ (నాన్ పొలిటికల్), చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు విజయ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఛాంబర్ ఆఫ్ కామర్స్ హాల్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీమకు జరిగిన అన్యాయాన్ని దశాబ్దాలుగా విన్నవిస్తూ వస్తున్నామన్నారు. ప్రస్తుత ప్రభుత్వం స్పందించి కర్నూలుకు హైకోర్టును మంజూరు చేస్తే కొందరు అడ్డుకుంటున్నారన్నారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా అన్ని వర్గాలు కలిసి ఉద్యమిస్తే న్యాయరాజధాని కర్నూలుకు వస్తుందన్నారు. సోమవారం కర్నూలులో జరిగే రాయలసీమ గర్జనకు అన్ని వర్గాల ప్రజలు భారీగా తరలిరావాలని కోరారు. రాయలసీమ విద్యార్థి జేఏసీ నాయకులు శ్రీరాములు, చంద్రప్ప మాట్లాడుతూ కర్నూలుకు హైకోర్టును మంజూరు చేస్తే టీడీపీ అధినేత చంద్రబాబు అడ్డుకోవడం తగదన్నారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా ప్రజల మద్దతుతో న్యాయ రాజధాని సాధించుకుంటామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జేఏసీ నాయకులు టీవీ రత్న ప్రసాద్, మాలిక్‌బాషా, రాజశేఖర్, బార్ అసోసియేషన్ సుబ్బయ్య, సునిల్‌రెడ్డి, జయచంద్రారెడ్డి, సుబ్బయ్య, రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పెద్ద మనుషుల ఒప్పందం అమలు చేయాలి వెనుకబడిన రాయలసీమను అభివృద్ధి చేయాలని డిమాండ్ వినిపిస్తున్న నేపథ్యంలో 1937లో పెద్ద మనుషులు రాజధాని లేదంటే హైకోర్టు ఏర్పాటు చేయాలనే ఒప్పందం చేసుకున్నారు. మద్రాసు నుంచి విడిపోయిన తర్వాత కర్నూలు కొన్ని రోజులు రాజధానిగా ఉండేది. అయితే అనతి కాలంలోనే దానిని హైదరాబాద్‌కు తరలించారు. రాష్ట్ర విభజన సమయంలోనూ ఇక్కడి ప్రజల డిమాండ్‌ను పట్టించుకోలేదు. అధికార వికేంద్రీకరణ అవసరమని శివరామకృష్ణన్ కమిటీ నివేదికలు ఇచ్చినా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దానిని తుంగలోకి తొక్కారు. రాజధానితో పాటు హైకోర్టు, అసెంబ్లీ, ఐటీ హబ్, హెల్త్ సిటీ, టూరిజం హబ్ వంటివి అన్నీ అమరావతిలో ఏర్పాటు చేసేందుకు రైతుల నుంచి వేల ఎకరాలు సేకరించారు. అయితే ఆ నిర్మాణాలు పూర్తి కాకపోవడం, జేఏసీ, విద్యార్థి, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మళ్లీ ఆందోళనలు రావడంతో సీమకు జరిగిన అన్యాయాన్ని తెలుసుకొని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వికేంద్రీకరణకు శ్రీకారం చుట్టారు. అసెంబ్లీని అమరావతిలోనే ఉంచి కార్యానిర్వహక రాజధాని వైజాగ్‌లో, న్యాయ రాజధానిని కర్నూలులో ఏర్పాటు చేయాలని ప్రకటించారు. అయితే టీడీపీ నేతలు దీనిని అడ్డుకుంటూ వస్తున్నారు. దీనిపై రాయలసీమ జేఏసీ నాయకులు రాయలసీమ గర్జన పేరుతో కర్నూలులో భారీ సభను ఏర్పాటు చేశారు. దీనికి వైఎస్సార్సీపీ సంపూర్ణ మద్దతు తెలపడంతో ఆ పార్టీ ప్రజా ప్రతినిధులు ఏర్పాట్లను పరిశీలించి, తగిన సలహాలు సూచనలు ఇస్తూ వస్తున్నారు. -
‘న్యాయ రాజధాని’ మా హక్కు
సాక్షి ప్రతినిధి, కర్నూలు/కర్నూలు (రాజ్‌విహార్) : అన్ని విధాలా వెనుకబడి ఉన్న రాయలసీమ అభివృద్ధిని అడ్డుకోవద్దని, నాడు రాజధానిని కోల్పోయినందున.. నేడు న్యాయ రాజధాని అయినా ఇవ్వాలని ‘సీమ’ జిల్లాల ప్రజలు దిక్కులు పిక్కటిల్లేలా కర్నూలు వేదికగా నేడు గర్జించనున్నారు. శ్రీబాగ్ ఒప్పందం మేరకు 1937లో కాశీనాథుని నాగేశ్వరరావు ఇంట్లో పెద్దమనుషులు చేసిన ఒప్పందం మేరకు కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని సీమవాసులు డిమాండ్ చేస్తున్నారు. ఆరు దశాబ్దాలుగా ఇచ్చిన మాటను నెరవేర్చడాన్ని పాలకులు నిర్లక్ష్యం చేసినా, 2020లో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజల అభీష్టం మేరకు జీఎన్ రావు కమిటీ నివేదిక ఆధారంగా కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేసి ‘న్యాయం’ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ప్రతిపక్ష పార్టీ.. హైకోర్టు ఏర్పాటుకు అడ్డు తగులుతూనే ఉంది. దీనిపై కర్నూలు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వంద రోజులకుపైగా రిలే దీక్షలు చేశారు. రాయలసీమ జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీలు, నిరసనలు, మానవ హారాలు చేశారు. వెనుకబడిన ప్రాంతానికి న్యాయం దక్కుతుందని ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలిపారు. ఇదే క్రమంలో ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చిన చంద్రబాబుకు కూడా తమ ఆకాంక్షను నిరసన రూపంలో తెలియజేశారు. అయితే కర్నూలు వేదికగా చంద్రబాబు సీమ ప్రజల ఆకాంక్షలకు గండికొట్టేలా, కర్నూలులో హైకోర్టు అవసరం లేదని, రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతి మాత్రమే ఉండాలని అంటూ.. టీడీపీ కార్యకర్తలతోనూ అదే విధంగా నినాదాలు చేయించి సీమ ప్రజలను మరింత రెచ్చగొట్టారు. ఈ క్రమంలో ‘సీమ వాణి’ మరింత గట్టిగా వినిపించేందుకు జేఏసీ నేతలు సిద్ధమయ్యారు. ‘రాయలసీమ గర్జన’ పేరుతో నేడు భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. దీనికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. సభాప్రాంగణాన్ని పరిశీలిస్తున్న మంత్రి బుగ్గన ఉమ్మడి ఆరు జిల్లాల నుంచి.. కర్నూలు నగరంలో ఎస్టీబీసీ మైదానంలో జరిగే ఈ సభకు అన్ని ఏర్పాట్లను జేఏసీ, వైఎస్సార్సీపీ నేతలు పూర్తి చేశారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, కర్నూలు, నంద్యాల జిల్లా అధ్యక్షులు బీవై రామయ్య, కాటసాని రాంభూపాల్‌రెడ్డి వారం రోజులుగా దీనిపై కసరత్తు చేస్తున్నారు. ఈ సభకు ‘గ్రేటర్ రాయలసీమ’లోని ఉమ్మడి ఆరు జిల్లాల్లోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తరలిరానున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధాహ్నం 2 గంటల వరకు జరిగే ఈ సభకు ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, ఎన్జీవోలు, స్వర్ణకారులు, వస్త్ర వ్యాపారులు, ఆటో డ్రైవర్లు.. చివరకు తోపుడు బండ్లు, పాల వ్యాపారులు కూడా స్వచ్ఛందంగా మద్దతు ప్రకటించి గళం విప్పేందుకు సిద్ధమయ్యారు. మొదటగా లక్ష మందితో సభ నిర్వహించాలని భావించినా, నిఘా వర్గాలు, నిర్వాహకుల లెక్క ప్రకారం అంతకు మించి భారీగా ప్రజలు తరలి రానున్నారని తెలుస్తోంది. దీంతో ట్రాఫిక్‌కు, వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ‘న్యాయ రాజధాని’ ప్రకటనతో వేగంగా అభివృద్ధి హైకోర్టు ఏర్పాటైతే నాలుగు జిరాక్స్ మిషన్లు మినహా ఏం ఉపయోగం లేదని కొంత మంది హేళన చేస్తున్నారు. రాష్ట్రంలో నాలుగో అతిపెద్ద నగరం, సౌత్ ఇండియాకు ముఖ ద్వారం కర్నూలు. న్యాయ రాజధానిగా కర్నూలును ప్రకటిస్తే సాధారణ నగరాల కంటే భిన్నమైన అభివృద్ధి జరుగుతుంది. బెంగళూరు–హైదరా>బాద్, చెన్నై–బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ల పరిధిలో కర్నూలు ఉంది. ఇప్పటికే పారిశ్రామికంగా కర్నూలు వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ క్రమంలో ‘న్యాయ రాజధాని’ అయితే పారిశ్రామికవేత్తలు హైదరాబాద్‌కు ప్రత్యామ్నాయంగా కర్నూలును ఎంచుకునే అవకాశం ఉంది. వాతావరణ పరిస్థితులు, భూమి, నీటి లభ్యత హైదరాబాద్ కంటే మరింత మేలుగా ఉండే అవకాశం ఉంది. రోడ్డు, రైలు మార్గాలతో పాటు విమానాశ్రయం కూడా ఉంది. దీంతో ప్రధాన నగరాలకు రవాణా సౌకర్యం కూడా మెరుగ్గా ఉంటుంది. హైకోర్టు ఏర్పాటైతే లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్‌తో పాటు 43కు పైగా ట్రిబ్యునల్స్ ఏర్పాటయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రభుత్వం లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్, ఏసీబీ కోర్టు కర్నూలులో ఏర్పాటు చేసింది. వీటి ఏర్పాటుతో నగరంలో నిర్మాణ రంగం వేగం పుంజుకోనుంది. నగర పరిధి విస్తరించనుంది. దీంతో ఉపాధి, వ్యాపార అవకాశాలు మెరుగు పడతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే 1953లో రాష్ట్ర రాజధానిగా ఉన్న కర్నూలును 1956లో త్యాగం చేయకుండా ఉండి ఉంటే ‘సీమ’ జిల్లాల ముఖచిత్రం మరోలా ఉండేది. త్యాగం చేయడంతో కర్నూలుతో పాటు సమీప జిల్లాలైనా అనంతపురం, వైఎస్సార్ జిల్లాలు కూడా భారీగా నష్టపోయాయి. అందుకే ఈ దఫా ఎట్టి పరిస్థితుల్లో ‘న్యాయ రాజధాని’ సాధించాలని ‘సీమ’ వాసులు గట్టిగా సంకల్పించారు. ఆ దిశగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నారు. కాగా, పార్టీ రీజినల్ కో ఆర్డినేటర్ ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి, పార్టీ కర్నూలు, నంద్యాల జిల్లా అధ్యక్షులు బీవై రామయ్య, కాటసాని రాంభూపాల్‌రెడ్డి, ఎమ్మెల్యే ఎంఎ హఫీజ్‌ఖాన్, తదితరులు మైదానంలో ఏర్పాట్లు పరిశీలించారు. వెనుకబడిన ప్రాంతానికి న్యాయం జరగాలి ‘సీమ’ అత్యంత వెనుకబడిన ప్రాంతం. దీనికి న్యాయం చేసేందుకు హైకోర్టు ఏర్పాటు చేయాలని పెద్దమనుషులు 1937లో ఒప్పందం చేశారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి కాంక్షిస్తూ ముఖ్యమంత్రి హైకోర్టు ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. కానీ కొందరు కుట్రలు చేస్తున్నారు. అది ఎవరో అందరికీ తెలుసు. ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చి చంద్రబాబు మాట్లాడిన మాటలు ఇక్కడి ప్రజలను రెచ్చగొట్టేలా ఉన్నాయి. అందుకే జేఏసీ నేతలు ఉద్యమాన్ని ఉధృతం చేశారు. వారికి సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నాం. సభలో పాల్గొంటున్నాం. కచ్చితంగా ఈ ప్రాంతానికి న్యాయం జరగాలి. – బుగ్గన, ఆర్థిక శాఖ మంత్రి హైకోర్టు ఏర్పాటు చేసే వరకూ ఉద్యమిస్తాం కర్నూల్లో హైకోర్టు ఏర్పాటుకు ప్రభుత్వం సుముఖంగా ఉంది. కానీ కొన్ని శక్తులు అడ్డుకుంటున్నాయి. ఇటీవల జిల్లా పర్యటనలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అత్యంత దారుణం. పుండుపై కారం చల్లేలా ఆయన మాట్లాడారు. అమరావతి ఒకటే రాజధానిగా ఉండాలని, కర్నూలుకు హైకోర్టు అవసరం లేదని ఆయన టీడీపీ కార్యకర్తలతో నినాదాలు చేయించారు. అందుకే ‘సీమ గర్జన’తో ప్రజల ఆకాంక్షను నేడు తెలుపబోతున్నాం. – విజయ్‌కుమార్‌రెడ్డి, చైర్మన్, రాయలసీమ జేఏసీ స్వార్థ ప్రయోజనాల కోసమే బాబు కుట్రలు స్వార్థ ప్రయోజనాల కోసం కుట్రలు పన్నుతున్న ఏకైక వ్యక్తి టీడీపీ నేత చంద్రబాబు. అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలనే ఆశయంతో సీఎం జగన్మోహన్రెడ్డి ముందుకు వెళ్తున్నారు. కానీ అభివృద్ధి అంతా ఒకే చోట ఉండాలనే ఆలోచనతో చంద్రబాబు అడ్డుకుంటున్నారు. అమరావతి చుట్టూ చంద్రబాబు అనుచరులందరికీ భూములు ఉన్నందున, వారికి నష్టం జరగకూడదని చూస్తున్నారు తప్ప ఇతర ఆలోచన లేదు. తన రియల్ దందా దెబ్బ తింటుందనే ఆవేదనతోనే కుట్రలకు తెర లేపారు. రాయలసీమలో పుట్టిన చంద్రబాబుకు సీమ నెత్తురు ఉంటే కర్నూలుకు న్యాయ రాజధాని వచ్చేలా మద్దతు ప్రకటించాలి. – గుమ్మనూరు జయరాం, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చంద్రబాబు అడ్డంకులు తాత్కాలికమే వేల ఎకరాల పచ్చని పొలాలను రాజధాని పేరుతో తీసుకున్న చంద్రబాబు ప్రభుత్వం వాటిని ఎడారిగా మార్చేసింది. అక్కడ అభివృద్ధి కోసం అంటూ రూ.వేల కోట్లు ఖర్చు చేసినా కనీసం టీ హోటల్ కూడా లేదు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతల అభివృద్ధి కోసం సీఎం జగన్ వికేంద్రీకరణ దిశగా అడుగులు వేస్తున్నారు. చంద్రబాబు లాంటి వాళ్లు ఎంత మంది అడ్డుకున్నా అవి తాత్కాలికమే. రాయలసీమ గర్జనకు మా పూర్తి సహకారం ఉంటుంది. – గడికోట శ్రీకాంత్‌రెడ్డి, విప్, రాయచోటి ఎమ్మెల్యే -
పాలనా వికేంద్రీకరణకు మద్దతుగా కర్నూలులో భారీ సభ
-
‘రాయలసీమ గర్జన సభకు వైఎస్సార్సీపీ పూర్తి మద్దతు’
కర్నూలు: రాయలసీమ గర్జన సభకు వైఎస్సార్సీపీ పూర్తి మద్దతు ఇస్తుందని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ స్పష్టం చేశారు. రాయలసీమ హక్కుల కోసం జేఏసీ పోరాటం చేస్తోందని, కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని జేఏసీ డిమాండ్ చేస్తోందన్నారు. డిసెంబర్ 5వ తేదీన కర్నూలులో జేఏసీ సమావేశం నిర్వహిస్తున్నారని, రాయలసీమ గర్జన పేరుతో ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. రాయలసీమ గర్జన సభకు తమ పార్టీ వైఎస్సార్సీపీ పూర్తి మద్దతు ఇస్తున్నట్లు బుగ్గన పేర్కొన్నారు. చంద్రబాబు అన్ని ప్రాంతాల వారిని మోసం చేశారని, పచ్చటి పొలాలను కూడా నాశనం చేశారని బుగ్గన మండిపడ్డారు. అన్ని ప్రాంతాల అభివృద్ధికి సీఎం జగన్ కృషి చేస్తున్నారనే విషయాన్ని మరోసారి గుర్తుచేశారు మంత్రి.