కర్నూలులో జరిగిన ‘రాయలసీమ గర్జన’కు భారీగా హాజరైన జనసందోహంలోని ఓ భాగం
సాక్షి ప్రతినిధి, కర్నూలు: రాయలసీమ గర్జన పేరుతో ‘సీమ’వాసులు సోమవారం కర్నూలులో సింహనాదం చేశారు. ‘సీమవాసుల న్యాయమైన’ ఆకాంక్షను యావత్ రాష్ట్రానికి తెలిసేలా గర్జించారు. హైకోర్టు సాధించేవరకూ విశ్రమించేది లేదని, ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని శపథం చేశారు. ‘జై రాయలసీమ.. ఉయ్ వాంట్ జ్యుడీషియల్ క్యాపిటల్’ అంటూ కర్నూలు నగరం హోరెత్తేలా.. దిక్కులు పిక్కటిల్లేలా నినదించారు. ‘రాయలసీమ గర్జన’ పేరుతో పొలిటికల్, నాన్ పొలిటికల్ జేఏసీలు నగరంలోని ఎస్టీబీసీ మైదానంలో నిర్వహించిన భారీ బహిరంగసభ ప్రజలతో పోటెత్తింది.
ఉదయం 10 గంటలకే ‘సీమ’ జిల్లాల నుంచి ప్రజలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు భారీగా తరలివచ్చారు. సభా ప్రాంగణం నిండిపోవడంతో సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రజలు రోడ్డు బయటే నిలుచుండిపోయారు. కర్నూలులోని అన్ని రహదారులు జనసంద్రమయ్యాయి. మధ్యాహ్నం 1.30 గంటల వరకూ సభ జరుగుతున్నంతసేపు ‘న్యాయ రాజధాని’ కావాలని నినాదాలు చేశారు.
ఫ్లెక్సీలపై ‘న్యాయ రాజధాని మా హక్కు’ అని రాసి వాటిని బెలూన్లకు జత చేసి గాలిలోకి వదిలారు. ఫ్లకార్డులు ప్రదర్శించి నినాదాలు చేశారు. అందరి నోట ‘న్యాయ రాజధాని’ మాటే పలికింది. కర్నూలు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు బీవై రామయ్య అధ్యక్షతన జరిగిన సభలో మంత్రులు, ప్రజాప్రతినిధులు, జేఏసీ నేతలు ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎవరేమన్నారంటే..
కర్నూలులో రాయలసీమ గర్జనకు హాజరైన అశేష జనవాహినిలో ఓ భాగం
‘న్యాయ రాజధాని’ నిర్మించేది జగన్ ప్రభుత్వమే..
రాయలసీమకు న్యాయం చేసేది.. న్యాయ రాజధానిని నిర్మించేది జగన్ ప్రభుత్వం మాత్రమే. ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కువగా సీమ ముఖ్యమంత్రులే ఉన్నారు. చంద్రబాబు ఎక్కువ కాలం సీఎంగా పనిచేశారు. అయితే అందరూ హైదరాబాద్‌నే అభివృద్ధి చేశారు. మన రాష్ట్రంలో ఏ నగరాన్నీ అభివృద్ధి చేయలేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మూడు ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలని వికేంద్రీకరణ తీసుకొచ్చారు.
అమరావతిలో రాజధాని వద్దనలేదు. అక్కడ శాసన వ్యవహారాలు, విశాఖపట్నంలో పాలన రాజధాని ఉంటూనే కర్నూలులో న్యాయరాజధాని నిర్మించాలనుకున్నారు. ప్రజల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోకుండా చంద్రబాబు అమరావతిని రాజధాని చేయాలనుకున్నారు. అమరావతిపై కూడా ఆయనకు ప్రేమలేదు. ఆయన బంధు, అనుచరగణం రూ.వేల కోట్లు దోచుకునేందుకు మాత్రమే అక్కడ రాజధాని నిర్మించాలనుకున్నారు. ఇటీవల కర్నూలుకు వచ్చి హేళన చేస్తూ మాట్లాడి ‘సీమద్రోహి’గా మిగిలిపోయారు.
– పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గనులు, ఇంధన శాఖ మంత్రి
కర్నూలు జగన్నాథగట్టుపై హైకోర్టు..
ఎన్ని శక్తులు అడ్డుపడినా, చంద్రబాబులాంటోళ్లు ఎన్ని కుట్రలు చేసినా కర్నూలు జగన్నాథగట్టుపై హైకోర్టు నిర్మిస్తాం. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయడం చంద్రబాబుకు ఇష్టం ఉందో.. లేదో చెప్పాలి. శతాబ్దాల నుంచి అనేక కరువు కాటకాలను ‘సీమ’ చవిచూసింది. విజయనగర సామ్రాజ్యంలో భరత ఖండంలోనే అత్యంత సంపన్న ప్రాంతంగా ఉన్న సీమ ఇలా తయారైంది. ఇన్ని దశాబ్దాల తర్వాత బాధ్యత గల వ్యక్తి సీమకు హైకోర్టు ఇస్తా అంటే ఎందుకు అడ్డుపడుతున్నారు.
మూడు ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలని మా ముఖ్యమంత్రి తపన పడుతున్నారు. చంద్రబాబుకు కృష్ణా, గుంటూరుతో పాటు రాష్ట్రంలో ఏ ప్రాంతంపైనా ప్రేమ లేదు. చంద్రబాబుకు, ఆయన రియల్ ఎస్టేట్ బ్యాచ్‌కు ఉన్న ప్రేమ రాజధాని కోసం సేకరించిన 30 చదరపు కిలోమీటర్ల భూమిపైనే. శ్రీబాగ్ ఒప్పందం, ఆరు సూత్రాలు, 8 సూత్రాల ఒప్పందాలు కర్నూలుకు అనుకూలంగా ఉన్నాయి. శ్రీకృష్ణ, శివరామకృష్ణ కమిటీలు సైతం సమత్యుల అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని చెప్పాయి.
– బుగ్గన రాజేంద్రనాథ్, ఆర్థిక శాఖ మంత్రి
26 జిల్లాల అభివృద్ధి సీఎం సంకల్పం
దశాబ్దాలుగా సీమ వాసులకు అన్యాయం జరుగుతోంది. చంద్రబాబు కర్నూలుకు వచ్చి ఇక్కడి టీడీపీ నేతలతో అమరావతికి అనుకూలంగా, సీమకు వ్యతిరేకంగా నినాదాలు చేయించి మన ప్రాంతాన్ని హేళన చేశారు. 29 గ్రామాలు అభివృద్ధి చంద్రబాబు ఆలోచన కాగా 26 జిల్లాల అభివృద్ధి ముఖ్యమంత్రి సంకల్పం.
– అంజాద్‌బాషా, డిప్యూటీ సీఎం
‘సీమ’కు న్యాయం చేసింది నాడు వైఎస్సార్.. నేడు జగన్
ఎందరో ముఖ్యమంత్రులు రాష్ట్రాన్ని పాలించారు. సీమకు మేలు చేసింది ఇద్దరే. సాగునీటి ప్రాజెక్టులు నిర్మించి వైఎస్ కరువు పోగొడితే.. న్యాయ రాజధానిని నిర్మించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని జగన్ భావించారు.
– ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ కర్నూలు, నంద్యాల జిల్లాల రీజినల్ కోఆర్డినేటర్
త్యాగానికి కూడా హద్దు ఉంటుంది..
1956లో అప్పటికి రాజధానిగా ఉన్న కర్నూలును త్యాగం చేశాం. అలాగే శ్రీశైలం ప్రాజెక్టుకు 80 వేల ఎకరాల భూములిచ్చాం. త్యాగానికి, ధర్మానికి కూడా హద్దుంటుంది. లేదంటే అన్యాయమవుతాం.
– కాటసాని రాంభూపాల్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, నంద్యాల జిల్లా
మాది త్యాగం కాదా?
రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం భూములిచ్చిన అమరావతి వాసులది త్యాగమైతే, శ్రీశైలం ప్రాజెక్టుకు భూములు ఇచ్చిన మనది త్యాగం కాదా? భూములు కోల్పోయినవారు ఇప్పటికీ 98 జీవో ప్రకారం ఉద్యోగాలు ఇవ్వాలని పోరాటం చేస్తున్నారు. చంద్రబాబు జీవో 69 తీసుకొచ్చి సీమ రైతులు, జీవో 120 తీసుకొచ్చి విద్యార్థుల పొట్ట కొట్టారు. ‘అనంత’కు మంజూరైన ఎయిమ్స్‌ను మంగళగిరికి తరలించి మోసం చేశారు.
– బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, శాప్ చైర్మన్
ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం..
న్యాయ రాజధాని మా హక్కు. చంద్రబాబు ఇటీవల కర్నూలుకు వచ్చి మాట్లాడిన మాటలు గర్హనీయం. ముఖ్యమంత్రి న్యాయ రాజధానికి సుముఖంగా ఉన్నారు. కానీ కొన్ని శక్తులు అడ్డుపడుతున్నాయి. ఉద్యమాలను మరింత ఉధృతం చేసి వారిపై ఒత్తిడి తెస్తాం.
– విజయ్‌కుమార్‌రెడ్డి, జేఏసీ చైర్మన్
‘‘రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన ప్రాంతం.. రాయలసీమ. రాజధాని కోసం కర్నూలును, శ్రీశైలం ప్రాజెక్టు కోసం 55 వేల ఎకరాల భూములను ఈ ప్రాంతం త్యాగం చేసింది. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం రాజధాని కర్నూలులో ఉండాలి. కనీసం హైకోర్టునైనా కర్నూలులో పెట్టండని అడిగితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముందుకొచ్చి హైకోర్టు ఏర్పాటుపై నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు, కొన్ని ప్రతిపక్షాలు దాన్ని అడ్డుకుంటున్నాయి.
ఏం చేస్తున్నార్రా అని మా పిల్లలను అడిగితే హైదరాబాద్‌లో ఉద్యోగం, బెంగళూరులో చదువు, చెన్నైలో శిక్షణ తీసుకుంటున్నామంటున్నారు. ఎన్నేళ్లయినా మా ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్తే తప్ప బతకలేమా? వాటికి సమానంగా ఒక నగరాన్ని నిర్మించుకోలేమా? త్యాగాలకు కూడా ఒక హద్దు ఉంటుంది. ఇప్పుడు ఉద్యమాలు చేయాలి.. కచ్చితంగా హైకోర్టు ఏర్పాటు చేసుకోవాలి’’
– రాయలసీమ గర్జనలో జేఏసీ నేతలు, ప్రజాప్రతినిధులు
Comments
Please login to add a commentAdd a comment