సాక్షి, కర్నూలు: రాయలసీమ ముఖద్వారమైన కర్నూలు మరో చరిత్రాత్మక ఘట్టానికి వేదికైంది. దశాబ్దాల తరబడి కొనసాగుతున్న అన్యాయంపై రాయలసీమ వాసులు గళమెత్తారు. కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటుకు ఉద్యమ బాట పట్టారు. ‘రాయలసీమ గర్జన’ పేరుతో సోమవారం ఎస్టీబీసీ కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు.
సభకు భారీగా రాయలసీమ వాసులు తరలివచ్చారు. దీంతో కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటే లక్ష్యంగా చేపట్టిన రాయలసీమ గర్జన సూపర్ సక్సెస్ అయ్యింది. గర్జనకు మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్, అంజాద్ బాషా, జయరాం, ఉషశ్రీచరణ్, ఎమ్మెల్యేలు శ్రీకాంత్‌రెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి తదితరులు హాజరయ్యారు.
న్యాయ రాజధానిపై జనం నినదించారు. శ్రీబాగ్ ఒప్పందం అమలు, న్యాయ రాజధాని ఏర్పాటుకు డిమాండ్ చేశారు. వెనుకబడిన రాయలసీమ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్నారు. నారాసుర భూతం దిష్టిబొమ్మను సీమ జనం దగ్ధం చేశారు. రాయలసీమ ద్రోహి అంటూ నినాదాలు చేశారు.
సభకు మేధావులు, విద్యావంతులు, న్యాయవాదులు, విద్యార్థి సంఘాలతో పాటు అన్ని వర్గాల ప్రజలు మద్దతు ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలనే నినాదంతో ముందుకు వెళ్తున్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాయలసీమ గర్జనకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ సభకు కర్నూలుతో పాటు నంద్యాల, వైఎస్సార్, అన్నమయ్య, అనంతపురం, శ్రీ సత్యసాయి పుట్టపర్తి, తిరుపతి, చిత్తూరు జిల్లాలతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ప్రజా సంఘాల నాయకులు, మేధావులు, న్యాయవాదులు, ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు.
స్వప్రయోజనాల కోసమే చంద్రబాబు ఆరాటం: మంత్రి పెద్దిరెడ్డి
వికేంద్రీకరణ కోసమే సీఎం జగన్ మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేయాలన్నదే సీఎం జగన్ లక్ష్యమన్నారు. చంద్రబాబుకు అసలు చిత్తశుద్ధి లేదని, స్వప్రయోజనాల కోసమే ఆయన ఆరాటం అని పెద్దిరెడ్డి దుయ్యబట్టారు.
హైకోర్టు సాధించే వరకూ పోరాటం ఆగదు: మంత్రి బుగ్గన
వికేంద్రీకరణతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పేర్కొన్నారు. వికేంద్రీకరణను వ్యతిరేకించే పార్టీలకు బుద్ధి చెప్పేందుకు ఈ రాయలసీమ గర్జన అన్నారు. చంద్రబాబు కుప్పంలో అభివృద్ధి చేయలేకపోయారు. కుప్పాన్ని అన్ని విధాల సీఎం జగన్ అభివృద్ధి చేశారు. చంద్రబాబు దృష్టిలో ఇది రాళ్ల సీమ.. మా దృష్టిలో రత్నాల సీమ. రియల్టర్లపైనే చంద్రబాబుకు ప్రేమ. రాయలసీమకు హైకోర్టు ఇస్తానంటే ఎందుకు అడ్డుపడుతున్నారు. హైకోర్టు సాధించే వరకూ పోరాటం ఆగదని, మంత్రి బుగ్గన స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment